Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు-producer suresh babu on theatres shutting down says ott hurting them ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suresh Babu On Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

Hari Prasad S HT Telugu
May 17, 2024 05:45 PM IST

Suresh Babu on Theatres: తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడటంపై నిర్మాత సురేశ్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓటీటీ దెబ్బ తీస్తోందని, థియేటర్లను ఫంక్షన్ హాల్స్ గా మార్చేసే పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డాడు.

ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు
ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

Suresh Babu on Theatres: థియేటర్లు మూతపడటంపై టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసేశారు. దీనిపై తాజాగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించాడు. థియేటర్లు మూతపడటం తప్ప మరో మార్గం లేదని అతడు అనడం గమనార్హం.

ఓటీటీ దెబ్బ తీస్తోంది

తెలంగాణలో పది రోజుల పాటు చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. కొన్ని థియేటర్లే మూత పడ్డాయని, చాలా వరకు నడుస్తున్నాయని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చెబుతోంది. అయితే తాజాగా ఈ అంశంపై నిర్మాత సురేష్ బాబు మాట్లాడాడు. తమను ఓటీటీలు బాగా దెబ్బ తీస్తున్నాయని, ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్లలో కాకుండా వాటిలోనే సినిమాలు చూస్తున్నారని అన్నాడు.

"అప్పట్లో ఎండాకాలంలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చేవాళ్లు. బయట ఎండ వేడి తట్టుకోవడానికి థియేటర్లలో ఏసీ కోసం అలా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఓటీటీల వల్ల ఎంతో కంటెంట్ ప్రేక్షకుల దగ్గరికి చేరింది. దీంతో సిల్వర్ స్క్రీన్ పై మరీ అత్యుత్తమమైన కంటెంట్, లేదంటే మంచి స్టార్ రేటింగ్ వచ్చిన సినిమాలే చూస్తున్నారు.

దీంతో థియేటర్లకు ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. బహుషా థియేటర్లను ఫంక్షన్ హాళ్లలాగానో, రియల్ ఎస్టేట్ వెంచర్లలాగో మార్చాల్సి రావచ్చు తప్ప పెద్దగా చేసేది ఏమీ లేదు" అని సురేష్ బాబు అనడం గమనార్హం.

ఐపీఎల్ ఎందుకు చూస్తారు?

సినిమాలు లేని సమయంలో థియేటర్లలో ఐపీఎల్ మ్యాచ్ లను ప్రదర్శించవచ్చు కదా అన్న ప్రశ్నకు కూడా సురేష్ బాబు స్పందించాడు. "ఐపీఎల్ ను ప్రేక్షకులు తమ మొబైల్స్ లో ఫ్రీగా చూసుకునే వీలుంది. వాళ్లు టికెట్లు కొని థియేటర్లలో ఎందుకు చూస్తారు?" అని ప్రశ్నించాడు.

"ఇక నుంచి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే నడుస్తాయి. అందుకే దర్శకులు అలాంటి వాటిపై దృష్టి సారించాలి. అంతేకాదు తమ సినిమాలను డిజిటల్ మీడియాలో పెద్ద ఎత్తున మార్కెట్ చేసి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చేయాలి" అని సురేష్ బాబు అభిప్రాయపడ్డాడు.

అతని మాటలను బట్టి చూస్తే ఓటీటీ, ఐపీఎల్ థియేటర్లను బాగానే దెబ్బ కొట్టినట్లు స్పష్టమవుతోంది. పైగా ఈ వేసవిలో పెద్ద హీరోల సినిమాలు కూడా లేకపోవడం కూడా థియేటర్లు మూతపడటానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక తెలుగులో నిజానికి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రోజురోజూకీ తగ్గిపోతున్నాయి. పక్కా కమర్షియల్ సినిమాలు తప్ప మన దర్శకులు కంటెంట్ ను పట్టించుకోవడం లేదు.

దీంతో ప్రేక్షకులు ఓటీటీల్లోని మలయాళం, ఇతర ఇండస్ట్రీల సినిమాల వైపు చూస్తున్నారు. కంటెంట్, స్టోరీ టెల్లింగ్ అంతా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుండటంతో ఓటీటీల్లో ఆ భాషల సినిమాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఈ మధ్య కాలంలో మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన దాదాపు అన్ని సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు ఆడియో లేకపోయినా సబ్ టైటిల్స్ తోనూ వాటిని చూస్తుండటం విశేషం.

Whats_app_banner