Prakash Raj Furious: అవి మొరిగే కుక్కలే కానీ కరిచేవి కావు: ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు
Prakash Raj Furious: అవి మొరిగే కుక్కలే కానీ కరిచేవి కావు అంటూ ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బాయ్‌కాట్ పఠాన్ పిలుపునిచ్చిన వారిని ఉద్దేశించి అతడు ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.
Prakash Raj Furious: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి చాలా ఘాటుగా స్పందించాడు. మొదటి నుంచీ ప్రధాని మోదీ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న అతడు.. తాజాగా పఠాన్ మూవీని నిషేధించాలని పిలుపునిచ్చిన వారి గురించి మాట్లాడుతూ అవి మొరిగే కుక్కలే అని అనడం గమనార్హం. కేరళలో జరిగిన ఓ లిటరేచర్ ఫెస్టివల్ లో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నాడు.
షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ రిలీజ్ కాకముందే పలువురు ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలన్న పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం రిలీజ్ తర్వాత ఆ బాయ్‌కాట్ పిలుపులను అధిగమించి రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు దీనిని ఉద్దేశించే ప్రకాశ్ రాజ్ అలా స్పందించాడు.
ఆదివారం కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఈవెంట్ లో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా అతడు మాట్లాడుతూ.. "పఠాన్ ను నిషేధించాలని వాళ్లు అన్నారు. అది రూ.700 కోట్లు వసూలు చేసింది. పఠాన్ మూవీని బ్యాన్ చేయాలన్న ఈ ఇడియట్స్ తమ మోదీ సినిమాను రూ.30 కోట్ల వరకూ నడిపించలేకపోయారు. వాళ్లు కేవలం మొరుగుతారు. కరవరు. ఏం కాదు. సౌండ్ పొల్యూషన్ అంతే" అని ప్రకాశ్ అనడం విశేషం.
పఠాన్ సినిమాను బ్యాన్ చేయాలన్న వారి పిలుపులు ఫలించని నేపథ్యంలో అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రకాశ్ రాజ్ అన్నాడు. నిజానికి ఈ మూవీ రిలీజ్ కు ముందే బేషరమ్ రంగ్ పాట తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అందులో దీపికా పదుకోన్ కాషాయ రంగు బికినీ వేసుకోవడం వివాదానికి కారణమైంది. ఆ సమయంలో ప్రకాశ్ రాజ్ ఆమెను వేసుకేసుకొచ్చాడు.
"సిగ్గు లేని దురభిమానులు. కాషాయం వేసుకున్న వ్యక్తులు రేపిస్టులకు దండలు వేస్తే ఓకేనా? విద్వేషపూరిత ప్రసంగాలు చేసినప్పుడు, కాషాయం ధరించిన స్వామిజీ మైనర్లను రేప్ చేసినప్పుడు ఏం కాదు. కానీ ఓ సినిమాలో డ్రెస్ వేసుకుంటే వచ్చిందా" అంటూ అప్పట్లో ప్రకాశ్ రాజ్ అన్నాడు.
సంబంధిత కథనం