Pawan Kalyan Star Maa movies: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే.. స్టార్ మా మూవీస్‌లో రోజంతా పవర్ స్టార్ సినిమాలే-pawan kalyan birthday special star maa movies tholi prema bheemla nayak atharintiki daaredi jalsa khushi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Star Maa Movies: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే.. స్టార్ మా మూవీస్‌లో రోజంతా పవర్ స్టార్ సినిమాలే

Pawan Kalyan Star Maa movies: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే.. స్టార్ మా మూవీస్‌లో రోజంతా పవర్ స్టార్ సినిమాలే

Hari Prasad S HT Telugu
Sep 02, 2024 09:09 AM IST

Pawan Kalyan Star Maa movies: పవర్ స్టార్ పవన్ కల్యాన్ అభిమానులకు ఈ సోమవారం (సెప్టెంబర్ 2) పండగే అని చెప్పాలి. అతని పుట్టిన రోజు సందర్భంగా రోజంతా స్టార్ మా మూవీస్ లో అతని సినిమాలే రానున్నాయి. ఏకంగా ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉండటం విశేషం.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే.. స్టార్ మా మూవీస్‌లో రోజంతా పవర్ స్టార్ సినిమాలే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే.. స్టార్ మా మూవీస్‌లో రోజంతా పవర్ స్టార్ సినిమాలే

Pawan Kalyan Star Maa movies: పవన్ కల్యాణ్ సోమవారం (సెప్టెంబర్ 2) తన 56వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల వల్ల పుట్టిన రోజు సంబరాలు, కొత్త సినిసిమాల అనౌన్స్‌మెంట్స్ ఏమీ లేకపోయినా.. టీవీల్లో అతని సినిమాల హంగామా మామూలుగా లేదు.

స్టార్ మా మూవీస్‌లో పవన్ మూవీస్

పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా రోజంతా పవర్ స్టార్ సినిమాలనే టెలికాస్ట్ చేయనుంది స్టార్ మా మూవీస్ ఛానెల్. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ పవన్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన మూవీసే కావడం విశేషం.

ఉదయం 9 గంటలకు తొలిప్రేమ తో ఈ సినిమాల వరద ప్రారంభం కానుంది. పవర్ స్టార్ కెరీర్లో తొలి బ్లాక్‌బస్టర్ ఈ మూవీ. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు భీమ్లా నాయక్ రానుంది. ఇక 3 గంటలకు జల్సా, సాయంత్రం 6 గంటలకు అత్తారింటికి దారేది, రాత్రి 9 గంటలకు ఖుషీ సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

పవన్‌కు స్పెషల్ బర్త్ డే

పవన్ కల్యాణ్ కు ఇది నిజంగా ఓ ప్రత్యేకమైన బర్త్ డేనే. ఇన్నాళ్లూ ఓ స్టార్ హీరోగా తన పుట్టిన రోజు జరుపుకుంటూ వచ్చిన అతడు.. తొలిసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో 56వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అయితే ఈ స్పెషల్ బర్త్ డేను ఘనంగా జరుపుకునే అవకాశం లేకుండా పోయింది.

రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జనం అల్లాడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో విజయవాడలాంటి నగరం ముంపుకు గురవడంతో ఓ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ సహాయ చర్యలపైనే దృష్టి సారించారు.

ఆ రెండు సినిమాల అనౌన్స్‌మెంట్స్ రద్దు

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే పవన్ కల్యాణ్‌ బర్త్ డే సందర్భంగా రావాల్సిన రెండు సినిమాల అనౌన్స్‌మెంట్స్ రద్దు చేశారు. ఓజీ మూవీ నుంచి టీజర్ లాంటిది ఏదో వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. పుట్టిన రోజు నాడు రిలీజ్ చేయబోతున్నట్లు గతంలోనే నిర్మాత డీవీవీ దానయ్య కూడా అనౌన్స్ చేశాడు. అయితే వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయడం లేదని ఆదివారం (సెప్టెంబర్ 1) రాత్రే స్పష్టం చేశారు.

అటు హరి హర వీర మల్లు మూవీ నుంచి కూడా ఓ పోస్టర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ వాళ్లు కూడా ఒక రోజు ముందే దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో కుండపోత వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో పవన్ బర్త్ డేను ఎంతో ఘనంగా జరుపుకుందామని అనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది.

అయితే స్టార్ మా మూవీస్ ఆ లోటు తీరుస్తోంది. రోజంతా పవన్ హిట్ సినిమాలతో అభిమానులను అలరించనుంది.