OTT News: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వచ్చేస్తున్న సూపర్ హిట్ బయోపిక్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?-ott news in telugu srikanth movie ott streaming from friday 5th july on netflix rajkumar rao movie srikanth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott News: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వచ్చేస్తున్న సూపర్ హిట్ బయోపిక్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

OTT News: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వచ్చేస్తున్న సూపర్ హిట్ బయోపిక్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Jul 04, 2024 11:37 AM IST

OTT News: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ సూపర్ హిట్ బయోపిక్ మూవీ వస్తోంది. మన ఆంధ్రా ఆంత్రప్రెన్యూర్ అయిన శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఆదరణ లభించింది.

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వచ్చేస్తున్న సూపర్ హిట్ బయోపిక్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో వచ్చేస్తున్న సూపర్ హిట్ బయోపిక్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

OTT News: థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత బయోపిక్ మూవీ శ్రీకాంత్ ఓటీటీలోకి వస్తోంది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ నటించిన ఈ సినిమా మన ఆంధ్రా ఆంత్రప్రెన్యూర్ శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కింది. తుషార్ హీరానందానీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జ్యోతిక, అలయా ఎఫ్, శరద్ కేల్కర్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.

శ్రీకాంత్ ఓటీటీ రిలీజ్ డేట్

మన ఏపీకి చెందిన పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్ల జీవితం ఆధారంగా బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్లో నటించిన మూవీ శ్రీకాంత్. ఈ సినిమా రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదనిపించింది. ఇప్పుడీ మూవీ శుక్రవారం (జులై 5) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే మరికొన్ని గంటల్లోనే మూవీ రాబోతోంది.

పర్యావరణహిత వస్తువులు తయారు చేసే బొల్లాంట్ ఇండస్ట్రీస్ తో శ్రీకాంత్ బొల్ల పాపులర్ అయ్యారు. మచిలీపట్నం దగ్గర సీతారామపురంలో జన్మించిన శ్రీకాంత్.. చిన్నప్పటి నుంచే కంటిచూపు కోల్పోయారు. చిన్నప్పటి నుంచే చూపు లేకపోవడంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆయన.. తర్వాత ఎలా తన జీవితంలో అద్భుతాలను సృష్టించారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

శ్రీకాంత్ పాత్రలో జీవించిన రాజ్ కుమార్ రావ్

శ్రీకాంత్ పాత్రలో రాజ్ కుమార్ రావ్ జీవించేశాడు. ఈ సినిమాలో ఆ పాత్ర పోషించడంపై గతంలో అతడు స్పందించాడు. ఓ ఆదర్శప్రాయుడైన వ్యక్తి పాత్రను పోషిస్తుండటంతో తాను సినిమాకు ముందు ఎలాంటి ప్లానింగ్ లేకుండానే చేసినట్లు తెలిపాడు. రెండు, మూడేళ్ల కిందట అసలు తాను ఈ సినిమా తీయగలనని అనుకోలేదని, కానీ తర్వాత విజయవంతంగా మూవీని పూర్తి చేశాడు.

శ్రీకాంత్ మూవీకి తొలి షో నుంచే మంచి రివ్యూలు వచ్చాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా ఇండియాలో రూ.11.95 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. గత నెల 17 వరకు చూసుకుంటే.. ఈ మూవీ ఇండియాలో మొత్తంగా రూ.59.58 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టగా.. విదేశాల్లో రూ.3.34 కోట్లు వచ్చాయి. దీంతో మొత్తం రూ.62.92 కోట్లు వసూలు చేసినట్లయింది.

ఎవరీ శ్రీకాంత్ బొల్ల?

శ్రీకాంత్ బొల్లా 1991 సంవత్సరంలో జన్మించారు. కంటి చూపు లేకుండా జన్మించటంతో పుట్టిన వెంటనే అతడిని వదిలించుకోవాలని తల్లిదండ్రులకు కొందరు బంధువులు సలహాలు ఇచ్చారని సమాచారం ఉంది. అయితే, తల్లిదండ్రులు మాత్రం శ్రీకాంత్‍ను పట్టుదలతో చదివించేందుకు నిర్ణయించారు. కళ్లు సరిగా కనిపించని కారణంగా స్కూల్‍లోనూ తోటి విద్యార్థులతో మాటలు పడ్డారు శ్రీకాంత్ బొల్లా.

శ్రీకాంత్ బొల్లా సొంతఊరు ఆంధ్రప్రదేశ్‍లోని మచిలీపట్నం. వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. అయితే, తనకు కంటి చూపు లేని ప్రతికూలతను అనుకూలంగా మార్చుకొని ఆయన కష్టపడ్డారు. చదువులో రాణించారు. అమెరికాలోని MIT నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా శ్రీకాంత్ బొల్లా చరిత్రకు ఎక్కారు.

శ్రీకాంత్ బొల్లా ప్రస్తుతం పారిశ్రామికవేత్తగా ఉన్నారు. హైదరాబాద్‍లో ఆయన బొల్లాంట్ ఇండస్ట్రీస్ అనే సంస్థను స్థాపించారు. ఆయనకు అమెరికాలో కార్పొరేట్ ఉద్యోగ అవకాశాలు వచ్చినా.. ఇండియాలోనే తన ఆవిష్కరణలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. 2012లో శ్రీకాంత్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించాక.. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా ఫండింగ్ చేశారు.

చెట్లు, మొక్కల ఆధారంగా ఈ కంపెనీ పర్యావరణహిత ప్రొడక్టులను తయారు చేస్తోంది. ఈ సంస్థ ద్వారా వందలాది మంది దివ్యాంగులకు శ్రీకాంత్ ఉపాధి కల్పిస్తున్నారు. ఆసియాలో 30 ఏళ్లలోపు 30 మంది అంటూ 2017లో ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రచురించిన జాబితాలో శ్రీకాంత్ బొల్లాకు చోటు దక్కింది.

Whats_app_banner