OTT Thriller Web Series: ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేస్తున్న తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Thriller Web Series: ఓటీటీలోకి మరో తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. తాజాగా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా సాగింది.
OTT Thriller Web Series: థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే ఇష్టపడే వారికి ఓ గుడ్ న్యూస్. ఓటీటీలోకి అలాంటి ఓ మైథలాజికల్ థ్రిల్లర్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు ఐంధమ్ వేదమ్. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా శుక్రవారం (అక్టోబర్ 11) ఈ వెబ్ సిరీస్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఫిల్మ్ మేకర్ నాగ ఈ సిరీస్ డైరెక్ట్ చేశాడు.
ఐంధమ్ వేదమ్ ఓటీటీ రిలీజ్ డేట్
ఐంధమ్ వేదమ్ (ఐదో వేదం) ఓ తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ ను అక్టోబర్ 25 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్ ఈ సిరీస్ లో నటిస్తున్నారు. నాగ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు. 1990ల్లో వచ్చిన మర్మదేశం గుర్తుంది కదా. ఆ సిరీస్ డైరెక్ట్ చేసింది ఈ నాగే. దీంతో ఐంధమ్ వేదమ్ సిరీస్ పై అంచనాలు పెరిగిపోయాయి.
ఈ వెబ్ సిరీస్ టీజర్ పురావస్తు శాఖ తవ్వకాల్లో ఓ ప్రాచీన గ్రంథం బయటపడటంతో మొదలవుతుంది. అయితే అందులోని భాష మాత్రం ఎవరికీ అర్థం కాదు. అదే సమయంలో అందులోని కోడ్ ను డీకోడ్ చేసే ప్రయత్నాలు మొదలవుతాయి. అయితే అక్కడే టీజర్ ఇంటెన్స్ గా మారుతుంది. ఈ క్రమంలో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఏవేవో పాత్రలు సీన్ లోకి ఎంటరవుతుంటాయి. ఇలా సిరీస్ పై ఈ టీజర్ ఆసక్తి రేపుతోంది.
ఐంధమ్ వేదమ్ స్టోరీ ఇదీ..
ఐంధమ్ వేదమ్ వెబ్ సిరీస్ అను అనే ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. తన తల్లి అంత్యక్రియలు జరపడానికి వారణాసి వెళ్తుంది. అక్కడ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె చేతుల్లో ఓ బాక్స్ పెట్టి.. దానిని తమిళనాడులోని ఓ ఆలయ పూజారికి ఇవ్వాల్సిందిగా చెబుతాడు. ఐదో వేదంలోని రహస్యాలను వెలికి తీయడానికి అవసరమైన వస్తువు అందులో ఉంటుందని భావిస్తారు.
అయితే దానిని తీసుకెళ్లే క్రమంలో అను ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. తనకు ఎదురయ్యే ప్రమాదాల నుంచి ఆమె బయటపడుతుందా? చివరికి తనకు అప్పగించిన ఆ పనిని పూర్తి చేస్తుందా? ఆ బాక్స్ లోని వస్తువు, ఐదో వేదానికి ఉన్న లింకేంటి అన్న విషయాలు ఈ వెబ్ సిరీస్ లోనే చూడాలి.
అభిరామి మీడియా వర్క్స్ ఈ సిరీస్ ను నిర్మించింది. సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వైజీ మహేంద్ర, కృష్ణ కురుప్, రామ్‌జీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ లాంటి వాళ్లు ఇందులో నటించారు. తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది.