OTT Comedy Movie: ఓటీటీలో దుమ్ము రేపుతున్న లేటెస్ట్ తెలుగు కామెడీ మూవీ.. అరుదైన రికార్డు సొంతం
OTT Comedy Movie: ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన తెలుగు కామెడీ మూవీ దూసుకెళ్తోంది. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మాత్రం ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దీంతో తాజాగా ఈ సినిమా ఓ అరుదైన మైలురాయి అందుకుంది.
OTT Comedy Movie: ఓటీటీల్లో చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని తాజాగా మరో కామెడీ మూవీ నిరూపించింది. ఈ సినిమా పేరు మారుతీనగర్ సుబ్రమణ్యం. ఈ నెల 20వ తేదీన ఆహా వీడియో ఓటీటీలోకి వచ్చిందీ మూవీ. రావు రమేష్ లీడ్ రోల్లో నటించిన ఈ కామెడీ డ్రామా.. పది రోజుల్లో రికార్డులు కొల్లగొడుతూ దూసుకెళ్తోంది.
మారుతీనగర్ సుబ్రమణ్యం రికార్డు
ఆహా ఓటీటీలో మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ మరో మైలురాయిని దాటేసింది. ఈ సినిమా 150 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ మార్క్ దాటినట్లు సదరు ఓటీటీ సోమవారం (సెప్టెంబర్ 30) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. సెప్టెంబర్ 20న ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ మూవీ.. పది రోజుల్లోనే ఈ మార్క్ అందుకోవడం విశేషం.
"150 మిలియన్ ప్లస్ నాన్ స్టాప్ నవ్వులు, వినోదం. మారుతీనగర్ సుబ్రమణ్యం ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. ఈ సందర్భంగా 150 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ మైలురాయికి సంబంధించి ఓ ప్రత్యేకమైన పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ ఎలా ఉందంటే?
మారుతి నగర్ సుబ్రమణ్యం ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ మూవీ. ఫస్ట్ సీన్ నుంచి శుభం కార్డు వరకు ఆడియెన్స్‌ను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకొని దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ మూవీని తెరకెక్కించాడు. అందుకు తగ్గట్లే రావురమేష్, అంకిత్ కొయ్యతో పాటు ప్రతి క్యారెక్టర్ నుంచి ఫన్ జనరేట్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్.
కథ కంటే కామెడీపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. అనుకోకుండా అకౌంట్‌లో లక్షలు, కోట్లలో డబ్బులు పడటం, వాటిని జల్సాలకు వాడుకునే వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసే వారి కథనాలు తరచుగా టీవీల్లో, పేపర్లలో కనిపిస్తుంటాయి.
అలాంటి సంఘటనల నుంచే దర్శకుడు మారుతి నగర్ సుబ్రమణ్యం కథను రాసుకున్నాడు. ఈ సింపుల్ పాయింట్‌తో రెండున్నర గంటలు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడం అంటే కష్టమే. కానీ ఆ విషయంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు.
మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాకు కామెడీనే బలం. కానీ అదే కొన్ని చోట్ల బలహీనంగా మారింది. కామెడీ కోసమే అవసరం లేకపోయినా దర్శకుడు కొన్ని పాత్రలు క్రియేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫన్ విషయంలో ఆకట్టుకున్న దర్శకుడు కీలకమైన ఎమోషన్స్‌లో కొంత తడబాటుకు లోనయ్యాడు. అర్జున్, కాంచన లవ్‌స్టోరీ యూత్ ఆడియెన్స్‌కు కోసమే బోల్డ్‌గా రాసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ లవ్‌స్టోరీ మొత్తం రొటీన్‌గా నడిపించాడు.
మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాకు రావురమేష్ ప్లస్‌పాయింట్‌గా నిలిచాడు. సుబ్రహ్మణ్యం తప్ప రావురమేష్ కనిపించనంతగా ఈ పాత్రలో ఒదిగిపోయాడు. అతడిలోని కామెడీ కోణాన్ని కొత్తగా ఈ మూవీ ఆవిష్కరించింది. ఇంద్రజ సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటుంది.
అంకిత్ కొయ్య కామెడీ టైమింగ్ బాగుంది. బబ్లీగర్ల్ పాత్రలో రమ్య పసుపులేటి ఒకే అనిపించింది. హర్షవర్ధన్, అజయ్, ప్రవీణ్, అన్నపూర్ణమ్మతో పాటు సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ హిలేరియస్‌గా నవ్విస్తే మరికొన్ని తేలిపోయాయి.