Maruthi Nagar Subramanyam Review: మారుతి నగర్ సుబ్రమణ్యం రివ్యూ - రావు రమేష్ హీరోగా నటించిన కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Maruthi Nagar Subramanyam Review: రావురమేష్ హీరోగా నటించిన తొలి మూవీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. కళ్యాణ్ కార్య దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Maruthi Nagar Subramanyam Review: గత కొద్ది రోజులుగా తెలుగు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ కలిగిస్తోన్న చిన్న సినిమాల్లో మారుతి నగర్ సుబ్రమణ్యం ఒకటి. రావురమేష్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ గెస్ట్‌గా రావడం, ఈ సినిమాను అగ్ర దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత రిలీజ్‌చేస్తుండటంతోమారుతి నగర్ సుబ్రమణ్యంపై హైప్ ఏర్పడింది.
లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషించారు. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ చిన్న సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? హీరోగా రావురమేష్‌కు హిట్ దక్కిందా? లేదా? అంటే?
మారుతినగర్ సుబ్రహ్మణ్యం కథ...
ప్రభుత్వ ఉద్యోగం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు మారుతీనగర్‌కు చెందిన సుబ్రమణ్యం(రావురమేష్). డీఎస్‌సీ రాసిన అతడికి టీచర్ జాబ్ వస్తుంది. కోర్టు కేసు కారణంగా ఆ జాబ్ పెండింగ్‌లో పడుతుంది. కోర్టు కేసు క్లియరై టీచర్ జాబ్ తనకు వస్తుందనే ఆశతో పాతికేళ్లుగా ఏ పనీపాట లేకుండా ఎదురుచూస్తుంటాడు. దాంతో ఇంటి బాధ్యతలు భార్యకళారాణిపై (ఇంద్రజ) పడతాయి.
సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య)ది మరో కథ. ఎప్పుడు కలల ప్రపంచంలోనే బతుకుతుంటాడు. తాను అల్లు అర్జున్ తమ్ముడిననే భ్రమలో ఉంటాడు. పేదరికం తెలియజేయడానికి తండ్రి అల్లు అరవింద్ తనను సుబ్రహ్మణ్యం దగ్గర పెంచుతున్నాడని అనుకుంటాడు.
ఓ సందర్భంలో అత్తగారు (అన్నపూర్ణమ్మ) దాచిన డబ్బును సొంతానికి వాడుకొని భార్యకు దొరికిపోతాడు సుబ్రహ్మణ్యం. ఆ విషయంలో భర్తతో కళారాణి గొడవపడుతుంది. చనిపోయిన తన తల్లి అస్థికలను పుణ్యనదుల్లో కలపడానికి తీర్థయాత్రలకు వెళుతుంది కళారాణి.
తల్లి ఇన్సురెన్స్ డబ్బులు పది లక్షలు రావడంతో వాటిని ఇళ్లు కట్టడానికి ఉపయోగించాలని అనుకొని సుబ్రహ్మణ్యం అకౌంట్‌లో వేస్తుంది. భార్యే ఈ డబ్బులు పంపించిందని తెలియక సుబ్రహ్మణ్యం ఆ డబ్బును ఖర్చుపెట్టేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? తీర్థయాత్రల నుంచి భార్య వచ్చే లోపు తిరిగి పది లక్షలు సంపాదించాలని సుబ్రహ్మణ్యం, అర్జున్ ఫిక్సవుతారు?
అందుకోసం వారు ఏం చేశారు? పది లక్షలు ఖర్చయిన విషయం కళారాణికి తెలిసిందా? ఈ కష్టాల కారణంగా అర్జున్, కాంచన (రమ్య పసుపులేటి) లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం కథ.
ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు...
మారుతి నగర్ సుబ్రమణ్యం ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ మూవీ. ఫస్ట్ సీన్ నుంచి శుభం కార్డు వరకు ఆడియెన్స్‌ను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకొని దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ మూవీని తెరకెక్కించాడు. అందుకు తగ్గట్లే రావురమేష్, అంకిత్ కొయ్యతో పాటు ప్రతి క్యారెక్టర్ నుంచి ఫన్ జనరేట్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్.
వాస్తవ ఘటనలతో...
కథ కంటే కామెడీపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. అనుకోకుండా అకౌంట్‌లో లక్షలు, కోట్లలో డబ్బులు పడటం, వాటిని జల్సాలకు వాడుకునే వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసే వారి కథనాలు తరచుగా టీవీల్లో, పేపర్లలో కనిపిస్తుంటాయి.
అలాంటి సంఘటనల నుంచే దర్శకుడు మారుతి నగర్ సుబ్రమణ్యం కథను రాసుకున్నాడు. ఈ సింపుల్ పాయింట్‌తో రెండున్నర గంటలు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడం అంటే కష్టమే. కానీ ఆ విషయంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు.
ఫస్ట్‌హాఫ్ ఫన్...
పాతికేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సుబ్రహ్మణ్యం ఇంట్లో భార్య, అత్త చేత మాటలు పడటం, అతడి కష్టాలు, కొడుకు భ్రమలతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది. ఈ సీన్స్‌లోని సిట్యూవేషనల్ కామెడీ వర్కవుట్ అయ్యింది. రావురమేష్ కామెడీ టైమింగ్, పంచ్‌లు నవ్విస్తాయి. సెకండాఫ్‌లోనే దర్శకుడు అసలు కథలోకి వెళ్లాడు.
భార్య తన అకౌంట్‌లో డబ్బులు వేసిందని తెలియని సుబ్రహ్మణ్యం వాటిని ఖర్చుచేయడం, ఆ డబ్బును కూడబెట్టే ప్రయత్నంలో సుబ్రహ్మణ్యం అర్జున్ తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్లే సీన్స్‌తో ఫన్‌తో పాటు సస్పెన్స్ ఉండేలా రాసుకున్నాడు.
మైండ్‌బ్లోయింగ్ అనుకునేలా కాకపోయినా చిన్న చిన్న ట్విస్ట్‌లతో కొత్త పాత్రల్ని స్క్రీన్‌పై తీసుకొస్తూ సెకండాఫ్‌ను నడిపించాడు. ఈ క్రమంలో కొన్ని చోట్ల లాజికల్‌లు మిస్సయిన వాటిని కామెడీతో కవర్ చేశారు. ఎమోషనల్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేసిన విధానం బాగుంది.
కామెడీనే ప్లస్ ...మైనస్...
మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాకు కామెడీనే బలం. కానీ అదే కొన్ని చోట్ల బలహీనంగా మారింది. కామెడీ కోసమే అవసరం లేకపోయినా దర్శకుడు కొన్ని పాత్రలు క్రియేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫన్ విషయంలో ఆకట్టుకున్న దర్శకుడు కీలకమైన ఎమోషన్స్‌లో కొంత తడబాటుకు లోనయ్యాడు. అర్జున్, కాంచన లవ్‌స్టోరీ యూత్ ఆడియెన్స్‌కు కోసమే బోల్డ్‌గా రాసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ లవ్‌స్టోరీ మొత్తం రొటీన్‌గా నడిపించాడు.
సుబ్రహ్మణ్యం పాత్రలో...
మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాకు రావురమేష్ ప్లస్‌పాయింట్‌గా నిలిచాడు. సుబ్రహ్మణ్యం తప్ప రావురమేష్ కనిపించనంతగా ఈ పాత్రలో ఒదిగిపోయాడు. అతడిలోని కామెడీ కోణాన్ని కొత్తగా ఈ మూవీ ఆవిష్కరించింది. ఇంద్రజ సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటుంది.
అంకిత్ కొయ్య కామెడీ టైమింగ్ బాగుంది. బబ్లీగర్ల్ పాత్రలో రమ్య పసుపులేటి ఒకే అనిపించింది. హర్షవర్ధన్, అజయ్, ప్రవీణ్, అన్నపూర్ణమ్మతో పాటు సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ హిలేరియస్‌గా నవ్విస్తే మరికొన్ని తేలిపోయాయి.
టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్...
మారుతి నగర్ సుబ్రమణ్యం టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్ మూవీ. రావురమేష్ కామెడీ సినిమాకు బలంగా నిలిచింది. కామెడీని ఆశించి థియేటర్‌లో అడుగుపెడితే మాత్రం మారుతి నగర్ సుబ్రమణ్యం డిసపాయింట్ చేయదు.
రేటింగ్: 2.75/5