Ninda Review: నింద రివ్యూ - వరుణ్ సందేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Ninda Review: వరుణ్ సందేశ్ హీరోగా నటించిన నింద మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు రాజేష్ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే?
Ninda Review: వరుణ్ సందేశ్ హిట్టు అనే మాట విని చాలా కాలమైంది. సక్సెస్ కోసం తన స్టైల్ మార్చిన వరుణ్ సందేశ్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో చేసిన మూవీ నింద. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో రూపొందిన ఈ సినిమాకు రాజేష్ జగన్నాథమ్ దర్శకనిర్మాతగా వ్యవహరించాడు. క్యూ మధు, అనీ, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించారు. శుక్రవారం ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నింద మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతో వరుణ్ సందేశ్ విజయాన్ని అందుకున్నాడా? లేదా? అంటే?
మంజును హత్య చేసింది ఎవరు?
మంజు (క్యూ మధు) అనే యువతిని రేప్ చేసి చంపేశాడని కాండ్రకోటకు చెందిన బాలరాజును (ఛత్రపతి శేఖర్) పోలీసులు అరెస్ట్ చేస్తారు. బాలరాజు పొలంలోనే మంజు శవం దొరుకుతుంది. అంతే కాకుండా పోలీస్ ఇన్వేస్టిగేషన్‌తో పాటు డీఎన్ఏ రిపోర్ట్స్ లో బాలరాజు తప్పు చేశాడని నిరూపణ కావడంతో అతడికి జడ్జ్ సత్యానంద్ (తనికెళ్లభరణి) అతడికి ఉరిశిక్ష విధిస్తాడు.
కానీ బాలరాజు నేరం చేయలేదని సత్యానంద్ నమ్ముతాడు. నిర్ధోషికి శిక్ష పడుతుందనే బాధతో తన జాబ్‌కు రిటైర్‌మెంట్‌ప్రకటిస్తాడు. ఆ మనోవేదనతోనే కన్నుమూస్తాడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం హ్యూమన్ రైట్స్ కమీషన్‌లో పనిచేస్తోన్న సత్యానంద్‌కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్).... బాలరాజు కేసును రీ ఇన్వేస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు? వివేక్ అన్వేషణలో ఏం తేలింది? నిజంగా బాలరాజే మంజును హత్య చేశాడా?
ఈ హత్యకు బాలరాజు కూతురు సుధాకు (అనీ) ఏమైనా సంబంధం ఉందా? మంజును ప్రేమించిన మనోహన్ ఎవరు? హంతకులను పట్టుకోవడానికి వివేక్ ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? అన్నదే నింద (Ninda Review) మూవీ కథ.
నిర్ధోషికి శిక్ష పడొద్దు...
వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు...కానీ ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదనే పాయింట్‌తో డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా నింద(Ninda Review)ను తెరకెక్కించారు దర్శకుడు రాజేష్ జగన్నాథమ్. ఈ మర్డర్ మిస్టరీ మూవీకి ఓ ట్రయాంగిల్ లవ్‌స్టోరీని మిక్స్ చేస్తూ చివరలో షాకింగ్ ట్విస్ట్‌తో నిందను ఎండ్ చేశాడు డైరెక్టర్.
ఒకే ప్యాట్రన్‌లో...
క్రైమ్ ఇన్వేస్టిగేషన్ సినిమాల ప్యాట్రన్ ఒకేలా ఉంటుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని దాటుకుంటూ హీరో తన తెలివితేటలతో అసలైన హంతకుడిని పట్టుకోవడంతో ఈ సినిమాలు ముగుస్తాయి. స్క్రీన్‌ప్లే తో పాటు సీన్స్, క్యారెక్టరైజేషన్స్, మలుపులను కొత్తగా రాసుకున్నప్పుడే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ విషయంలో దర్శకుడు రాజేష్ జగన్నాథం చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
సర్‌ప్రైజింగ్ ట్విస్ట్...
మంజు హత్యతో సంబంధం ఉన్న వారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి తన ముఖం చూపించకుండా సీక్రెట్‌గా ఇన్వేస్టిగేట్ చేసే సీన్స్ ఆకట్టుకుంటాయి. వారిని కిడ్నాప్ చేసింది ఎవరనేది రివీల్ కాకుండా గ్రిప్పింగ్‌గా ఆ ట్రాక్‌ను రాసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ ఎపిసోడ్స్‌తో ఇంట్రెస్టింగ్ నింద మూవీని (Ninda Review)నడిపించాడు.
సెకండాఫ్‌లో మంజు హత్య కేసులోకి ఒక్కో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం...వారిపై అనుమానాలు రేకెత్తేలా చేస్తూ సస్పెన్స్‌ను చివరి వరకు హోల్డ్ చేశారు. మంజును హత్య చేసింది ఎవరన్నది వెల్లడయ్యే సీన్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఓ లవ్‌స్టోరీతో అసలు కారణాలను కన్వీన్సింగ్‌గా స్క్రీన్‌పై చూపించాడు డైరెక్టర్.
మ్యాజిక్ పనిచేయలేదు...
నింద(Ninda Review) కథలో ఎగ్జైటింగ్, థ్రిల్ కథనంలో మాత్రం మిస్సయ్యాయి. ఇన్వేస్టిగేషన్ సీన్స్ చాలా వరకు నెమ్మదిగా సాగుతూ రిపీట్ అయిన ఫీలింగ్‌ను కలిగిస్తాయి. స్క్రీన్‌ప్లేలో దర్శకుడి మ్యాజిక్ అనుకున్నంత వర్కవుట్ కాలేదు. హ్యూమన్ రైట్స్ కమీషన్ అంటూ కొత్త బ్యాక్‌డ్రాప్ లో హీరో క్యారెక్టర్‌ను చూపించాలనే దర్శకుడి ఆలోచన బాగుంది. కానీ క్యారెక్టర్ డిజైనింగ్ మాత్రం రెగ్యులర్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాల్లో మాదిరిగానే అనిపిస్తుంది.
లవర్ బాయ్ క్యారెక్టర్స్‌కు భిన్నంగా...
కెరీర్‌లో ఎక్కువగా లవర్ బాయ్ క్యారెక్టర్స్ చేసిన వరుణ్ సందేశ్ వాటికి భిన్నంగా సీరియల్ రోల్‌లో సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. నిర్ధోషికి న్యాయం చేసేందుకు తపించే యువకుడిగా ఎమోషనల్ రోల్‌లో నాచురన్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు.
వరుణ్ సందేశ్ తర్వాత అనీ పాత్ర ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. పాజిటివ్, నెగెటివ్ షేడ్స్ కలబోసిన క్యారెక్టర్‌లో చక్కటి వేరియేషన్స్‌తో మెప్పించింది. ఛత్రపతి శేఖర్, తనికెళ్లభరణి తమ అనుభవంతో పాత్రల్లో ఒదిగిపోయారు. భద్రమ్, సూర్య క్యూ మధు, శ్రేయారాణితో మిగిలిన పాత్రల నటన ఒకే అనిపిస్తుంది.
అంచనాలు లేకుండా చూస్తే…
నింద కొత్త పాయింట్‌తో వచ్చిన క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ మూవీ. వరుణ్ సందేశ్‌కు చాలా రోజుల తర్వాత ఈ మూవీలో మంచి పాత్ర దక్కింది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే నింద మెప్పిస్తుంది.
రేటింగ్: 2.75/5