Vastu Tips: మీ ఇంట్లో ఈ రెండు పక్షుల ఫొటోలు ఉంటే కాసుల వర్షం కురవడం ఖాయం
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోవాలంటే కొద్దిపాటి ఉపాయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ఒకటే ఈ పక్షుల ఫొటోలు ఉంచడం.
ఇంటిని అందంగా, ఆకర్షణీయంగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇందుకోసం ఇంటినిండా రకరకాల ఫొటోలు, ఫ్లవర్ వాజ్ లు, బొమ్మలు వంటివి తెచ్చి పెట్టుకుంటారు. నిజానికి ఇంటి అలంకరణ కోసమే కాకుండా వాస్తు దోషాలు తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉంటాయి. వాటి వల్ల ఇంటి అందం పెరగడమే కాకుండా వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. భారత వాస్తు శాస్త్ర నిపుణుల సూచన మేరకు నీలకంఠం (ఇండియన్ రోలర్ బర్డ్), నెమలి ఫొటోలు ఇంట్లో ఉంచుకోవాలట. వీటిని శుభప్రదంగా భావిస్తారు.ఇవి ఉంచుకోవడం ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల వాతావరణం నెలకొంటుందని భావిస్తారు.
నీలకంఠ పక్షి చిత్ర పటం వల్ల కలిగే లాభాలు:
ప్రత్యేకించి నీలకంఠ పక్షి చిత్ర పటాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరిగి, ఐశ్వర్యం వెల్లివిరుస్తుందని భావిస్తారు. ఈ ఫొటో ఇంట్లో శాంతిని చిగురింపచేస్తుందట కూడా. ఫొటోలో ఉన్న పక్షి సాక్షాత్ ఆ నీలకంఠునికే ప్రీతికరమైనదట. అందుకే ఆ పక్షి బొమ్మ ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయట. పూజ గదిలో ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందట. ఆకస్మిక సంక్షోభాల నుంచి రక్షణ కూడా దొరుకుతుందట.
నెమలి ఫొటో పెట్టడం వల్ల కలిగే లాభాలు:
ఇంట్లో నెమలి ఫొటో ఉంచడం వల్ల ఇల్లు అందంగా ఉండటమే కాకుండా శాంతి వాతావరణాన్ని కూడా నెలకొల్పుతుంది. ఈ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తుదోషాలు తొలగిపోయి కుటుంబంలో సమతుల్యత చిగురిస్తుంది. నెమలి చిత్రం ఆనందం, శ్రేయస్సులకు చిహ్నంగా చెబుతారు. ఈ చిత్రపటం ఇంట్లో సానుకూల శక్తిని వ్యాప్తి చేయడంతో పాటు, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇంకా నెమలి చిత్రం భార్యభర్తల మధ్య ప్రేమ, సామరస్యాన్ని పెంచుతుందని చాలా మందిలో ఉన్న నమ్మకం కూడా. శ్రీకృష్ణుడి నుంచి గౌరవం అందుకున్న నెమలి, కార్తీకేయుని వాహనంగా మారిన నెమలి చిత్ర పటం మత విశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది.
ఏ దిశలో ఉంచాలంటే..
ఈ రెండు పక్షుల చిత్ర పటాన్ని లేదా పటాల్ని ఏ దిశలో ఉంచాలంటే, పూజ గదిలో లేదా ఇంటికి ఈశాన్య మూలలో ఈ ఫొటోలు ఉంచండి. లేదా లివింగ్ రూమ్ కు ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఇంటికి శాంతి, శ్రేయస్సు సమకూరుతుంది. ఇంట్లో అగ్ని కోణమైన ఆగ్నేయ దిశలో ఉంచినా కూడా సత్ఫలితాలనే అందిస్తుంది. పైగా శ్రేయస్కరం కూడా. సంబంధాలను, ప్రేమను బలపరిచి మానసిక ప్రశాంతత, అదృష్టం పెంపొందుతుందట. ఇంకా భార్యభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే పడకగదిలోని ఆగ్నేయ గోడపై ఉంచడం ఇంకా ఉత్తమం.
ఫొటో పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అది అస్పష్టంగా లేదా పాతదై ఉండకూడదు. బాత్రూమ్, వంటగది లేదా మెట్ల దగ్గర వాటిని ఉంచకూడదు. సానుకూల శక్తి కలుగుతూ ఉండేలా చిత్రపటాన్ని తరచూ శుభ్రపరుస్తూ ఉండండి.