Phone Camera Damage : పెళ్లిళ్లలో ఫొటోగ్రఫీ వల్ల ఫోన్ కెమెరా డ్యామేజ్.. ఈ తప్పులు చేయకండి
Phone Camera Damage : పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీల్లో స్మార్ట్‌ఫోన్‌తో ఫొటోగ్రఫీ చేయడం చాలా మందికి అలవాటు. కానీ కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేస్తే మీ ఫోన్ కెమెరా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
సహజంగా పెళ్లిళ్లు లేదా ఏదైనా ఫంక్షన్లలో పాల్గొన్నప్పుడు ఎక్కువగా సెల్ ఫోన్ కెమెరాతోనే ఫొటోలు తీస్తుంటాం. దాదాపు అందరూ ఇలాంటి ఈవెంట్లలో పాల్గొంటారు. వివాహ సమయంలో ఫొటోగ్రఫీ మంచి జ్ఞాపకాలుగా ఉంటాయి. చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్ కెమెరాలో ఫొటోలోను బంధించాలని అనుకుంటారు. కానీ పెళ్లి సీజన్లో ఫొటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ సమయంలో అజాగ్రత్త మీ ఫోన్ కెమెరాను దెబ్బతీస్తుంది.
పెళ్లిలో ఫొటోగ్రఫీ చేసినప్పుడు కొన్నిసార్లు ఫొటోలు సరిగా రాకపోవడం మీరు గమనించే ఉంటారు. ఇలాంటి గ్రాండ్ ఈవెంట్లలో ఫోన్ కెమెరా ఎలా పాడైపోతుందంటే ఇప్పుడు పెళ్లిళ్లలో వాడే లైట్లు, అలంకరణ విధానంతోనే అని చెప్పాలి. ప్రకాశవంతమైన కాంతి, ముఖ్యంగా ఫ్లాష్ లేదా లేజర్ లైట్లు స్మార్ట్‌ఫోన్ కెమెరాను సెన్సార్స్‌ను దెబ్బతీస్తాయి. నిజం చెప్పాలంటే లేజర్ లైట్లు ఫోన్ కెమెరా శత్రువు అని కూడా చెప్పవచ్చు.
ఫోన్ కెమెరా సెన్సార్ దెబ్బతిన్న తర్వాత చాలా మంది తప్పును తెలుసుకుంటారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయి ఉంటుంది. అందుకే ముందుగానే ఈ విషయం తెలిసి ఉండాలి. పెళ్లి లేదా ఏదైనా కార్యక్రమంలో ప్రకాశవంతమైన లైట్లు, లేజర్ లైట్ల మధ్య ఫొటోగ్రఫీ ఫోన్ కెమెరాను అనేక విధాలుగా దెబ్బతీస్తుంది.
సెన్సార్ బర్న్
చాలా సందర్భాల్లో లేజర్ లైట్లు, కెమెరా లెన్స్‌పై పడే ప్రత్యక్ష కాంతి వల్ల సెన్సార్ బర్న్ అవుతుంది. అటువంటి కాంతి సెన్సార్‌ను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. దానిపై శాశ్వత మరకలను కూడా కలిగిస్తుంది. దీని తరువాత మీ ఫోన్ నుండి క్లిక్ చేసిన ప్రతి ఫొటోలో ఆకుపచ్చ, నారింజ లేదా తెలుపు చుక్కలు లేదా గీతలు కనిపిస్తాయి.
ఆటో ఫోకస్
కెమెరాను నేరుగా లైట్ వైపు చూపిన సందర్భంలో ఆటో ఫోకస్ సిస్టమ్ దెబ్బతింటుంది. కొన్నిసార్లు అస్పష్టమైన ఫోటోలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఆటో ఫోకస్ సర్దుబాటు చేయడానికి ఎక్కువ సమయం అవసరం పడుతుంది.
కాంట్రాస్ట్, రంగులో మార్పులు
లేజర్ లైట్లు లేదా ప్రకాశవంతమైన కాంతికి గురికావడం వల్ల ఫొటోలలో కాంట్రాస్ట్, రంగులో మార్పులు జరుగుతాయి. చాలాసార్లు ఈ సమస్య నిరంతరంగా అవుతూనే ఉంటుంది. అంటే మీ ఫోన్ నుంచి క్లిక్ చేసిన ఫొటోలు సరిగా రావు.
సెన్సార్ సున్నితత్వంపై ప్రభావం
ప్రకాశవంతమైన కాంతిలో పదేపదే ఫొటోలు లేదా వీడియోగ్రఫీని చేస్తే కెమెరా సెన్సార్ సెన్సిటివిటీ ప్రభావితం అవుతుంది. తక్కువ కాంతి కూడా ఫొటోగ్రఫీ పనితీరుని పాడుచేస్తుంది.
ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు కావాలనుకుంటే మీరు కెమెరా లెన్స్ ఫిల్టర్లను ఉపయోగించవచ్చు. ఇవి కాంతిని తగ్గిస్తాయి. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్ కెమెరాను ప్రత్యక్ష కాంతి నుండి రక్షించడం చాలా ముఖ్యం. కొందరు సూర్యుడికి పెట్టి కూడా ఫొటోలు తీస్తుంటారు. ఇది కెమెరాను దెబ్బతీస్తుంది. లేజర్ లైట్ల మధ్యలో ఫొటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ చేయకూడదు. దాదాపు ప్రొఫెషనల్ కెమెరాను ఉపయోగిస్తేనే మంచిది.