Bench Life Web Series Review: బెంచ్ లైఫ్ రివ్యూ - నిహారిక కొణిదెల తెలుగు కామెడీ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
Bench Life Review: వైభవ్‌రెడ్డి, రితికాసింగ్, చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన బెంచ్‌లైఫ్ వెబ్‌సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన ఈ తెలుగు వెబ్‌సిరీస్ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
Bench Life Review: వైభవ్‌రెడ్డి, రితికాసింగ్, చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ బెంచ్ లైఫ్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మెగాడాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌కు మానస శర్మ దర్శకత్వం వహిస్తోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
ముగ్గురు స్నేహితుల కథ…
బాలు (వైభవ్‌రెడ్డి) తొమ్మిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ప్రమోషన్స్, హైక్స్ ఏం లేకపోయినా తాను ప్రేమించిన ఇషా (ఆకాంక్షసింగ్) కోసమే జాబ్‌లో కొనసాగుతుంటాడు. ఇషాకు తన ప్రేమను వ్యక్తం చేసే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. మీనాక్షికి (రితికాసింగ్) సినిమా డైరెక్టర్ కావలన్నది కల. ఆడవాళ్లు డైరెక్టర్ కావడం కష్టమంటూ తల్లితో పాటు అందరూ ఆమెను నిరుత్సాహపరుస్తుంటారు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూనే తల్లికి తెలియకుండా డైరెక్టర్ కావాలనే ప్రయత్నాల్లో ఉంటుంది మీనాక్షి.
రవి (చరణ్) కొత్తగా పెళ్లైనా కుర్రాడు. తన సరదాలు, సంతోషాలకు భార్య గాయత్రి (నయన్ సారిక) అడ్డుగా ఉందనే భ్రమలో ఉంటాడు. భార్యకు తెలియకుండా స్నేహితులతో కలిసి గోవా ట్రిప్ ప్లాన్‌చేస్తాడు. బాలు, రవి, మీనాక్షి పనిచేసే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ అసైన్ చేయని ఉద్యోగులను బెంచ్‌కు పంపిస్తారు. బెంచ్‌లో ఏ పని ఉండదు. కానీ జీతం మాత్రం వస్తుంది. బెంచ్‌కు వెళ్లడం అంటే జాబ్ పోయే ప్రమాదం ఉందని తెలిసిన తమ లక్ష్యాలు, సంతోషాల కోసం మీనాక్షి, రవి బెంచ్‌కు వెళతారు. బెంచ్‌కు వెళ్లి...అక్కడి నుంచి ఇషా టీమ్‌లో జాయిన్ అయ్యి ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలని బాలు అనుకుంటాడు.
కానీ బాలు ప్లాన్ రివర్స్ అయ్యి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ వస్తుంది. బాలు బెంచ్‌కు వెళ్లాడా? ఇషాకు తన ప్రేమ గురించి చెప్పాడా? డైరెక్టర్ కావాలనే ప్రయత్నంలో మీనాక్షి సక్సెస్ అయ్యిందా? మీనాక్షి కలను ఆమె తల్లి అర్థం చేసుకుందా? భార్యకు అబద్దాలు చెప్పి దొరికిపోయిన రవి ఆమెకు ఎందుకు దూరమయ్యాడు? ఈ ముగ్గురి స్నేహితుల ఉద్యోగాలు పోయాయా? ఉన్నాయా?
దూరమైన కూతురు జగదీశ్వరికి దగ్గర కావడానికి ఐపీఎస్ జాబ్‌కు రిజైన్ చేసి సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో జాయిన్ అయిన ప్రసాద్ వశిష్ట (రాజేంద్రప్రసాద్) కథ ఏమిటి? ముగ్గురు స్నేహితులకు కలలకు ప్రసాద్ వశిష్ట ఎలా అండగా నిలబడ్డాడు? అన్నదే బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ కథ.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల లైఫ్ స్టైల్...
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల లైఫ్ స్టైల్, వారి జీవితాల్లోని సంతోషాలు, సరదాలు వృత్తికి, కలలకు మధ్య నలిగిపోతూ వారు ఎదుర్కొనే సంఘర్షణకు అద్ధంపడుతూ దర్శకురాలు మానస శర్మ బెంచ్ లైఫ్ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కింది. ఐదు ఎపిసోడ్స్‌తో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ సాగుతుంది. పెద్దగా ట్విస్ట్‌లు, టర్న్‌లు సిరీస్‌లో లేవు. ఓవర్ మెలోడ్రామా కనిపించవు.
సినిమాటిక్ ఫార్ములా స్టోరీస్‌కు భిన్నంగా నేటి యూత్ చాలా మంది ఎదుర్కొనే సింపుల్ కష్టాలు, వారిలో ఉండే అపోహలు, కన్ఫ్యూజన్స్‌తో దర్శకురాలు ఈ కథ రాసుకున్నట్లుగా అనిపించింది. రాతలో మాత్రమే తీతలో అదే నాచురాలిటీని చూపించారు. సిరీస్‌లోని ప్రతి పాత్రను నిత్యం జీవితంలో ఎక్కడో ఓ చోట చూసినట్లుగానో, పరిచయం ఉన్నాట్లుగానో అనిపిస్తాయి. కంప్లీట్ యూత్‌కు రిలేట్ అయ్యేలా క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసుకున్నది డైరెక్టర్.
ఐదు ఎపిసోడ్స్‌తో...
బెంచ్ లైఫ్ అంటే ఏమిటో చూపిస్తూ బాలు, రవి, మీనాక్షి పాత్రల పరిచయం, వారి గోల్స్‌తో ఫస్ట్ ఎపిసోడ్ సాగుతుంది. బెంచ్‌లోకి వెళ్లి తమ కలలు సాధించాలనుకున్న ప్లాన్స్ ఎలా రివర్స్ అయ్యాయి? చివరకు తమ టార్గెట్ ఎలా రీచ్ అయ్యారన్నది మిగిలిన నాలుగు ఎపిసోడ్స్‌తో కామెడీ, ఎమోషన్స్‌తో దర్శకురాలు ఆవిష్కరించారు. గోవా ట్రిప్ వేయాలని రవి ప్లాన్స్ చేయడం, భార్య కారణంగా ఎంజాయ్‌మెంట్ ట్రిప్ కాస్త టెంపుల్ టూర్ అయ్యే సీన్స్ నవ్విస్తాయి.
చివరలో భార్యభర్తల మధ్య ఉండే అనురాగం, ప్రేమ గురించి చరణ్, నయన్‌సారిక పాత్రల ద్వారా చిన్న మెసేజ్ ఇచ్చారు. ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా మహిళలు రాణించలేరనే అపోహను మీనాక్షి పాత్ర ద్వారా తుడిచేసే ప్రయత్నం చేశారు డైరెక్టర్. సినిమా ఇండస్ట్రీ పట్ల తల్లిదండ్రులు, సమాజంలో ఉండే అపోహల్ని రితికా సింగ్ ట్రాక్ ద్వారా ప్రజెంట్ చేసిన విధానం బాగుంది.
బాలు కామెడీ…
ఈ వెబ్ సిరీస్‌లో బాలు ట్రాక్ కామెడీ పరంగా హైలైట్‌గా నిలిచింది. వైభవ్ రెడ్డి డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ పెద్ద రిలీఫ్‌గా నిలిచింది. బెంచ్‌లోకి వెళ్లడం కోసం అతడు చేసే ప్రయత్నాలు, అతడి లవ్ స్టోరీ నుంచి చక్కటి ఫన్ జనరేట్ అయ్యింది.
నిహారిక గెస్ట్ రోల్...
బాలు పాత్రకు వైభవ్‌రెడ్డి పూర్తిగా న్యాయం చేశాడు. ఫుల్ లెంగ్త్ ఫన్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. చరణ్ పాత్ర నవ్విస్తుంది. నయన్ సారిక, రితికా సింగ్, అకాంక్ష సింగ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కూతురి ప్రేమ కోసం ఆరాటపడే తండ్రిగా రాజేంద్రప్రసాద్ మెప్పించాడు. వెంకట్, తనికెళ్లభరణివి చిన్న పాత్రలే అయినా ఆకట్టుకుంటాయి. నిహారిక కొణిదెల గెస్ట్ రోల్‌లో కనిపించింది.
కామెడీతో టైమ్‌పాస్...
బెంచ్ లైఫ్ కథ, కథనాల పరంగా కొత్తదనం లేకపోయినా కామెడీతో టైమ్‌పాస్ చేస్తుంది. యూత్ ఆడియెన్స్‌ను కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉండటం వెబ్‌సిరీస్‌కు ప్లస్సయింది.
రేటింగ్: 3/5