Netflix Movie: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Netflix new Movie: ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతోంది. అమర్‌సింగ్ చమ్‌కీలా పేరుతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ గురువారం (మార్చి 28) రిలీజ్ కాగా.. మూవీ వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Netflix new Movie: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతున్న మరో మూవీ అమర్‌సింగ్ చమ్‌కీలా. ప్రముఖ బాలీవుడ్ నటీనటులు దిల్జిత్ దొసాంజ్, పరిణీతి చోప్రా నటించిన ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. 1980ల్లో పంజాబ్ ను ఓ ఊపు ఊపేసి చివరికి హత్యకు గురైన సింగర్ అమర్ సింగ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తెరకెక్కించాడు.
అమర్ సింగ్ చమ్‌కీలా ట్రైలర్
నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ అమర్ సింగ్ చమ్‌కీలా ట్రైలర్ ను గురువారం (మార్చి 28) రిలీజ్ చేసింది. ఇందులో ఆ సింగర్ పాత్రలో దిల్జిత్ దొసాంజ్ నటిస్తున్నాడు. పంజాబ్ అసలు సిసలైన రాక్‌స్టార్ గా పేరుగాంచిన అమర్ సింగ్ పై ఈ సినిమాను తీశారు. 80ల్లో రికార్డ్ సెల్లింగ్ ఆర్టిస్ట్ గా అతనికి పేరుంది. తన పేదరికాన్ని తన పాటతోనే జయించిన సింగర్ అతడు.
సమాజంలోని లోటుపాట్లను అదే పాటతో ప్రశ్నించి.. చివరికి 27 ఏళ్ల వయసులోనే హత్యకు గురైన సింగర్ ఈ అమర్ సింగ్ చమ్‌కీలా. ఇప్పుడతని జీవితంపై అదే పేరుతో ఇంతియాజ్ అలీ మూవీ తీశాడు. దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ అమర్ సింగ్ పంజాబ్ లో ఓ సాధారణ వ్యక్తి నుంచి లక్షల మంది ప్రజలను తన పాటతో కదిలించే గొప్ప సింగర్ గా ఎలా ఎదిగాడన్నది చూపించారు.
ఈ క్రమంలో అతని పాటలు సమాజంలోని పోకడలను ప్రశ్నించేలా ఉండటంతో కొందరు అతనికి ఎదురు తిరుగుతారు. చివరికి వాళ్ల చేతుల్లోనే హత్యకు గురవుతాడు. ఈ రెబల్ సింగర్ జీవితాన్ని ఇంతియాజ్ అలీ ఇప్పుడు తెరపై ఆవిష్కృతం చేయబోతున్నాడు. 9 ఏళ్ల కిందట తమాషా మూవీతో వచ్చి మ్యాజిక్ చేసిన ఇంతియాజ్ అలీ, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్, పాటల రచయిత ఇర్షాద్ కామిల్ మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అమర్ సింగ్ చమ్‌కీలా స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు రిలీజయ్యాయి. ఇష్క మిటాయే, నరమ్ కాల్జా సాంగ్స్ రెండూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో కొన్ని పాటలను దిల్జిత్ దొసాంజ్, పరిణీతి కూడా పాడారు. అమర్ సింగ్ చమ్‌కీలా మూవీ ఏప్రిల్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ దివంగత గాయకుడి చరిత్రను సినిమాగా తీయడానికి కారణమేంటో కూడా ఇంతియాజ్ అలీ వివరించాడు.
"సమాజంలో తప్పుడు పోకడలను ప్రశ్నించి ఓ స్థాయికి ఎదిగే యువ సంగీతకారులు దురదృష్టవశాత్తూ హింసాత్మక ఘటనల్లో మృత్యువాత పడటం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదే. చమ్‌కీలా జీవితం కూడా సమాజంలో ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తాయి. ఇది ఓ ఆర్టిస్ట్ కు ఇస్తున్న నివాళి. ఏం జరిగినా తన జీవితంలో తన తొలి ప్రేమ అయిన మ్యూజిక్ ను మాత్రం అతడు ఎన్నడూ వీడలేదు" అని ఇంతియాజ్ అలీ అన్నాడు. ఈ సినిమా వచ్చే నెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.