Netflix OTT: విక్ర‌మ్ ఫ్యాన్స్‌కు షాక్ - తంగ‌లాన్ ఓటీటీలోకి రావ‌డం క‌ష్ట‌మే - డీల్ క్యాన్సిల్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌?-netflix canceled vikram thangalaan movie ott deal pa ranjith kollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott: విక్ర‌మ్ ఫ్యాన్స్‌కు షాక్ - తంగ‌లాన్ ఓటీటీలోకి రావ‌డం క‌ష్ట‌మే - డీల్ క్యాన్సిల్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌?

Netflix OTT: విక్ర‌మ్ ఫ్యాన్స్‌కు షాక్ - తంగ‌లాన్ ఓటీటీలోకి రావ‌డం క‌ష్ట‌మే - డీల్ క్యాన్సిల్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌?

Nelki Naresh Kumar HT Telugu
Oct 05, 2024 12:31 PM IST

Thangalaan OTT: తంగ‌లాన్ ఓటీటీ రిలీజ్‌పై ఓ ఆస‌క్తిక‌ర వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. తంగ‌లాన్ ఓటీటీ డీల్‌ను నెట్‌ఫ్లిక్స్ క్యాన్సిల్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. చియాన్ విక్ర‌మ్ హీరోగా న‌టించిన ఈ మూవీకి పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

తంగ‌లాన్ ఓటీటీ
తంగ‌లాన్ ఓటీటీ

Thangalaan OTT: తంగ‌లాన్ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తోన్న చియాన్ విక్ర‌మ్ ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ షాకివ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తంగ‌లాన్ ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయిన‌ట్లు స‌మాచారం. నిర్మాణ సంస్థ‌తో నెట్‌ఫ్లిక్స్‌కు మ‌ధ్య నెల‌కొన్న వివాద‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ డిమాండ్‌...

థియేట‌ర్‌లో సినిమా డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో ముందుగా ఒప్పందం చేసుకున్న మొత్తానికి కాకుండా త‌క్కువ‌కే తంగ‌లాన్ ఓటీటీ రైట్స్ ఇవ్వాల‌ని నిర్మాణ సంస్థ‌ను నెట్‌ఫ్లిక్స్ డిమాండ్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రొడ్యూస‌ర్లు అందుకు ఒప్పుకోలేద‌ని అంటున్నారు. దాంతో ఈ సినిమా ఓటీటీ డీల్‌ను నెట్‌ఫ్లిక్స్ ర‌ద్దు చేసుకున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఓటీటీ రిలీజ్ విష‌యంలో నెట్‌ఫ్లిక్స్ వెన‌క్కి త‌గ్గ‌డంతో మ‌రో ఓటీటీలో తంగ‌లాన్‌ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. తంగ‌లాన్ ఓటీటీ రిలీజ్ మ‌రింత‌ ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. న‌వంబ‌ర్‌లో ఈ సినిమా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

100 కోట్ల బ‌డ్జెట్ - 70 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

తంగ‌లాన్ మూవీకి పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఏడాది ద‌క్షిణాదిలో మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీగా తంగ‌లాన్‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. విక్ర‌మ్‌, పార్వ‌తితోపాటు మిగిలిన వారి యాక్టింగ్‌, విజువ‌ల్స్‌, మేకింగ్ బాగున్నా క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో తంగ‌లాన్ నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది.

దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 70 కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది.కోలార్ బంగారు గ‌నుల నేప‌థ్యంలో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా పా రంజిత్ ఈ మూవీని తెర‌కెక్కించాడు.

ఆగ‌స్ట్ 15న రిలీజ్‌...

ఈ సినిమాలో విక్ర‌మ్‌తో పాటు పార్వ‌తి, మాళ‌వికా మోహ‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. ఆగ‌స్ట్ 15న త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో తంగ‌లాన్ రిలీజైంది.

తంగ‌లాన్ పోరాటం...

స‌మాజంలోని వివ‌క్ష‌ను ఎదురించి ఓ గిరిజ‌న తెగ సాగించిన పోరాటానికి నిధి అన్వేష‌ణ‌ను జోడించి యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు పా రంజిత్ తంగ‌లాన్ మూవీని తెర‌కెక్కించాడు. వేప్పూరుకు చెందిన గిరిజ‌న నాయ‌కుడు తంగ‌లాన్ (విక్ర‌మ్‌) కుటుంబ‌మే స‌ర్వ‌స్వం. త‌న భార్య గంగ‌మ్మ (పార్వ‌తి) ఐదుగురు పిల్ల‌ల‌తో క‌లిసి సంతోషంగా బ‌తుకుతుంటాడు.

తంగ‌లాన్‌ భూమిని ఊరు జ‌మీందార లాక్కుంటాడు. జ‌మీందారు ఆక్ర‌మించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవ‌డానికి బ్రిటీష‌ర్ల‌తో క‌లిసి అడ‌విలో ఓ బంగారు నిధిని వెలికితీయ‌డానికి వెళ‌తాడు తంగ‌లాన్‌.

ఆ బంగారు నిధికి ఆర‌తి ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంది. అస‌లు ఆర‌తి ఎవ‌రు? బంగారం కోసం అడ‌విలో అడుగుపెట్టిన తంగ‌లాన్‌తో పాటు అత‌డి బృందాన్ని అర‌తి ఏం చేసింది? అన్న‌ది యాక్ష‌న్‌, ఎమోష‌న్స్‌తో తంగ‌లాన్ మూవీలో విక్ర‌మ్ చూపించాడు

Whats_app_banner