Nayanthara Surrogacy: చిక్కుల్లో నయన్ దంపతులు.. రంగంలోకి తమిళనాడు ప్రభుత్వం!
Nayanthara Surrogacy: నయన్ దంపతులు చిక్కుల్లో పడ్డారు. సరోగసీ ద్వారా వీళ్లు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారన్న వార్తల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగింది.
Nayanthara Surrogacy: ఈ ఏడాది జరిగిన సెలబ్రిటీల పెళ్లిళ్లలో చాలా ఆసక్తి రేపింది నయనతార, విగ్నేష్ శివన్‌ల పెళ్లి. సౌత్ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయన్.. తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్, డైరెక్టర్ విగ్నేష్‌తో కలిసి ఏడడుగులు వేయబోతోందని తెలిసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వాళ్ల పెళ్లి గురించి ఏ అప్‌డేట్ వచ్చినా ఆసక్తిగా చూసేవారు.
అయితే పెళ్లయిన నాలుగు నెలలకే తాము కవలలకు తల్లిదండ్రులమైనట్లు ఈ జంట ఆదివారం (అక్టోబర్ 9) ప్రకటించడం చాలా మంది ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాము ఎలా పేరెంట్స్ అయ్యామన్న విషయాన్ని విగ్నేష్ చెప్పకపోయినా.. వీళ్లు తమ పెళ్లికి ముందే సరోగసీని ఆశ్రయించినట్లు స్పష్టమైపోయింది. తమకు కవలలు జన్మించారంటూ విగ్నేష్ ఎంతో ఎక్సైటింగ్‌గా అనౌన్స్ చేశాడు. వాళ్లకు ఉయిర్, ఉలగమ్ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.
అయితే అది కాస్తా ఇప్పుడు వివాదానికి కారణమైంది. ప్రత్యేకమైన కారణాలు ఉంటే తప్ప మన దేశంలో సరోగసీకి అనుమతి లేదు. కానీ అలాంటిదేమీ లేకుండా నయనతార, విగ్నేష్ సరోగసీ ద్వారా పిల్లలను పొందినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ విషయంపై దృష్టిసారించింది తమిళనాడు ప్రభుత్వం. తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ దీనిపై స్పందించారు.
నయన్, విగ్నేష్‌ల సరోగసీ అంశాన్ని ఓ జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన.. నయన్, విగ్నేష్ సరైన ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అన్న అంశంపై తమ ప్రభుత్వం వివరణ కోరుతుందని స్పష్టం చేశారు. మరి దీనికి ఈ సెలబ్రిటీ కపుల్ ఎలాంటి సమాధానం ఇస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాము పేరెంట్స్ అయిన విషయాన్ని విగ్నేష్ తన ట్విటర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. "నయన్, నేను అమ్మా, అప్పా అయ్యాము. మాకు కవల అబ్బాయిలు జన్మించారు. మా ప్రార్థనలు, మా పెద్దల దీవెనెలను, మేము చేసిన మంచి పనులు ఇప్పుడిలా ఇద్దరు పిల్లల రూపంలో మాకు చేరింది. మా ఉయిర్, ఉలగమ్‌లకు మీ ఆశీర్వాదాలు కావాలి" అంటూ విగ్నేష్ ట్వీట్ చేశాడు.
ఈ ఇద్దరూ ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదట తిరుపతిలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన ఈ జోడీ.. తర్వాత మహాబలిపురంలోని షెరటన్ పార్క్ రిసార్ట్‌కు వేదికను మార్చారు. వీళ్ల పెళ్లికి రజనీకాంత్, షారుక్‌ఖాన్‌లాంటి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.