Most Songs in a movie: ఒక్క సినిమాలో 71 పాటలు.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ మూవీ ఏదో తెలుసా?
Most Songs in a movie: ఒకే సినిమాలో 71 పాటలు ఉన్నాయంటే నమ్మగలరా? ఈ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది ఓ ఇండియన్ సినిమా. ఎప్పుడో 90 ఏళ్ల కిందట వచ్చి క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.
Most Songs in a movie: ఓ సినిమాలో ఐదారు పాటలు అనేవి సాధారణం. అదే పదో, పన్నెండో ఉంటే అమ్మో ఇన్ని పాటలా అనుకుంటాం. మరి ఒకే సినిమాలో ఏకంగా 71 పాటలు ఉన్నాయంటే నమ్మగలరా? ఈ వరల్డ్ రికార్డు 92 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది. నిజంగానే ఇది సాధారణ విషయం కాదు. ఈ మధ్యకాలంలో వస్తున్న కొన్ని సినిమాల్లో అసలు పాటలే ఉండటం లేని పరిస్థితుల్లో ఒకే సినిమాలో అన్ని పాటలంటే కచ్చితంగా అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయమే.
71 పాటల సినిమా
ఒకప్పుడు హిందీ అయినా, తెలుగు అయినా సినిమాల్లో పాటలు ఎక్కువగా ఉండేవి. ఐదారు పాటలకే పరిమితం కాకుండా 8, 10 పాటల వరకు ఉన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ పాటల నిడివి కూడా ఎక్కువగానే ఉండేది. అయితే 1932లో వచ్చిన ఓ హిందీ సినిమాలో మాత్రం ఏకంగా 71 పాటలు ఉన్నాయి. ఈ సినిమా పేరు ఇంద్రసభ. ఇప్పటికీ అత్యధిక పాటల వరల్డ్ రికార్డు ఈ మూవీ పేరిటే ఉంది.
ఇండియన్ సినిమాకు మ్యూజికే అసలు బలం. కేవలం మ్యూజిక్ తోనే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. 30 ఏళ్ల కిందట వచ్చిన హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో 14 పాటలు ఉంటే.. అన్నీ హిట్టే. అప్పట్లో అదో సంచలనం. కానీ అంతకు ఆరు దశాబ్దాల ముందే వచ్చిన ఈ ఇంద్రసభలో ఏకంగా 71 పాటలు ఉండటం మాత్రం నమ్మశక్యం కాని విషయమే.
ఏంటీ ఇంద్రసభ మూవీ?
ఇంద్రసభ మూవీ 1932లో రిలీజైంది. ఈ సినిమాను ఉర్దూ నాటకమైన ఇందర్ సభ ఆధారంగా తెరకెక్కించారు. 1853లో తొలిసారి ఈ నాటకాన్ని ప్రదర్శించారు. దానిని జంషెడ్‌జీ జహంగీర్‌జీ మదన్.. ఇంద్రసభ పేరుతో తెరకెక్కించాడు. నిస్సార్, జహనారా కజ్జన్, అబ్దుల్ రెహమాన్ కాబూలీలాంటి వాళ్లు నటించారు. నాగర్‌దాస్ నాయక్ ఈ సినిమాలోని 71 పాటలను కంపోజ్ చేయడం విశేషం.
అత్యధిక పాటలు ఉన్న సినిమాగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుందీ సినిమా. సుమారు మూడు గంటల నిడివి ఉన్న మూవీలో 71 పాటలంటే మామూలు విషయం కాదు. ఇండియన్ సినిమాలో ఆ తర్వాత మరే ఇతర మూవీ పాటల విషయంలో దీని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. 1994లో సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ నటించిన హమ్ ఆప్కే హై కౌన్ మూవీలో 14 పాటలు ఉన్నాయి.
తర్వాత అనిల్ కపూర్, ఐశ్యర్య రాయ్ నటించిన తాళ్, సల్మాన్ ఖాన్ నటించిన తేరే నామ్, అమితాబ్ బచ్చన్ నటించిన సిల్సిలాలాంటి సినిమాల్లోనూ 12 పాటలు ఉండటం విశేషం. అయితే 2000 తర్వాత వచ్చిన సినిమాల్లో పాటల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఐదారు పాటలకు మించి లేవు. అంతేకాదు కొన్ని సినిమాలైతే అసలు పాటలే లేకుండా రూపొందాయి.