Mahesh Babu Remuneration: మహేష్ బాబు రికార్డు రెమ్యునరేషన్.. ఎస్ఎస్ఎంబీ29 కోసం ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
Mahesh Babu Remuneration: మహేష్ బాబు రికార్డు రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. ఎస్ఎస్ఎంబీ29 కోసం అతడు భారీ మొత్తం తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.
Mahesh Babu Remuneration: మహేష్ బాబు కెరీర్లో ఇప్పటికే ఎన్నో హిట్స్ ఉన్నాయి. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో అతడు కూడా ఒకడు. మహేష్ సినిమాలో ఉంటే కాసుల వర్షమే అని భావించే ప్రొడ్యూసర్లు.. అతడు అడిగినంత మొత్తం ఇవ్వడానికి ఎప్పుడూ వెనుకాడరు. ముఖ్యంగా పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు లాంటి సినిమాల తర్వాత మహేష్ అందుకునే రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది.
తాజాగా అతడు దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ఎస్ఎస్ఎంబీ 29 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రారంభం కానుంది. అయితే అప్పుడే ఈ మూవీకి గ్లోబల్ లెవల్లో ఎంతో హైప్ క్రియేటైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా భారీగా అందుకోబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కోసం మహేష్ ఏకంగా రూ.110 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకోనున్నట్లు సమాచారం. ఇది నిజంగా భారీ మొత్తమే అని చెప్పాలి. టాలీవుడ్ పై చెరగని ముద్ర వేసిన దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ కాంబినేషన్ లో మూవీ అంటేనే అన్ని బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం. దీంతో అందుకు తగినట్లే ఈ ఇద్దరూ పెద్ద మొత్తం సినిమా కోసం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసమే మహేష్ రూ.78 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకుంటున్నాడు. అంతకుముందు సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ అందుకున్న దాని కంటే ఇది చాలా ఎక్కువ. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ కోసం అతడు ఏకంగా రూ.100 కోట్ల మార్క్ దాటేస్తున్నాడు.
ఇండియాలో అతి తక్కువ మంది యాక్టర్సే ఈ మార్క్ అందుకున్నారు. ఇప్పుడు మహేష్ ఆ లిస్టులోకి చేరబోతున్నాడు. గత కొన్నేళ్లుగా అతడు తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ వస్తున్నాడు. 2016లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా కోసం మహేష్ రూ.22 కోట్లు అందుకోగా.. ఆ తర్వాత 2020లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం రూ.40 కోట్లు, సర్కారువారి పాట కోసం రూ.50 కోట్లు, గుంటూరు కారం కోసం రూ.78 కోట్లు వసూలు చేసే స్థాయికి వెళ్లాడు.