Maharani 3 trailer: థ్రిల్లింగ్ పొలిటికల్ వెబ్ సిరీస్ మళ్లీ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ట్రైలర్ చూశారా?
Maharani 3 trailer: బాలీవుడ్ నటి హుమా ఖురేషీ నటించిన థ్రిల్లింగ్ పొలిటికల్ వెబ్ సిరీస్ మహారాణి మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది.
Maharani 3 trailer: ఈ మధ్యకాలంలో వచ్చిన సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి మహారాణి. ఎప్పుడూ దేశం మొత్తాన్నీ ఆకర్షించే బీహార్ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ తొలి రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 1990లనాటి బీహార్ రాజకీయాలను కళ్లకు కడుతున్న ఈ సిరీస్ మూడో సీజన్ మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 19) రాత్రి ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది.
మహారాణి 3 ట్రైలర్
బీహార్ రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయో ఈ మహారాణి వెబ్ సిరీస్ తొలి రెండు సీజన్లతోనే చూపించింది. ఈ మూడో సీజన్లో ఈ పొలిటికల్ వార్ మరింత తీవ్రం కానుంది. రెండో సీజన్ చివర్లో జైలుకి వెళ్లే రాణీ భారతి.. తిరిగి కొత్త బీహార్ లో అడుగు పెట్టి మళ్లీ కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకుంటుందా లేదా అన్నది మూడో సీజన్ లో చూపించనున్నారు.
రాణీ భారతి పాత్రలో అదరగొట్టిన బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఇప్పుడు మూడో సీజన్ తో వచ్చేస్తోంది. ఆమె జైల్లో ఉన్న సీన్ తోనే ఈ ట్రైలర్ మొదలవుతుంది. అక్కడికి వచ్చిన ఆమె ప్రత్యర్థి, ముఖ్యమంత్రి నవీన్ కుమార్ (అమిత్ సియాల్).. నువ్వు మరో 15, 20 ఏళ్లు జైల్లోనే ఉంటావ్.. ఇక్కడే గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ చేసెయ్ అంటూ వార్నింగ్ ఇవ్వడం చూడొచ్చు.
అయితే ఆ హెచ్చరికను ఆమె సవాలుగా తీసుకున్నా.. తన పిల్లలపై జరిగే హత్యా ప్రయత్నంతో తల్లడిల్లుతుంది. తాను బెయిలుపై బయటకు రావాలని అనుకుంటున్నట్లు తన వారితో చెబుతుంది. అలా జైలు నుంచి బయట అడుగు పెట్టిన రాణీ భారతి.. సగం బీహార్ తనకు వ్యతిరేకంగా ఉన్నా, ప్రత్యర్థులందరూ ఏకమైనా వాళ్లను ఎలా ఎదుర్కోబోతోంది అన్నది మూడో సీజన్ లో చూడొచ్చు.
మహారాణి 3 ట్రైలర్ రియాక్షన్స్
మహారాణి 3 ట్రైలర్ తోనే మూడో సీజన్ ఇంకా ఎంత ఇంటెన్సివ్ గా ఉండబోతోందో చెప్పింది. ఆగస్ట్, 2022లో రెండో సీజన్ రాగా.. ఏడాదిన్నర తర్వాత మూడో సీజన్ తో మహారాణి రాబోతోంది. దీంతో ఈ సిరీస్ పై ఎంతో ఆసక్తి నెలకొంది. దీనికితోడు ట్రైలర్ కూడా ఎంతో ఆసక్తిగా సాగడంతో ఈ కొత్త సీజన్ పై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ మహారాణి వెబ్ సిరీస్ ను సుభాష్ కపూర్ క్రియేట్ చేయగా.. సౌరభ్ భావే డైరెక్ట్ చేశాడు. నందన్ సింగ్, ఉమాశంకర్ సింగ్ లతో కలిసి సుభాష్ కపూర్ ఈ సిరీస్ కు కథ అందించాడు. మహారాణి మూడో సీజన్ మార్చి 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.