Longest Run Telugu Movies: థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన టాప్ 8 తెలుగు సినిమాలు ఇవే.. బాలకృష్ణవే రెండు
Longest Run Telugu Movies: థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఏవో తెలుసా? ఈ లిస్టులో బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు ఉండటం విశేషం.
Longest Run Telugu Movies: ఇప్పుడంటే ఎంత పెద్ద సినిమా అయినా వారం, పది రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర కోట్లు వసూలు చేసి కనుమరుగువుతున్నాయి. కానీ ఓ పది, పదిహేనేళ్ల కిందటి వరకూ కూడా థియేటర్లలో వందల కొద్దీ రోజులు ఆడేవి. మా హీరో సినిమా ఎక్కువ రోజులు ఆడింది అంటే మా హీరోది ఆడిందంటూ ఫ్యాన్స్ మధ్య వార్ నడిచేది. మరి తెలుగులో ఎక్కువ రోజులు నడిచిన సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు
ఒకప్పుడు టాలీవుడ్ లో వంద రోజులు, రెండు వందల రోజుల వేడుకలు ఘనంగా జరిగేవి. ఒక్కోసారి కొన్ని సినిమాలు సంవత్సారానికి పైగా ఆడిన సందర్భాలూ ఉన్నాయి. అందులో రెండు బాలయ్య సినిమాలే కావడం విశేషం. వాటిలో టాప్ 8 మూవీస్ ఏవో ఒకసారి చూద్దాం.
లెజెండ్ - 1000 రోజులకుపైనే..
బాలకృష్ణ నటించిన లెజెండ్ మూవీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని థియేటర్లో 1000 రోజులకుపైనే ఆడటం విశేషం. ఈ సినిమాను 2014 నుంచి 2017 వరకు నిరంతరాయంగా నడిచింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా.. 1000వ రోజు పోస్టర్ ను కూడా ప్రత్యేకంగా రిలీజ్ చేశారు.
మగధీర - 1000 రోజులు
2009లో రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మూవీ మగధీర. అప్పట్లోనే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ మూవీ.. కర్నూలు జిల్లాలోని విజయలక్ష్మి థియేటర్లో 1000 రోజులు ఆడింది.
పోకిరి - 580 రోజులు
2006లో మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ పోకిరి. సూపర్ స్టార్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన ఈ సినిమా ఓ థియేటర్లో 580 రోజుల పాటు ఆడింది.
మంగమ్మగారి మనవడు
నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమాను కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశాడు. 1984లో రిలీజైన ఈ మంగమ్మగారి మనవడు మూవీ హైదరాబాద్ లోని తారకరామ థియేటర్లలో ఏకంగా 565 రోజులు ఆడింది.
మరో చరిత్ర
కమల్ హాసన్ నటించిన మరో చరిత్ర మూవీ అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఒకే థియేటర్లలో 556 రోజుల పాటు ఆడటం విశేషం.
ప్రేమాభిషేకం
అక్కినేని నాగేశ్వర రావు నటించిన ప్రేమాభిషేకం మూవీ కూడా ఓ కల్ట్ క్లాసిక్. ఈ సినిమా ఆ రోజుల్లోనే ఓ థియేటర్లో 533 రోజులు ఆడింది. ఇక చాలా థియేటర్లలో 300 రోజులు ఆడించారు.
లవ కుశ
టాలీవుడ్ లో ఆరు దశాబ్దాలు గడిచినా ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమా లవ కుశ. రామాయణంలోని ఉత్తరఖాండ ఆధారంగా తీసిన ఈ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ నటించాడు. 1963లో రిలీజైన ఈ సినిమా అప్పట్లోనే 469 రోజులు నడిచింది.
ప్రేమ సాగరం
తమిళ స్టార్ హీరో శింబు తండ్రి టీ రాజేంద్ర డైరెక్ట్ చేసిన మూవీ ప్రేమ సాగరం. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఒక థియేటర్లో ఏకంగా 465 రోజులు ఆడింది.