Siren: కీర్తి సురేష్ అనుపమ సైరన్ తెలుగులో రిలీజ్.. ఓటీటీలో అనుకున్న మూవీ థియేటర్‌లో!-keerthy suresh jayam ravi siren telugu version theatrical release by ganga entertainments siren telugu release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siren: కీర్తి సురేష్ అనుపమ సైరన్ తెలుగులో రిలీజ్.. ఓటీటీలో అనుకున్న మూవీ థియేటర్‌లో!

Siren: కీర్తి సురేష్ అనుపమ సైరన్ తెలుగులో రిలీజ్.. ఓటీటీలో అనుకున్న మూవీ థియేటర్‌లో!

Sanjiv Kumar HT Telugu
Published Feb 12, 2024 04:19 PM IST

Keerthy Suresh Anupama Parameswaran Siren Release Date: కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ తొలిసారి కలిసి నటించిన లేటెస్ట్ తమిళ మూవీ సైరన్. జయం రవి హీరోగా చేస్తున్న ఈ సినిమాను తెలుగులో కూడా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో ఫిబ్రవరి 16న రిలీజ్ కానున్న సైరన్ తెలుగులో ఎప్పుడు విడుదల అంటే..

కీర్తి సురేష్ అనుపమ సైరన్ తెలుగులో రిలీజ్.. ఓటీటీలో అనుకున్న మూవీ థియేటర్‌లో!
కీర్తి సురేష్ అనుపమ సైరన్ తెలుగులో రిలీజ్.. ఓటీటీలో అనుకున్న మూవీ థియేటర్‌లో!

Jayam Ravi Siren Theatrical Release: 'తని ఒరువన్' (తెలుగులో ధ్రువకి రీమేక్) 'కొమాలి' 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి తాజాగా 'సైరన్' అనే మాస్ ఎంటర్టైనర్ చిత్రంతో రానున్నారు. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'గంగ ఎంటర్టైన్మెంట్స్' పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా కనిపించనున్నఈ చిత్ర తెలుగు టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందన లభించింది.

"'సైరన్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కుదిరేలా తెరకెక్కించాం. జయం రవి గారు మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నారు. కీర్తి, అనుపమ మొదటి సారి ఆయనతో కలిసి నటించారు. ఫిబ్రవరి 23న తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అని చిత్ర నిర్మాత సుజాత విజయకుమార్ తెలిపారు. "జయం రవి చాలా ప్రతిభ గల నటుడు. ఇంకో వంద చిత్రాలైన చెయ్యగల నేర్పు అతనిలో ఉంది. మేము ఇదివరకే కలిసి నటించాం. ఈ చిత్రంలో మా పాత్రలు అద్భుతంగా వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే చిత్రమిది" అని సముద్ర ఖని అన్నారు.

"జయం రవి గారు ఈ చిత్రంలో చాలా పరిపక్వతతో నటించారు. ఈ చిత్రంలోని పాటలు నాకు చాలా స్పెషల్. నాకు ఈ సంవత్సరం ఈ చిత్రంతో ప్రారంభం అవ్వడం చాలా సంతోషంగా ఉంది" అని సంగీత దర్శకుడు జివి ప్రకాష్ తెలిపారు. "ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం, అదీ పెద్ద హీరోతో అయినప్పుడు, కచ్చితంగా హిట్ అవ్వాలనుకుంటారు. ఆ బాధ్యత జయం రవి గారు తీసుకున్నారు" అని డైరెక్టర్ ఆంటోనీ భాగ్యరాజ్ చెప్పుకొచ్చారు.

"జీవీ గారి మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రానికి ఆయన దాదాపు 20 ట్యూన్లు ఇచ్చి ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారు. చిత్రం అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని సైరన్ డైరెక్టర్ ఆంటోనీ భాగ్యరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

"ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. వాటికి జీవీ తన సంగీతంతో ప్రాణం పోశాడు. ఇండియాలో ఉన్న మేటి సంగీత దర్శకుల్లో జీవీ ప్రకాష్ అగ్ర స్థానాల్లో ఉంటాడు. అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రకి కీర్తి బాగుంటుంది అనుకున్నాము. మా నమ్మకాన్ని తను పూర్తిగా నిలబెట్టింది. ఆంటోనీ భాగ్యరాజ్ రానున్న కాలంలో చాలా ఎత్తుకు ఎదగడం ఖాయం" అని హీరో జయం రవి అన్నారు.

"కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది మందలిస్తుంటారు. కానీ, ప్రతిభ గల దర్శకుడి కష్టంలోనే చిత్ర విజయం కనిపిస్తుంది నాకు. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. మా 'సైరన్' తమిళ - తెలుగు ప్రేక్షకులని ఆద్యంతం ఆకట్టుకుంటుందనే నమ్మకం పూర్తిగా ఉంది" అని జయం రవి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఇదిలా ఉంటే సైరన్ మూవీని మొదట ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, తర్వాత అందులో నిజం లేదని, థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తమిళంలో సైరన్ మూవీ ఫిబ్రవరి 16న విడుదల కానుండగా తెలుగులో మాత్రం ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నారు. కాగా సైరన్ మూవీలో జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్‌తోపాటు సముద్రఖని, యోగి బాబు, అజయ్, అలగం పెరుమాళ్, పాండ్యన్ నటిస్తున్నారు.

Whats_app_banner