Kalki 2898 AD Release: కల్కి 2898 ఏడీ మూవీ వాయిదా తప్పదా? ఆ పనులు కూడా ఆలస్యం!
Kalki 2898 AD Release: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ సందిగ్ధంగా మారింది. సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఈ చిత్రం వాయిదా పడుతుందనే రూమర్లు ఇటీవల వచ్చాయి. అయితే, ఈ మూవీ వాయిదాకు ఇప్పుడు మరో అంశం కూడా కారణం కానుందని బజ్ నడుస్తోంది.
Kalki 2898 AD Release: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ రేంజ్‍లో రూపొందుతున్న ఈ మూవీపై హైప్ విపరీతంగా ఉంది. దర్శకుడు నాగ్‍అశ్విన్ ఈ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ మూవీని మైథాలజీతో గ్రాండ్ స్కేల్‍లో తెరకెక్కిస్తున్నారు. 6వేల సంవత్సరాల మధ్య జరిగే స్టోరీ ఈ చిత్రంలో ఉంటుందంటూ ఇటీవల ఈ మూవీపై మరింత ఆసక్తిని ఆయన పెంచేశారు. చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ చిత్రం ఆశ్చర్యపరిచేలా ఉంటుందని కామెంట్లు చేశారు. దీంతో కల్కి మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
కల్కి 2898 ఏడీ చిత్రాన్ని మే 9వ తేదీన రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. అయితే, ఆ సమయంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఈ చిత్రం ఆ తేదీన రిలీజ్ కావడం కష్టమేనని కొన్నాళ్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ పేరుతో పాటు కొత్త లుక్‍ను మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్లోనూ రిలీజ్ డేట్ లేదు. ఎన్నికలతో పాటు మరో కారణం వల్ల కూడా ఈ మూవీ విడుదల ఆలస్యం కానుందని తెలుస్తోంది.
వీఎఫ్‍ఎక్స్ పనులు ఆలస్యం!
కల్కి 2898 ఏడీ సినిమా వీఎఫ్‍ఎక్స్ పనులు కూడా ఆలస్యమవుతున్నట్టు సినీ సర్కిల్‍లో టాక్ చక్కర్లు కొడుతోంది. గ్రాఫిక్స్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోతుండడం కూడా ఈ చిత్రం వాయిదాకు కారణం కానుందని తెలుస్తోంది. సంతృప్తి చెందని కొన్ని సీన్లకు మళ్లీ సీజీ చేస్తున్నారని కూడా సమాచారం. మొత్తంగా మే 9వ తేదీన చిత్రం రిలీజ్ కాదనే పుకార్లు మరోసారి జోరందుకున్నాయి.
కల్కి 2898 ఏడీ సినిమా వాయిదా పడితే.. ఎప్పుడు తీసుకురావాలన్నది కూడా సందిగ్ధంగానే ఉంది. ఆగస్టుతో పాటు అక్టోబర్‌లోనూ కొన్ని పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే, కల్కి చిత్రం రిలీజ్‍పై త్వరలోనే మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర గురించి నిర్మాత స్వప్న దత్ తాజాగా మరింత హైప్ పెంచారు. ఈ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో చాలాకాలం నిలిచిపోతుందని చెప్పారు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్‍లో తరణ్ ఆదర్శ్‌తో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని చెప్పారు. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి స్ఫూర్తిగా రూపొందించిన పాత్రలో ఈ మూవీలో కనిపించనున్నారు ప్రభాస్.
కల్కి 2898 ఏడీ గురించి..
కల్కి 2898 ఏడీ మూవీలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
కల్కి 2898 ఏడీ సినిమాను సుమారు రూ.600కోట్ల బడ్జెట్‍తో రూపొందిస్తున్నట్టు అంచనా. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్నే దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించారని, అబ్బుపరిచేలా విజువల్స్ ఉండనున్నాయనే అంచనాలు ఉన్నాయి.