Kamal Hassan: కమల్ హాసన్ - మణిరత్నం చిత్రానికి క్రేజీ టైటిల్.. గ్లింప్స్ వీడియో రిలీజ్.. మరో ఇద్దరు హీరోలు కూడా..
Thug Life - Kamal Hassan: కమల్ హాసన్ - మణిరత్నం సినిమాకు టైటిల్ ఖరారైంది. ఈ మూవీ గ్లింప్స్ వీడియో కూడా వచ్చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్‍గా త్రిష నటించనున్నారు.
Thug Life - Kamal Hassan: లోకనాయకుడు, సీనియర్ హీరో కమల్‍హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‍లో 36 ఏళ్ల తర్వాత ఓ చిత్రం రూపొందుతోంది. దీంతో ఈ మూవీపై విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. రేపు (నవంబర్ 7) కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (నవంబర్ 6) ఈ చిత్రానికి సంబంధించి భారీ అప్‍డేట్లను మేకర్స్ ప్రకటించారు. కమల్‍హాసన్‍కు ఇది 234 చిత్రం (KH234)గా ఉంది. ఈ సినిమా టైటిల్ నేడు ఖరారైంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. హీరోయిన్‍తో పాటు ఈ చిత్రంలో కీలకపాత్రలు ఎవరు చేస్తున్నారో వెల్లడించారు.
కమల్ హాసన్ - మణిరత్నం సినిమాకు థగ్ లైఫ్ (Thug Life) అనే టైటిల్ ఖరారైంది. ఈ మేరకు టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చింది. ఈ సినిమాలో రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్‍స్టర్, క్రిమినల్‍గా కమల్ నటించనున్నారని ఈ గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.
“నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదిటిపై క్రిమినల్, గూండా, యాకూజా అని రాసినట్టు ఉన్నారు” అని ఈ వీడియోలో కమల్ హాసన్ డైలాగ్ చెప్పారు. ఈ వీడియో ఆరంభంలో కమల్ తలపై ఓ ముసుగు ఉంది. కొందరు కమల్ వైపుకు దూసుకొస్తారు. వారందరినీ కమల్ బాదేస్తారు. ఈ గెటప్‍లో చాలా డిఫరెంట్‍గా ఉన్నారు కమల్ హాసన్. యాక్షన్ సీన్‍తో ఈ వీడియో అదిరిపోయింది.
ఈ సినిమాకు థగ్ లైఫ్ అనే క్రేజీ టైటిల్‍తో పాటు.. ఈ వీడియోలో యాక్షన్ సీక్సెన్స్ అద్భుతంగా ఉండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 1987లో కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్‍లో వచ్చిన నాయకన్ సినిమాలో కమల్ క్యారెక్టర్ పేరు వేల్ నాయకర్. దీంతో ఆ చిత్రానికి.. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాకు ఏమైనా సంబంధం ఉందా అన్న విషయం కూడా ఉత్కంఠగా మారింది.
థగ్‍లైఫ్ సినిమాలో హీరోయిన్‍గా త్రిష నటించనున్నారని మూవీ యూనిట్ అధికారంగా ప్రకటించింది. మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ హీరో జయం రవి చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ నేడు ప్రకటించింది.
థగ్ లైఫ్ సినిమాను కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్.. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.