Kalki 2898 AD day 2 box office collections: రెండో రోజు 50 శాతం వరకు పడిపోయిన కల్కి 2898 ఏడీ కలెక్షన్లు.. కారణం అదేనా?
Kalki 2898 AD day 2 box office collections: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు రెండో రోజు అనూహ్యంగా 50 శాతం వరకు పడిపోవడం గమనార్హం. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం తగ్గాయి.
Kalki 2898 AD day 2 box office collections: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీకి ఉన్న హైప్ కారణంగా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. పైగా సినిమాకు కూడా అన్ని వర్గాల నుంచి పాజటివ్ రియాక్షన్స్ రావడంతో రెండో రోజు నుంచి ఈ కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావించినా.. శుక్రవారం (జూన్ 28) మాత్రం ముందస్తు అంచనాల ప్రకారం ఏకంగా 46 శాతం వరకు పడిపోయినట్లు sacnilk.com వెల్లడించింది.
కల్కి 2898 ఏడీ రెండో రోజు కలెక్షన్లు
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ మూవీకి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు వచ్చాయి. తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. గురువారం (జూన్ 27) హాలిడే కాకపోయినా కూడా ఈ స్థాయి వసూళ్లు రావడం ఆశ్చర్యం కలిగించింది. ఆ లెక్కన రెండో రోజైన శుక్రవారం కలెక్షన్లు పెరగాల్సి ఉన్నా.. ఎందుకోగానీ తగ్గాయి.
sacnilk.com ప్రకారం ఈ సినిమా రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్లు రూ.51 కోట్లుగా ఉన్నాయి. ఇందులో తెలుగు నుంచి రూ.24.65 కోట్లు, తమిళం నుంచి రూ.3.5 కోట్లు, హిందీ నుంచి రూ.20.5 కోట్లు, కన్నడ నుంచి 0.3 కోట్లు, మలయాళం నుంచి రూ.2 కోట్లు వచ్చినట్లు తెలిపింది. నిజానికి తొలి రోజు ఇండియా నెట్ కలెక్షన్లు రూ.95.3 కోట్లుగా ఉండగా.. సుమారు 46 శాతం పడిపోయాయి.
నిజానికి తొలి షో నుంచే సినిమాకు ఎక్కడా నెగటివ్ టాక్ రాలేదు. అయినా రెండో రోజు వసూళ్లు పడిపోయాయి. వీకెండ్ మళ్లీ ఈ కలెక్షన్లు రెట్టింపు కావచ్చని అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో మరోసారి కల్కి 2898 ఏడీకి రికార్డు కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
కల్కి 2898 ఏడీ గురించి..
కల్కి 2898 ఏడీ మూవీ హిందూ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తీసినది. ఈ సినిమాలోని విజువల్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్, అమితాబ్, దీపికా, కమల్ హాసన్ నటనకు ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో మూవీ తీశారంటూ ప్రముఖులు కూడా కొనియాడుతున్నారు.
సినిమాకు చాలా రోజుల ముందు నుంచే ఓ రేంజ్ ప్రమోషన్లు నిర్వహించడంతో తొలి రోజే రికార్డు కలెక్షన్లను సొంతం చేసుకుంది. రెండో రోజు తగ్గినా.. ఫస్ట్ వీకెండ్ ముగిసే నాటికి ఈ కలెక్షన్ల రికార్డు మరింత మెరుగవుతుందన్న ఆశతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. నిజానికి ఇండియాలో తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 4 సినిమాల్లో మూడు ప్రభాస్ వే కావడం విశేషం.
తొలి స్థానంలో ఆర్ఆర్ఆర్ ఉండగా.. రెండు నుంచి నాలుగు స్థానాల వరకు ప్రభాస్ నటించిన బాహుబలి 2, కల్కి 2898 ఏడీ, సలార్ ఉన్నాయి. ఈ మూవీ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. మరి తొలి వారం ముగిసే సరికి ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.