Hrithik Roshan on Kantara: కాంతారా నాకు గూస్‌బంప్స్ తెప్పించింది: హృతిక్ రోషన్
Hrithik Roshan on Kantara: కాంతారా తనకు గూస్‌బంప్స్ తెప్పించిందని అన్నాడు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్. ఈ కన్నడ సెన్సేషన్ ఖాతాలో మరో సెలబ్రిటీ అభిమాని చేరిపోయాడు.
Hrithik Roshan on Kantara: సినిమాలకు, హీరోలకు సాధారణ అభిమానులు ఎంతో మంది ఉంటారు. కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలను కూడా తన అభిమానులుగా మార్చేసుకుంది కాంతారా సినిమా. ఈ లోబడ్జెట్ కన్నడ సినిమా ఇండియన్ సినిమాలో ఓ పెను సంచలనం. మొదట కేవలం కన్నడలో మాత్రమే రిలీజై.. తర్వాత తెలుగు, తమిళం, హిందీల్లోనూ డబ్ అయిన ఈ మూవీ రూ.400 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ సినిమా తనకు గూస్‌బంప్స్ తెప్పించిందని, 50 ఏళ్లలో ఓసారి వచ్చే సినిమా ఇది అని అన్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా సరిగ్గా ఇలాగే స్పందించాడు. కాంతారా తనకు గూస్‌బంప్స్ తెప్పించిందని ట్వీట్ చేశాడు. ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కావడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కాంతారాకు అభిమానులుగా మారుతున్నారు.
"కాంతారా చూసి ఎంతో నేర్చుకున్నాను. రిషబ్ శెట్టి దృఢ నిశ్చయం ఈ సినిమాను అసాధారణంగా మార్చేసింది. కథను చెప్పిన తీరు, డైరెక్షన్, నటన అత్యద్భుతం. క్లైమ్యాక్స్ అయితే నాకు గూస్‌బంప్స్ తెప్పించింది. టీమ్‌కు నా శుభాకాంక్షలు" అని హృతిక్ ట్వీట్ చేయడం విశేషం.
దక్షిణ కర్ణాటకలోని భూత కోల, కంబల సాంప్రదాయాలకు ఈ సినిమా అద్దం పట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన, అతని డైరెక్షన్ చాలా మందికి నచ్చుతోంది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమా చూసిన కర్ణాటక ప్రభుత్వం.. ఈ భూత కోల కళ, కళాకారులు అంతరించిపోకుండా చర్యలు చేపట్టిందంటేనే దీని ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.