Vikkatakavi OTT: ఓటీటీలోకి రాబోతున్న డిటెక్టివ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్‌తోనే గూస్ బంప్స్
Vikkatakavi Web Series In OTT: థ్రిల్లర్ సినిమాలకి ఇటీవల కాలంలో ఆదరణ బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా.. డిటెక్టీవ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడని వారు చాలా అరుదు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో త్వరలోనే వికటకవి అనే వెబ్ సిరీస్ రాబోతోంది.
నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించారు. ప్రదీప్ మద్దాలి ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ డిటెక్టివ్ వెబ్ సిరీస్‌కి సంబంధించి ట్రైలర్‌ను గురువారం హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు.
ట్రైలర్‌లో ఏం చూపించారంటే?
అమరిగిరిలోని దేవతల గట్టుకి వెళ్లటానికి అక్కడి ప్రజలు భయపడుతుంటారు. దేవత శపించిన గ్రామమని అక్కడి వారు భయపడుతూ ఉంటారు. కానీ.. ఆ గ్రామానికి చెందిన ప్రొఫెసర్ మాత్రం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పని చేస్తుంటాడు. అలా యూనివర్సిటీలో చదువుతున్న తన శిష్యుడైన రామకృష్ణను ఆ సమస్యను పరిష్కరించడానికి పంపిస్తాడు.
అమరగిరిలో ఎవరూ చేదించలేని సమస్యని ఆ శిష్యుడు చేధిస్తాడా? ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యల గురించి ట్రైలర్‌లో ప్రస్తావించే ప్రయత్నం చిత్ర యూనిట్ చేసింది. ఈ వెబ్ సిరీస్‌కి అజయ్ అరసాడ సంగీతాన్ని అందించగా.. షోయబ్ సిద్ధికీ సినిమాటోగ్రఫీ అందించారు.
ఎత్తుకి పైఎత్తులు
టీజర్ రిలీజ్ సందర్భంగా హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ ‘‘వికటకవిలో డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నటించటం ఛాలెంజింగ్‌గా, చాలా ఎగ్జైటింగ్‌గా కూడా అనిపించింది. ఆ అమరగిరి గ్రామంలో నిజాల్ని కనిపెట్టటానికి వేసే ఎత్తుగడలు ప్రేక్షకులకి చాలా ఆసక్తిగా అనిపిస్తాయి. ఇందులో రామకృష్ణ ఆ ఊరిలోని సమస్యను పరిష్కరించటమే కాదు.. తన సమస్యను కూడా పరిష్కరించుకుంటాడు. మేం క్రియేట్ చేసిన మిస్టరీ ప్రపంచం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశాడు.