Hanuman fans vs ZEE5: హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. జీ5 ఓటీటీపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్-hanuman ott release delayed fans furious over zee5 ott platform says they do not have any info about the digital premier ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Fans Vs Zee5: హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. జీ5 ఓటీటీపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్

Hanuman fans vs ZEE5: హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. జీ5 ఓటీటీపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu

Hanuman fans vs ZEE5: హనుమాన్ మూవీ శుక్రవారం (మార్చి 8) జీ5 ఓటీటీలోకి వస్తుందని ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో మూవీ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో జీ5పై దుమ్మెత్తిపోస్తున్నారు.

హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. జీ5 ఓటీటీపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్

Hanuman fans vs ZEE5: ఎప్పుడో సంక్రాంతికి రిలీజైన హనుమాన్ మూవీ ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం (మార్చి 8) డిజిటల్ ప్రీమియర్ ఉండనున్నట్లు గత వారం అధికారిక సమాచారం వచ్చింది. కానీ రిలీజ్ కు కొన్ని గంటల ముందు నుంచీ దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదంటూ జీ5 (ZEE5) ఓటీటీ చెప్పడంతో అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

హనుమాన్ ఫ్యాన్స్ వెర్సెస్ జీ5 ఓటీటీ

హనుమాన్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అంటూ సోషల్ మీడియా ఎక్స్ లో జీ5 ఓటీటీని ట్యాగ్ చేస్తూ అభిమానులు గురువారం అర్ధరాత్రి నుంచే ట్వీట్లు చేస్తున్నారు. దీనికి జీ5 ఇస్తున్న సమాధానం ఒక్కటే. "హాయ్. దీనికి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. మా వెబ్‌సైట్, సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచండి" అని జీ5 చెబుతోంది.

హనుమాన్ ఓటీటీ రిలీజ్ పై అడిగిన ప్రతి ఒక్కరికీ ఆ ప్లాట్‌ఫామ్ నుంచి వస్తున్న సమాధానం ఇదొక్కటే. దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఓ అభిమాని అయితే సదరు ఓటీటీపై తీవ్రంగా మండిపడ్డాడు. "కంటెంట్ గురించి మా దగ్గర సమాచారం లేదంటూ పిచ్చి సమాధానాలు ఇవ్వకు జీ5. మీరే మూవీని కొనుగోలు చేశారు. మీరే సమాధానం ఇవ్వాలి. మీరు ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తున్నారు. హనుమాన్ ఎక్కడ" అంటూ నిలదీశారు.

దీనిపై జీ5 ఓటీటీ అలాగే స్పందించింది. "హాయ్. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ప్రస్తుతానికి దీనిపై మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. అప్డేట్స్ కోసం మా సోషల్ మీడియా, వెబ్ సైట్ చూస్తూ ఉండండి" అని మాత్రమే జీ5 చెబుతోంది. మీ సమాధానం చాలా నిరాశ కలిగిస్తోంది.. కనీసం హనుమాన్ ఎప్పుడు వస్తుందో ఓ టైమ్ అయినా చెప్పండి.. మా ఫ్యామిలీ మొత్తం ఎదురు చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ రకరకాలుగా ట్వీట్లు చేస్తున్నారు.

జీ5 అంత చెత్త ఓటీటీ అసలు మరొకటి లేదు.. ఇంకెంత కాలం వాయిదా వేస్తారంటూ కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం (మార్చి 8) ఉదయం నుంచి జీ5ను ట్యాగ్ చేస్తున్న ట్వీట్లన్నీ హనుమాన్ సంబంధిత ప్రశ్నలతోనే నిండిపోయాయి.

హనుమాన్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు?

హనుమాన్ మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో మిగిలిన సంక్రాంతి సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లోకి వచ్చినా.. హనుమాన్ మాత్రం రాలేదు. మార్చి 8న వస్తుందని గత వారం అధికారిక ప్రకటన రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. కానీ కొన్ని గంటల ముందు నుంచీ జీ5 ఓటీటీ దీనిపై సమాచారం లేదంటూ తీవ్రంగా నిరాశపరిచింది.

ప్రస్తుతానికి హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నదానిపై ఎలాంటి ప్రకటన రాలేదు. అటు మూవీ టీమ్ ను, ఇటు జీ5 ఓటీటీని ట్యాగ్ చేస్తూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా.. ఎవరి నుంచీ ఎలాంటి స్పందన రావడం లేదు. ప్రస్తుతానికి హనుమాన్ కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.