Hanuman Advance Bookings: హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్.. మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్-hanuman advance bookings started paid premiers a day before release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Advance Bookings: హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్.. మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్

Hanuman Advance Bookings: హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్.. మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్

Hari Prasad S HT Telugu
Published Jan 09, 2024 08:05 AM IST

Hanuman Advance Bookings: సంక్రాంతి సినిమాగా వస్తున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇక రిలీజ్ కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయనున్నారు.

హనుమాన్ మూవీ పెయిడ్ ప్రీమియర్స్
హనుమాన్ మూవీ పెయిడ్ ప్రీమియర్స్

Hanuman Advance Bookings: ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న పెద్ద హీరోల సినిమాల మధ్య తేజ సజ్జ నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ముఖ్యంగా దేశమంతా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ మూడ్‌లో ఉన్న ఈ సమయంలో తమ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

అందుకే గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగలాంటి పెద్ద హీరోల సినిమాలు ఉన్నా.. హనుమాన్ రిలీజ్ కాబోతోంది. ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఈ మూవీ రిలీజ్ కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ కూడా ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. జనవరి 12న మూవీ రిలీజ్ కానుండగా.. జనవరి 11న ఈ ప్రీమియర్స్ వేయనున్నారు.

గురువారం (జనవరి 11) సాయంత్రం ఈ ప్రీమియర్స్ ఉండనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్రత్యేకమైన షోలు ప్రదర్శించనున్నారు. ఏపీలోని అమలాపురంలో ఉన్న వీపీసీ కాంప్లెక్స్ లో రాత్రి 9 గంటల షో, వైజాగ్ జగదాంబ థియేటర్లో సాయంత్రం 6.30 గంటలకు హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్ వేయనున్నారు.

జగదాంబలో అరగంటలోనే టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. దీంతో శరత్, ఎస్‌టీబీఎల్ థియేటర్లలోనూ ప్రీమియర్స్ వేయాలని నిర్ణయించారు. మరిన్ని థియేటర్లలోనూ ఈ ప్రీమియర్స్ వేయాలని మేకర్స్ భావిస్తున్నారు. పెద్ద సినిమాల మధ్య తమ మూవీ నిలదొక్కుకుంటుందని బలంగా నమ్మిన మేకర్స్ నమ్మకం వమ్ము కాకుండా ఈ హనుమాన్ అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

హనుమాన్ మూవీ ఏంటి?

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి సినిమా హనుమాన్. ఇది ఒక ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్. ఇలాంటివి మొత్తం 12 సినిమాలు తీయబోతున్నట్లు ఇప్పటికే ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశాడు. ప్రతి సినిమాలోనూ మన దేవుళ్లే సూపర్ హీరోలని అతడు వెల్లడించాడు. అందులో మొదటి సినిమాగా హనుమాన్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సినిమా సక్సెస్ పై ఆధారపడి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మిగతా సినిమాలు రానున్నాయి. దీంతో హనుమాన్ పెద్ద హిట్ అవ్వాలని మేకర్స్ ఆశిస్తున్నారు. రూ.55 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే నాన్ థియేట్రికల్, థియేట్రికల్ హక్కుల రూపంలో సుమారు 80 శాతం బడ్జెట్ తిరిగి మేకర్స్ కు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

గుంటూరు కారంలాంటి మూవీతో పోటీపడి అదే రోజు రిలీజ్ కానుండటంతో హనుమాన్ ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది. ప్రీమియర్స్ తోనే కాస్త పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోవడం ఖాయం. ఇక ఈ మూవీ ప్రతి టికెట్ పై రూ.5ను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్లు కూడా ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ద్వారా మేకర్స్ అనౌన్స్ చేయించారు. తేజ సజ్జతోపాటు అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో నటించారు.

Whats_app_banner