HanuMan Release Date: హనుమాన్ సినిమా రిలీజ్‍పై రూమర్లు: క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
HanuMan Release Date: హనుమాన్ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ తాజాగా రూమర్లు బయటికి వస్తున్నాయి. దీంతో ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు.
HanuMan Release Date: యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’పై చాలా ఆసక్తి నెలకొని ఉంది. టీజర్ తర్వాత ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. తేజ సజ్జా ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఆ!, జాంబిరెడ్డి లాంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్‍ను కూడా ఆకట్టుకునేలా తీసుకొస్తారన్న నమ్మకం కలిగించారు. టీజర్‌తోనే చాలా ప్రశంసలు అందుకున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్‍తో పాటు మరో నాలుగు విదేశీ భాషల్లోనూ హనుమాన్ రిలీజ్ కానుంది. కాగా, హనుమాన్ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పష్టత ఇచ్చారు.
వచ్చే ఏడాది (2024) జనవరి 12వ తేదీన హనుమాన్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, ఇటీవల చాలా సినిమాల రిలీజ్‍లు వాయిదా పడ్డాయి. డిసెంబర్ 22న సలార్ మూవీ రానుండటంతో మరికొన్ని చిత్రాలు అప్పటి నుంచి సంక్రాంతికి వస్తాయని అంచనాలు ఉన్నాయి. దీంతో హనుమాన్ మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటుందని తాజాగా రూమర్లు వినిపిస్తున్నాయి. దీనిపై హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ నేడు స్పష్టత ఇచ్చారు.
హనుమాన్ చిత్రం 2024 జనవరి 12వ తేదీనే రిలీజ్ అవుతుందని నేడు ట్వీట్ చేశారు. వాయిదా ఊహాగానాలకు చెక్ పెట్టారు. దీంతో, ఎన్ని చిత్రాలు పోటీకి ఉన్నా.. సంక్రాంతి బరిలోనే హనుమాన్ ఉండడం ఖరారైంది.
హనుమాన్ చిత్రం భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, కొరియన్, స్పానిష్, చైనీస్, జపనీస్ భాషల్లోనూ విడుదల కానుంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ ఈ చిత్రం కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్.. హనుమాన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం, రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామిరంగ’, విజయ్ దేవరకొండ ‘VD12’ సినిమాలు కూడా రానున్నాయి. వెంకటేశ్ ‘సైంధవ్’ కూడా జనవరి 13కు వస్తుందని తెలుస్తోంది. ఇక హనుమాన్ కూడా వెనక్కి తగ్గబోమని చెప్పేసింది. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీక్ వద్ద తీవ్రమైన పోటీ ఉండనుందని అర్థమవుతోంది. మరి వీటిలో ఏమైనా రేసు నుంచి తప్పుకుంటాయా అన్నది చూడాలి.