Manjummel Boys: 200 కోట్లు వస్తాయని అసలు ఊహించలేదు.. గుహలాంటి సెట్ వేశాం: మలయాళ హిట్ మూవీ డైరెక్టర్-director chidambaram s poduval about manjummel boys movie box office collection and guna cave set ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manjummel Boys: 200 కోట్లు వస్తాయని అసలు ఊహించలేదు.. గుహలాంటి సెట్ వేశాం: మలయాళ హిట్ మూవీ డైరెక్టర్

Manjummel Boys: 200 కోట్లు వస్తాయని అసలు ఊహించలేదు.. గుహలాంటి సెట్ వేశాం: మలయాళ హిట్ మూవీ డైరెక్టర్

Sanjiv Kumar HT Telugu
Apr 04, 2024 12:42 PM IST

Director Chidambaram About Manjummel Boys: మలయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ ఏప్రిల్ 6న ఏపీ, తెలంగాణలోని థియేటర్లలో తెలుగు భాషలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను డైరెక్టర్ చిదంబరం ఎస్ పొదుపల్ తెలిపారు.

200 కోట్లు వస్తాయని అసలు ఊహించలేదు.. గుహలాంటి సెట్ వేశాం: మలయాళ హిట్ మూవీ డైరెక్టర్
200 కోట్లు వస్తాయని అసలు ఊహించలేదు.. గుహలాంటి సెట్ వేశాం: మలయాళ హిట్ మూవీ డైరెక్టర్

Director Chidambaram About Manjummel Boys: మలయాళంలో విడుదలై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సినిమా మంజుమ్మల్ బాయ్స్. ఇప్పుడు ఈ సినిమా గురించే టాక్ నడుస్తోంది. సర్వైవల్ థ్రిల్లర్‌గా, ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. కొడైకెనాల్‌లో గుణ కేవ్స్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చిదంబరం ఎస్ పొదువల్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో ఏప్రిల్ 6న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను డైరెక్టర్ చిదంబరం పంచుకున్నారు.

సినిమా విడుదలకు ముందు 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఊహించారా?

లేదండీ! మేం మంచి సినిమా తీశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అయితే, రూ. 200 కోట్ల కలెక్షన్లు వస్తాయని అసలు ఊహించలేదు. కలెక్షన్స్ కోసం మేం సినిమా తీయలేదు. నేను గానీ, నిర్మాతలు గానీ, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ గానీ కలెక్షన్స్ గురించి అసలు ఆలోచించలేదు.

మంజుమ్మల్ బాయ్స్ తీయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది?

నా ఫస్ట్ సినిమా 'జానెమన్' 2021లో విడుదలైంది. ఆ తర్వాత కేరళలో కొందరు స్నేహితులు గుణ కేవ్స్‌కి వెళ్లారని, ఈ సంఘటన జరిగిందని నాకు తెలిసింది. ఆ స్నేహితుల కథ, వాళ్ల స్నేహం నన్ను ఎగ్జైట్ చేసింది. అప్పట్నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. అంతేకాకుండా, నేను వాళ్లను కలిశా. ఆల్రెడీ నేనొక సినిమా చేశానని చెప్పాను. అందరూ తమ తమ జీవితాల్లో ఏం జరిగిందో వివరించారు. సినిమాకు కావాల్సిన మెటీరియల్ ఉందని అర్థమైంది. 'ఇది ప్రజలకు చెప్పాల్సిన కథ. సినిమా తీయాలి' అన్నాను. వాళ్ల కథను సినిమా తీస్తానని చెప్పేసరికి ఎగ్జైట్ అయ్యారు.

రెండో సినిమాకు మూడేళ్లు పట్టినట్లు ఉంది?

రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కథలు రాయడం టఫ్ ప్రాసెస్. మంజుమ్మల్ బాయ్స్ స్క్రిప్ట్ రాయడానికి నాకు ఏడాది, ఏడాదిన్నర పట్టింది. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆరు నెలలు తీసుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం మరో ఆరు నెలలు పట్టింది. సినిమా తీసే ప్రతి ప్రాసెస్ నేను ఎంజాయ్ చేశా.

రియల్ లొకేషన్స్, సెట్స్ వేసి సినిమా తీశారు! ఆ ప్రాసెస్ గురించి..

మంజుమ్మెల్ బాయ్స్ గుణ కేవ్స్ వెళ్లే వరకు ఆ కొడైకెనాల్ ట్రిప్, కేప్స్ అవుట్ సైడ్ సీన్స్ అన్నీ రియల్ లొకేషన్స్‌లో తీశాం. కేవ్స్ లోపల సీన్స్ కోసం సెట్స్ వేశాం. ఆ సెట్ వర్క్ కోసం నాలుగు నెలలు పట్టింది. షూటింగ్ ప్రాసెస్ అంతా ఈజీగా ఉంది. మేమంతా కలిసి టూర్ వెళ్లినట్టు రియల్ లొకేషన్స్‌లో ఆడుతూ పాడుతూ సినిమా చేశాం.

సినిమాలో మీ అన్నయ్య నటించారు కూడా! సో, ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట!

(నవ్వుతూ...) డాక్టర్ ఫైజల్ రోల్ చేసిన గణపతి ఎస్ పొదువల్ నా బ్రదర్. యాక్టర్, ప్రొడ్యూసర్ సౌబిన్ షాహిర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. షూటింగ్ దగ్గరకు మా ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. ప్రతి రోజూ రాత్రి బాన్ ఫైర్ (చలిమంట) వేసేవాళ్లం. అందరం కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. జీవితంలో మళ్లీ అలాంటి రోజులు వస్తాయో, రావో! మేమంతా అంత ఎంజాయ్ చేశాం. సినిమా ప్రాసెస్ అంతా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. గుణ కేవ్స్‌కు తొలిసారి వెళ్లడం కూడా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్.

Whats_app_banner