Anil Sunkara: “క్రూరమైన ఆనందం”: రూమర్లపై భోళా శంకర్ నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్
Anil Sunkara: చిరంజీవితో తనకు విభేదాలు వచ్చాయని చక్కర్లు కొడుతున్న రూమర్లపై భోళా శంకర్ సినిమా నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. గట్టి కౌంటర్లు ఇచ్చారు.
Anil Sunkara: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. గత వారం ఆగస్టు 11వ తేదీన ఈ చిత్రం విడుదల కాగా.. ఆశించిన స్థాయి కంటే చాలా తక్కువగా కలెక్షన్లను దక్కించుకుంది. చిరంజీవి కెరీర్‌లో ఒకానొక డిజాస్టర్ దిశగా సాగుతోంది. భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించగా.. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. భోళా శంకర్ సినిమా విఫలమవటంతో నిర్మాత అనిల్ సుంకరకు భారీ నష్టాలు వచ్చాయని, చిరంజీవితో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయన్న రూమర్లు కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై అనిల్ సుంకర నేడు (ఆగస్టు 17) స్పందించారు.
రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేనని చిరంజీవి పట్టుబట్టడంతో ఆస్తులను అమ్మేందుకు భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర సిద్ధమయ్యారని ఇటీవల సోషల్ మీడియాలో రూమర్లు రేకెత్తాయి. ఈ రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు అనిల్. ఈ మేరకు నేడు ఓ ట్వీట్ చేశారు. తమకు, చిరంజీవికి మధ్య వివాదం తలెత్తిందన్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా.. గట్టిగా చెప్పారు. “ఈ రూమర్లు కొందరికి క్రూరమైన ఆనందాన్ని ఇవ్వొచ్చు. కానీ సుదీర్ఘ కాలం నుంచి ఎంతో కష్టపడి దక్కించుకున్న ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేయడం ఆమోదయోగ్యం కానీ నేరం. ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన అన్ని కుటుంబాలపై తీవ్రమైన ఒత్తిడి, ఆందోళలను పెంచాయి. చిరంజీవి గారికి, నాకు మధ్య వివాదాలు వచ్చాయని వ్యాప్తిస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం. ఆయన మాకు నిరంతరం చాలా మద్దతు ఇచ్చారు. ఆయన ఎప్పటిలాగానే నాతో చాలా బాగా ఉన్నారు” అని అనిల్ సుంకర నేడు ట్వీట్ చేశారు.
మళ్లీ బలంగా తిరిగొస్తాం
ప్రస్తుత పరిస్థితుల్లో తమ గురించి ఆలోచించిన శ్రేయోభిలాషులకు అనిల్ సుంకర ధన్యవాదాలు చెప్పారు. మళ్లీ బలంగా తిరిగివస్తానని పేర్కొన్నారు. “నిజాలను కప్పి ఉంచే విధంగా ఉండే విద్వేషాన్ని అనుమతించొద్దండి. ఫేక్ న్యూస్ సృష్టించడం కొందరికి ఆనందం కావొచ్చు.. కానీ ఇది అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ కోసం ఆందోళన వ్యక్తం చేసిన ఇండస్ట్రీలోని శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. వారి ఆశీస్సులతో మళ్లీ బలంగా తిరిగొస్తామని ఆశిస్తున్నా” అని అనిల్ సుంకర తన ట్వీట్‍లో పేర్కొన్నారు.
భోళా శంకర్ చిత్రానికి సుమారు రూ.80కోట్లపైగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. దాదాపు 50 శాతం వరకు ఈ చిత్రానికి నష్టం వచ్చే ఛాన్స్ ఉందనే అంచనాలు వస్తున్నాయి. అయితే, ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.