Chiranjeevi On Ramcharan: రామ్‌చరణ్‌పై చిరు ఎమోషనల్ ట్వీట్ - రాజమౌళి పేరు ప్రస్తావించకపోవడంపై ట్రోల్స్
Chiranjeevi On Ramcharan: ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ నటనపై హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించాడు. కామెరూన్ ప్రశంసలతో ట్విట్టర్ వేదికగా చిరంజీవి ఆనందం వ్యక్తం చేశాడు. కామెరూన్ మాటలు ఆస్కార్ కంటే తక్కువేమీ కాదని చిరంజీవి అన్నాడు.
Chiranjeevi On Ramcharan: నటుడిగా రామ్‌చరణ్ సాధిస్తోన్న ఘనతల్ని చూసి తండ్రిగా గర్వపడుతోన్నానంటూ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. పలువురు హాలీవుడ్ దిగ్గజ దర్శకులు ప్రశంసలు కురిపిస్తోన్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ సినిమాలు రామ్‌చరణ్ పాత్ర ఛాలెంజింగ్‌గా ఉందంటూ హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ పొగడ్తల వర్షం కురిపించారు. తనయుడిపై హాలీవుడ్ లెజెండ్ అభినందనలు కురిపించడంలో చిరంజీవి ఆనందంలో మునిగిపోయారు.
రామ్‌చరణ్ గురించి కామెరూన్ చెప్పిన వీడియోను చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గ్లోబల్ ఐకాన్ సినిమాటిక్ జీనియస్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ బాగుందంటూ పేర్కొన్నడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేమీ కాదని చిరంజీవి ట్వీట్ చేశాడు.
నటుడిగా రామ్ చరణ్ సాధిస్తోన్న ప్రగతి చూస్తుంటే తండ్రిగా గర్వపడుతోన్నానంటూ ఈ ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నాడు. అతడి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా గత ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయి చరిత్రను సృష్టించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది.
రాజమౌళి పేరు ప్రస్తావించని చిరు
ఈ ట్వీట్‌లో చిరంజీవి ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి పేరు ప్రస్తావించకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వ్యక్తమవుతోన్నాయి. రాజమౌళి వల్లే రామ్‌చరణ్‌కు పేరు వచ్చిందంటూ, ఆ క్రెడిట్ అంతా రాజమౌళిదేనని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామ్‌చరణ్‌తో పాటు ఎన్టీఆర్ పేరు కూడా చిరంజీవి ట్వీట్‌లో పేర్కొంటే బాగుండేదంటూ చెబుతున్నారు.