Chandra Mohan: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన చంద్రమోహన్.. ఆయన మరణానికి అసలు కారణాలు ఇవే!
Chandra Mohan Death Cause: సుమారు వేయి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ శనివారం కన్నుమూశారు. ఈ క్రమంలో చంద్రమోహన్ ఆరోగ్యంపై చేసిన నిర్లక్ష్యం, ఆయన మరణానికి గల కారణాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
Chandra Mohan About His Health: హీరోగా, నటుడిగా, హాస్య నటుడిగా వందల చిత్రాల్లో నటించిన చంద్రమోహన్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. చంద్రమోహన్ చికిత్స పొందుతూ హైదరబాద్ అపొలో హాస్పిటల్‌లో నవంబర్ 11న తుది శ్వాస విడిచారు. అయితే, చంద్రమోహన్ మరణానికి ముందు తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లు ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.
ఆల్ రౌండర్ కావాలి
2021లో తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ సినీ కెరీర్, హెల్త్ గురించి తెలిపారు. "ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆల్ రౌండర్ కాక తప్పదు. అందుకే ఇన్ని రకాల పాత్రలు చేశాను. హీరోగానే చేయాలనుకుంటే ఇండస్ట్రీలో 50 ఏళ్లు ఉండేవాన్ని కాదు. నేను దాదాపుగా 55 సంవత్సరాలు నిర్విరామంగా ఇండస్ట్రీలో పని చేశాను. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశాను" అని చంద్రమోహన్ ఆ ఇంటర్వ్యూలో అన్నారు.
ఇనుముకు చెదలు పడుతుందా
"నా ఆరోగ్యం గురించి ఎవరు హెచ్చరించినా ఇనుముకు చెదలు పడుతుందా, నాది ఉక్కు శరీరం అంటూ వెటకారం చేసేవాడిని. కానీ, తర్వాతే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆలస్యంగా తెలుసుకున్నాను. అప్పుడే అసలు విషయం అర్థమైంది" అని చంద్రమోహన్ తన ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే చంద్రమోహన్ మరణానికి గల కారణాలను ఆయన బంధువు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తాజాగా మీడియాకు తెలిపారు.
కిడ్నీ సమస్య
"చంద్రమోహన్ గారు నాకు స్వయానా మేనమామ. నాలుగేళ్ల నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆ పరిస్థితుల్లోనే కిడ్నీ సమస్య కూడా తలెత్తింది. ఈరోజు (నవంబర్ 11) ఉదయం సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు చనిపోయారని నిర్ధరించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఒక అమ్మాయి చెన్నై నుంచి, మరో కూతురు అమెరికా నుంచి రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత సోమవారం (నవంబర్ 13) అంత్యక్రియలు నిర్వహిస్తాం" అని శివలెంక కృష్ణప్రసాద్ వెల్లడించారు.
బైపాస్ సర్జరీ
కాగా చంద్రమోహన్‌కు 2006లో రాఖీ సినిమా తర్వాత బైపాస్ సర్జరీ జరిగింది. దువ్వాడ జగన్నాథమ్ మూవీ సమయంలో కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలుస్తోంది. అలాగే మధుమేహంతో కూడా బాధపడేవారట. ఇక చంద్రమోహన్ చివరిగా గోపీచంద్ నటించిన ఆక్సీజన్ సినిమాలో నటించారు. తర్వాత నటనకు గుడ్ బై చెప్పి రెస్ట్ తీసుకున్నారు.