Bro TV Premier: టీవీ ఛానెల్‍లో ప్రీమియర్‌కు ‘బ్రో’ రెడీ.. 54 అడుగుల పవర్ స్టార్ కటౌట్‍తో కౌంట్‍డౌన్
Bro TV Premier: బ్రో సినిమా టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. టీవీలో ప్రసారానికి డేట్, టైమ్ ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ భారీ కటౌట్‍తో కౌంట్ డౌన్ కూడా మొదలైంది. ఆ వివరాలివే..
Bro TV Premier: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా మంచి హిట్ సాధించింది. మామాఅల్లుళ్లు కలిసి చేసిన ఈ మల్టీస్టారర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. జూలై 28వ తేదీన థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయింది. ఆరంభంలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్లను మాత్రం బాగానే రాబట్టింది. వింటేజ్ పవన్ కల్యాణ్‍ను బ్రో మూవీలో చూసి సంతోషపడ్డారు ఫ్యాన్స్. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది ఈ మూవీ. కాగా, ఇప్పుడు బ్రో సినిమా బుల్లితెరపైకి వస్తోంది. టీవీ ఛానెల్‍లో ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా భారీ పవన్ కల్యాణ్ కటౌట్‍ను టీవీ ఛానెల్ ఏర్పాటు చేసింది. ఆ వివరాలివే..
బ్రో సినిమా అక్టోబర్ 15వ తేదీన (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా రానుంది. ఈ సందర్భంగా పవర్ స్టార్ అభిమానులకు జీ తెలుగు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. హైదరాబాద్‍లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద పవన్ కల్యాణ్ 54 అడుగుల భారీ కటౌట్‍ను ఆవిష్కరించింది. ఈ కటౌట్‍కు ఓ కౌంట్‍డౌన్ టైమర్ కూడా ఉంది. జీ తెలుగులో బ్రో సినిమా ప్రసారానికి ఇంకా ఎంత సమయం ఉందో ఈ కౌంట్‍డౌన్ చూపిస్తోంది. పవన్ కల్యాణ్ ఈ భారీ కటౌట్ దగ్గర ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు.
తమిళ మూవీ వినోదయ సిత్తంకు రీమేక్‍గా బ్రో చిత్రం తెరకెక్కింది. సముద్రఖని.. బ్రో సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కుటుంబ బాధ్యతలు ఉన్న యువకుడు మార్కండేయులు పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించారు. ఇక, కాలానికి దేవుడైన టైమ్ ఆఫ్ గాడ్ పాత్ర చేశారు పవన్ కల్యాణ్. ఫ్యాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా బ్రో సినిమా వచ్చింది. పవన్ - సాయి ధరమ్ తేజ్ మధ్య కామెడీ సీన్లు బాగా పండాయి. ముఖ్యంగా పవన్ తన మార్క్ మేనరిజమ్‍లతో అలరించారు.
బ్రో చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‍గా నటించారు. రోహిణి, ప్రియా ప్రకాశ్ వారియర్, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, యువలక్ష్మి, అలీ రెజా, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు. ఎస్.థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్లపై టీవీ విశ్వప్రసాద్, వివేక్ కూఛిబోట్ల.. బ్రో మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి నవీన్ నూలీ ఎడిటింగ్ చేయగా.. సుజీత్ వాసుదేవన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహించారు.
టాపిక్