Bollywood Disasters: ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లకూ ఎందుకీ దుస్థితి? బాలీవుడ్‌ పనైపోయిందా?-bollywood facing disasters as laal singh chaddha and raksha bandhan failed to attract audience ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bollywood Disasters: ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లకూ ఎందుకీ దుస్థితి? బాలీవుడ్‌ పనైపోయిందా?

Bollywood Disasters: ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లకూ ఎందుకీ దుస్థితి? బాలీవుడ్‌ పనైపోయిందా?

HT Telugu Desk HT Telugu
Aug 16, 2022 07:22 PM IST

Bollywood Disasters: బాలీవుడ్‌ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. తాజాగా లాంగ్‌ వీకెండ్‌ చూసుకొని మరీ రిలీజ్‌ చేసిన పెద్ద హీరోలు ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌ల సినిమాలు కూడా బోల్తా కొట్టాయి.

<p>దారుణంగా బోల్తా కొట్టిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ సినిమాలు</p>
<p>దారుణంగా బోల్తా కొట్టిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ సినిమాలు</p> (Twitter)

ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌.. బాలీవుడ్‌ను దశాబ్దాల పాటు ఏలిన పెద్ద హీరోలు వీళ్లు. ఈ ఇద్దరి సినిమాలు రిలీజవుతున్నాయంటే ఎన్నో నెలల ముందు నుంచే ఓ బజ్‌ క్రియేట్‌ అవుతుంది. బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లు సాధించే సత్తా ఉన్న హీరోలు వీళ్లు. కానీ తాజాగా గత వారం రిలీజైన ఈ ఇద్దరి సినిమాలు లాల్‌ సింగ్‌ చడ్డా, రక్షాబంధన్‌ బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి.

రూ.210 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన లాల్‌ సింగ్‌ చడ్డా మూవీ తొలి ఐదు రోజుల్లో వసూలు చేసిన మొత్తం కేవలం రూ.45 కోట్లు మాత్రమే. అటు రూ.120 కోట్ల బడ్జెట్‌తో తీసిన అక్షయ్‌కుమార్‌ మూవీ రక్షాబంధన్‌ అయితే తొలి ఐదు రోజుల్లో కేవలం రూ.33 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ లెక్కన ఈ రెండు సినిమాలకు భారీ నష్టాలు తప్పేలా లేవు. ఎన్నోచోట్ల ప్రేక్షకులు లేక వందల కొద్దీ షోలను రద్దు చేసుకునే పరిస్థితి తలెత్తింది.

ఆమిర్‌, అక్షయ్‌లకూ ఎందుకీ దుస్థితి?

కొన్నాళ్లుగా సౌత్‌ నుంచి వస్తున్న పాన్‌ ఇండియా మూవీల దెబ్బ బాలీవుడ్‌కు గట్టిగానే తగులుతోంది. అయితే సౌత్‌ సినిమాలు కూడా పెద్దగా లేని సమయంలోనూ హిందీ ఇండస్ట్రీ కోలుకోలేకపోతోంది. బాలీవుడ్‌ క్రమంగా ఇండియా జనాలకు దూరమవుతుండటమే దీనికి ప్రధాన కారణమని, ఈ ఇండస్ట్రీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన టైమ్ వచ్చిందని పలువురు ట్రేడ్‌ అనలిస్ట్‌లు చెబుతున్నారు.

మంచి స్టోరీ డెవలప్‌ చేయడానికి కాకుండా బడా హీరోలు, డైరెక్టర్లకే భారీగా ఖర్చు చేస్తుండటం వల్ల ఈ దుస్థితి దాపురించిందని వాళ్లు అంటున్నారు. ఒక్క క్లిక్‌తో ప్రపంచంలోని నలుమూలల నుంచి అద్భుతమైన కంటెంట్‌తో కూడిన సినిమాలు కళ్ల ముందుకు వస్తున్న సమయంలో నాణ్యత, క్రియేటివిటీ లేని సినిమాలను ప్రేక్షకులు చీదరించుకుంటున్నారు. ఆమిర్‌ఖాన్‌లాంటి బడా హీరోలను చూసి థియేటర్లకు వెళ్లే రోజులు పోయాయి.

కథ, కథనంలో దమ్ముంటే చిన్న సినిమాలను కూడా ఆదరిస్తున్న ఆడియెన్స్‌.. కేవలం భారీతనాన్ని నమ్ముకున్న సినిమాల వైపు చూడటం లేదు. దీనికితోడు తరచూ బాయ్‌కాట్‌ కాల్స్‌ కూడా బాలీవుడ్‌ కొంప ముంచుతోంది. తాజాగా ఆమిర్‌ఖాన్‌ లాల్‌ సింగ్‌ చడ్డా మూవీకి ఈ బాయ్‌కాట్‌ పిలుపుల దెబ్బ కాస్త గట్టిగానే తగిలింది. ఇదొక్కటే కాదు.. బాలీవుడ్‌ను ఆదుకుంటాయని అనుకుంటున్న హృతిక్‌ రోషన్‌ విక్రమ్‌ వేదా, షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ మూవీలు కూడా ఈ బాయ్‌కాట్‌ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.

సినిమా.. కాస్ట్‌లీ వినోదం

ఈ కాలంలో థియేటర్‌కు వెళ్లి చూడటం చాలా కాస్ట్‌లీగా మారింది. పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచుతున్నారు. దీనికితోడు థియేటర్‌లో పాప్‌కార్న్‌, వాటర్‌ బాటిల్‌ నుంచి ప్రతీదీ చాలా ఖరీదైనదే. నలుగురు ఉన్న ఓ కుటుంబం ఒక సినిమా థియేటర్‌కు వెళ్లి చూసి వచ్చేసరికి కనీసం రూ.1500 నుంచి రూ.3 వేల వరకూ ఖర్చవుతున్న పరిస్థితి.

సినిమాలో అంత దమ్ము ఉంటే కొందరు ప్రేక్షకులు ఇందుకు వెనుకాడకపోవచ్చు. కానీ నానాటికీ తీసికట్టుగా మారుతున్న ఇప్పటి సినిమాల కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేసే పరిస్థితుల్లో మిడిల్‌ క్లాస్‌ ఆడియెన్స్‌ లేరు. నెల, రెండు నెలలు అయితే కానీ తీరిగ్గా ఓటీటీ, టీవీల్లో చూడొచ్చులే అనుకుంటున్నారు. ఒక్క బాలీవుడ్‌ అనే కాదు.. సరైన స్టోరీ, దానిని కట్టిపడేసేలా చెప్పే కథనం లేకుండా కేవలం పెద్ద హీరోలు, భారీతనాన్ని మాత్రమే నమ్ముకుంటే ఏ సినిమా ఇండస్ట్రీకైనా ఇదే గతి పడుతుందనడంలో సందేహం లేదు.