Laal singh chaddha review: లాల్ సింగ్ చడ్డా మూవీ రివ్యూ- ఆమిర్ ఖాన్ సినిమా ఎలా ఉందంటే-aamir khan laal singh chaddha movie telugu review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Laal Singh Chaddha Review: లాల్ సింగ్ చడ్డా మూవీ రివ్యూ- ఆమిర్ ఖాన్ సినిమా ఎలా ఉందంటే

Laal singh chaddha review: లాల్ సింగ్ చడ్డా మూవీ రివ్యూ- ఆమిర్ ఖాన్ సినిమా ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Aug 11, 2022 01:57 PM IST

ఆమిర్‌ఖాన్ హీరోగా అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం లాల్‌సింగ్‌చ‌డ్డా. హాలీవుడ్‌లో క‌ల్ట్‌క్లాసిక్‌గా నిలిచిన ఫారెస్ట్ గంప్ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ యువ‌హీరో నాగ‌చైత‌న్య కీల‌క పాత్ర‌ను పోషించారు. బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందంటే...

<p>ఆమిర్‌ఖాన్</p>
<p>ఆమిర్‌ఖాన్</p> (twitter)

క‌రోనా త‌ర్వాత బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ క్లిష్ట‌ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నది. అగ్ర‌హీరోల సినిమాలు సైతం క‌లెక్ష‌న్స్‌రాబ‌ట్ట‌డంలోవిఫలమవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆమిర్‌ఖాన్ లాల్‌సింగ్‌చ‌డ్డాపై దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది. దాదాపు నాలుగేళ్ల విరామం త‌ర్వాత ఈ సినిమాతో ఆమిర్‌ఖాన్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. హాలీవుడ్‌లో టామ్ హాంక్స్ హీరోగా 1994లో విడుదలై ఆస్కార్ తో పాటు ప‌లు అవార్డులు రివార్డుల‌ను సొంతం చేసుకున్న ఫారెస్ట్‌గంప్ సినిమా ఆధారంగా లాల్‌సింగ్‌చ‌డ్డా తెర‌కెక్కింది.

ఈ సినిమాతోనే టాలీవుడ్ యువ‌హీరో నాగ‌చైత‌న్య బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. తెలుగు వెర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ఈ సినిమాపై బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ప‌లు ప్ర‌త్యేక‌త‌ల‌తో రూపొందిన ఈసినిమా ఏ మేర‌కు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న‌ది. లాంగ్‌గ్యాప్ త‌ర్వాత ఆమిర్‌ఖాన్ ఈ సినిమాతో బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌గ‌లిగాడా? నాగ‌చైత‌న్య బాలీవుడ్ ఎంట్రీకి ఇది స‌రైన సినిమా అనిపించుకుందా? బాలీవుడ్ నష్టాలకు ఈ సినిమా పుల్ స్టాప్ పెట్టిందా లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే.

లాల్ సింగ్ చడ్డా ప్రయాణం

లాల్ సింగ్ చడ్డా (ఆమిర్ ఖాన్) చిన్నతనంలో అవిటితనం కారణంగా సరిగా నడలేకపోతాడు. మిగతా పిల్లల మాదిరిగా చరుకుగా ఉండకపోవడంతో అందరూ అతడిని హేళన చేస్తుంటారు. కానీ లాల్ అమ్మ మాత్రం తన కొడుకు గొప్పవాడు అవుతాడని బలంగా నమ్ముతుంటుంది. అమ్మ తర్వాత రూప (కరీనాకపూర్) క‌ష్టాసుఖాల్లో లాల్ తోడు నిలుస్తుంది. లాల్ ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటాడు. కానీ రూప మాత్రం బాగా డ‌బ్బు సంపాదించాల‌ని, హీరోయిన్‌గా ఎద‌గాల‌నే క‌ల‌ల‌తో లాల్ కోరిక‌ను తిర‌స్క‌రించి వెళ్లిపోతుంది. డిగ్రీ పూర్తి చేసిన లాల్ ఆర్మీలో జాయిన్ అవుతాడు.

ఆర్మీలో అత‌డికి బాల‌రాజుతో (నాగచైతన్య) స్నేహం కుదురుతుంది. ఇద్ద‌రు క‌లిసి వ్యాపారాన్ని ప్రారంభించాల‌ని అనుకుంటారు. కానీ శ‌త్రువుల దాడిలో బాల‌రాజు చ‌నిపోతాడు. లాల్‌సింగ్ గాయ‌ప‌డ‌టంతో ఆర్మీ నుంచి రిటైర్ మెంట్ తీసుకోవాల్సివస్తుంది. ఆర్మీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన లాల్ ఏం చేశాడు. స్నేహితుడు బాల‌రాజుకు ఇచ్చిన ఐడియాను ఫాలో అవుతూ వ్యాపార‌వేత్త‌గా ఎదిగాడా ? లాల్ సింగ్ ప్రేమ‌ను కాద‌ని వెళ్లిపోయిన రూప త‌న త‌ప్పును ఎలా తెలుసుకున్న‌ది? వారిద్ద‌రు పెళ్లి చేసుకున్నారా? లాల్‌సింగ్ జీవ‌న ప్ర‌యాణంలో ఎదురైన సంఘ‌ట‌న‌లేమిట‌న్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

చారిత్రక సంఘటనలకు సాక్షిగా...

ప‌లు చారిత్ర‌క సంఘ‌ట‌న‌ల‌తో ముడిప‌డుతూ సాగే ఓ వ్య‌క్తి జీవ‌న ప్రయాణానికి దృశ్యరూపంగా లాల్ సింగ్ చడ్డా నిలుస్తుంది. త‌న ప్ర‌మేయం లేకుండా ఎన్నో గొప్ప సంఘ‌ట‌న‌ల‌కు ఓ వ్య‌క్తి ఎలా సాక్షిగా నిలిచాడు? వాట‌న్నింటి మ‌ధ్య అత‌డి జీవ‌న‌గ‌మ‌నం ఎలా సాగింది అనే పాయింట్ తో ద‌ర్శ‌కుడు అద్వైత్ చంద‌న్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

కార్గిల్ వార్ వరకు ..

ఇందిరాగాంధీ ఎమ‌ర్జెన్సీ ఎత్తివేత‌, 1983 ఇండియా వ‌ర‌ల్డ్‌క‌ప్ గెల‌వ‌డం, ఆప‌రేష‌న్ బ్లూస్టార్, ఇందిరాగాంధీ హ‌త్య‌, సిక్కుల ఊచ‌కోత మొద‌లుకొని కార్గిల్ వార్ వ‌ర‌కు దేశాన్ని మ‌లుపుతిప్పిన ఎన్నో కీల‌క ఘ‌ట్టాల‌తో లాల్‌సింగ్‌చ‌డ్డాకు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉన్న సంబంధాన్ని ఆవిష్కరిస్తూ లాల్ సింగ్ చడ్డా కథ మొదలవుతుంది. ఈ అంశాల‌కు తల్లి కొడుకుల అనుబంధంతో పాటు ప్రేమకథను జోడిస్తూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. గెలవాలనే తపన, సంకల్పం ముందు ఎన్ని ఆటంకాలైనా దూదిపింజలాగే ఉంటాయని సందేశాన్ని దర్శకుడు ఈ సినిమాలో ఆవిష్కరించారు. గెలుపు కోసం అడ్డదారుల్లో ప్రయాణిస్తే జీవితం ఎలా విషాదంగా ముగుస్తుందో తెరపై ఆవిష్కరించారు.

ఫన్ ఎమోషన్స్ తో...

లాల్‌సింగ్‌చ‌డ్డా బాల్యంతో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. చిన్న‌త‌నంలో త‌న‌కు ఎదురైన అవ‌మానాల‌ను త‌ల్లి తో పాటు స్నేహితురాలు రూప స‌హ‌కారంతో అత‌డు ఎలా ఎదుర్కొన్నాడ‌నే అంశాల‌ను చాటుతూ క‌థ మొద‌ల‌వుతుంది. అమాయ‌క‌త్వం ఉన్నా త‌న‌లోని అస‌మాన తెలివితేట‌ల‌ను ఉప‌యోగిస్తూ లాల్‌సింగ్‌చ‌డ్డా సైన్యంలో ఎలా చేరాడ‌నేది ఫ‌న్‌తో పాటు ఉద్వేగాలు జోడిస్తూ ఫ‌స్ట్‌హాప్‌లో చూపించారు. జీవితంలో తాను ఎద‌గ‌డ‌మే కాకుండా త‌న చుట్టుప‌క్క‌ల వారిలో లాల్‌సింగ్ చ‌డ్డా ఏ విధంగా స్ఫూర్తిని నింపాడ‌న్న‌ది సెకండాఫ్‌లో చూపించారు. రూప ప్రేమ‌ను వెతుక్కుంటూ లాల్ సాగించే జ‌ర్నీతో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ సాగుతాయి. చిన్న‌త‌నంలో త‌న తోడుగా నిలిచిన ప్రియురాలికి ఆప‌ద‌లో లాల్ ఏ విధంగా ఆండ‌గా నిలిచి కృత‌జ్ఞ‌త‌గా చాటుకున్నాడ‌న్న‌ది క్లైమాక్స్‌లో సెంటిమెంట్ జోడించి తెరపై సాగుతుంది.

ఓరిజినాలిటీ మిస్...

హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఇది. ఒరిజినల్ సినిమాను పూర్తిగా మ‌క్కికి మ‌క్కీ ఫాలో అయ్యాడు ద‌ర్శ‌కుడు. ఆమిర్ క్యారెక్ట‌రైజేష‌న్ మొద‌లుకొని అతడి ల‌వ్‌స్టోరీ, నాగ‌చైత‌న్య‌తో ఫ్రెండ్‌షిప్ ఇలా చాలా వ‌ర‌కు ఫారెస్ట్ గంప్ లో ఉన్న సీన్స్ లో చిన్న పాటి మార్పులు చేస్తూ లాల్ సింగ్ చడ్డాను తెర‌కెక్కించారు. వాటికి మ‌న‌వైన భావోద్వేగాల‌ను జోడించి ప్రేక్షకుల్ని మెప్పించాలని ప్రయత్నించారు. చారిత్ర‌క సంఘ‌టన‌ల‌తో ముడిపెడుతూ లాల్ సాగించిన ప్ర‌యాణంలో సినిమాటిక్ ఫీల్ తో సాగుతుంది తప్పితే ఒక్కడ ఓరిజినాలిటీ కనిపించదు.

లాజిక్స్ లేవు...

నిదానంగా సాగ‌డం ఈ సినిమాకు పెద్ద మైన‌స్‌గా మారింది. ద్వితీయార్థం మొత్తం టైమ్ పాస్ గానే సాగుతుంది. ఒకే సీన్ చుట్టూ కథ తిరుగుతూ ఎంతకు ముందుకు కదలదు. ఆమిర్‌ఖాన్ మిన‌హా మిగిలిన క్యారెక్ట‌ర్స్‌తో ఎమోష‌న్స్ బ‌లంగా పండ‌లేదు. ఆమిర్‌, క‌రీనా ప్రేమ‌క‌థ అందంగా చూపించ‌లేక‌పోయారు. నాగ‌చైత‌న్య‌, ఆమిర్ ఎపిసోడ్ లో సీరియ‌స్‌నెస్‌, కామెడీ రెండు వ‌ర్క‌వుట్ కాలేదు. బ‌నియ‌న్‌, చెడ్డీ అంటూ ప‌దే ప‌ద డైలాగ్స్ వాడుతూ వ‌చ్చే ఆ ట్రాక్ ఒకానొక‌ద‌శ‌లో చిరాక‌ను తెప్పించింది. చాలా చోట్ల దర్శకుడు లాజిక్స్ మిస్సయ్యాడు. ఆమిర్ ఖాన్ పట్టుకున్న టెర్రరిస్ట్ ఇండియాలో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగినట్లుగా చూపించడం, అతడికి అవార్డులు రావడం కామెడీగా అనిపిస్తుంది.

ఆమిర్ ఒక్కడే బలం...

లాల్‌సింగ్‌చ‌డ్డా పాత్ర‌లో అస‌మాన అభిన‌యాన్ని క‌న‌బ‌రిచాడు ఆమిర్ ఖాన్. అమాయ‌క‌త్వంతో మ‌న‌సులో అంతులేని ప్రేమాభిమానులు క‌లిగిన వ్య‌క్తిగా అద్భుతంగా న‌టించాడు. ఈ క్యారెక్ట‌ర్ కోసం త‌న బాడీలాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ పూర్తిగా మార్చుకొని కొత్త‌గా క‌నిపించాడు. జీవితంలో ఎద‌గ‌డానికి అడ్డ‌దారులు తొక్కిన యువ‌తిగా క‌రీనా క‌పూర్ పాత్ర కొత్త‌గా ఉంది. బాల‌రాజుగా నాగ‌చైత‌న్య త‌న రెగ్యుల‌ర్ స్టైల్‌కు భిన్న‌మైన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించారు. న‌టుడిగా బాలీవుడ్‌లో ఈసినిమా అత‌డికి త‌ప్ప‌కుండా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఆమిర్‌ఖాన్ త‌ల్లిగా మోనాసింగ్ న‌ట‌న ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది.ద‌ర్శ‌కుడిగా అద్వైత్ చంద‌న్ పూర్తిగా మెప్పించ‌లేక‌పోయారు. రీమేక్ సినిమాలో అత‌డి సొంత ముద్ర ఎక్క‌డ క‌నిపించ‌లేదు.

నిడివి ఎక్కువైంది...

దాదాపు 180 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లుగా చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ నిర్మాణ విలువ‌ల ఆ స్థాయిలో లేవు.

కామన్ ఆడియెన్స్ కు కష్టమే...

లాల్‌సింగ్‌చ‌డ్డా ఆమిర్‌ఖాన్ ఆభిమానుల‌ను మిన‌హా కామ‌న్ ఆడియెన్స్‌ను మెప్పించ‌డం క‌ష్ట‌మే. కొత్త త‌ర‌హా క‌థాంశాల్ని ఆద‌రిస్తున్న నేటి త‌రుణంలో ఇలాంటి అవుట్‌డేటెడ్ ఫార్ములా ఆద‌రించ‌డం క‌ష్ట‌మే.

రేటింగ్ 2.5 /5

టాపిక్