Bigg Boss Telugu 6 Episode 73: ఈ సారి బిగ్‌బాస్ విన్నర్‌ ప్రైజ్ మనీకి గండి.. రాజ్‌కు ఇమ్యునిటీ-bigg boss telugu 6 winner prize money reduced for immunity ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss Telugu 6 Winner Prize Money Reduced For Immunity

Bigg Boss Telugu 6 Episode 73: ఈ సారి బిగ్‌బాస్ విన్నర్‌ ప్రైజ్ మనీకి గండి.. రాజ్‌కు ఇమ్యునిటీ

Maragani Govardhan HT Telugu
Nov 16, 2022 06:37 AM IST

Bigg Boss Telugu 6 Episode 73: ఈ సీజన్ పెద్దగా రసవ్తతరంగా సాగలేదని బిగ్‌బాస్ హర్ట్ అయ్యాడేమో తెలియదు.. కానీ ఈ సీజన్ విన్నర్ ప్రైజ్ మనీకి గండి పడింది. ఈ వారం ఇమ్యూనిటీ పొందాలంటే హౌస్ మేట్స్ కొంత ధరకు కొనుగోలు చేయాలని, ఆ మొత్తం విన్నర్ ప్రైజ్ మనీ నుంచి తొలగిస్తామని స్పష్టం చేస్తారు.

బిగ్‌బాస్ 6 73వ ఎపిసోడ్
బిగ్‌బాస్ 6 73వ ఎపిసోడ్

Bigg Boss Telugu 6 Episode 73: బిగ్‌బాస్ హౌస్‌లో సోమవారం నాడు జరిగిన 11వ వారం నామినేషన్ ప్రక్రియ పెద్దగా రసవత్తరంగా సాగలేదనే విషయం తెలిసిందే. శ్రీసత్య-కీర్తి మినహా మిగిలిన వారు పెద్దగా పాయింట్లు, వాదన లేవనెత్తింది లేదు. మంగళవారం నాటి ఎపిసోడ్ వద్దకు వస్తే నామినేషన్స్‌లో జరిగిన గొడవను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు కీర్తి-శ్రీసత్య. అయితే అనుకున్నదొకటి, అయినది ఒకటి అన్నచందంగా గొడవ తగ్గకపోగా.. మరింత పెరిగింది. వీరి మధ్య డిస్కషన్ చాలా సేపు జరిగింది. శ్రీసత్య తనను ఇమిటేట్ చేస్తూ.. వెటకారంగా ప్రవర్తించడం బాధించిందని కీర్తి వాపోయింది. తను చేసింది తప్పని ఫీలైందో ఏమో కానీ.. అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీసత్య-కీర్తి వద్దకు వెళ్లి సారీ చెప్పింది.

అనంతరం బిగ్‌బాస్ నామినేషన్స్‌లో ఉండే వారు తమను సేవ్ చేసుకుని ఇమ్యునిటీ పొందే అవకాశాన్ని కల్పించారు. ఇందుకోసం ఆ ఇమ్యునిటీకి ఓ ధర ఉంటుందని, ఆ మొత్తం విన్నర్ ప్రైజ్ మనీ నుంచి తగ్గిస్తామని స్పష్టం చేశారు. నామినేట్ అయిన సభ్యులు ఒక్కొక్కరిగా వారు ఏ ధరకు ఇమ్యునిటీని కొనుక్కుంటున్నారో చెక్‌లో రాయాలని బిగ్‌బాస్ ఆదేశిస్తారు. ఏ సభ్యుడైతే ఎక్కువ ధర రాస్తారో వారికి ఇమ్యునిటీ లభిస్తుంది. అది కూడా లక్ష నుంచి 5 లక్షల మధ్య ఉంటుందని పేర్కొన్నారు.

నాకు ఇమ్యునిటీ వద్దు: ఆదిరెడ్డి

తొలుత శ్రీహాన్ లక్ష రాయగా.. ఆదిరెడ్డి తానసలు ఇమ్యూనిటినే కోరుకోవడం లేదని స్పష్టం చేస్తాడు. "ఓ సామాన్యుడిగా హౌస్‌లో అడుగుపెట్టాను. జనాలకు నా ఆట నచ్చి 11 వారాలు హౌస్‌లో ఉన్నాను, ఇలాంట ఇమ్యూనిటీ కోరుకుని ఇక్కడి వరకు రాలేదు. ఈ సీజన్ గెలుస్తానని నాకు గట్టిగా నమ్మకముంది. నా ప్రైజ్‌మనీలో రూ.5 లక్షలు కట్ అయినా.. అవతల వ్యక్తి ప్రైజ్ మనీ నుంచి 5 లక్షలు కట్ అవుతాయని తెలిసినా ఆ ఇమ్యూనిటితో ముందుకు వెళ్లాలని లేదు. జనాల ఓట్లతో ముందుకు వెళ్తాను. ఇమ్యూనిటీ కోసం ఎక్కువ అమౌంట్ రాసేవారికి ఇంట్లో ఉండే అర్హతే లేు అంటూ స్పష్టం చేశాడు." అనంతరం ఆదిరెడ్డి లక్ష రాస్తాడు.

రాజ్‌కు ఇమ్యూనిటీ..

ఇక చెక్‌బుక్‌లో శ్రీసత్య, కీర్తి, రేవంత్ ముగ్గురు రూ.4,99,999 అమౌంట్ రాయగా.. మెరీనా, ఇనాయ.. రూ.4,99,998లు రాస్తారు. రోహిత్ రూ.2,51,001లు రాయగా.. రాజ్.. 4,99,700 రాస్తారు. చెక్‌పై రాసే మొత్తాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదని చెప్పినా.. శ్రీసత్య పరోక్షంగా శ్రీహాన్‌తో చెబుతుంది. దీంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తాడు బిగ్‌బాస్. ఒకే అమౌంట్ రాశారనే కారణంతో ముందు రేవంత్, కీర్తిని రిజెక్ట్ చేయగా అనంతరం మెరీనా-ఇనాయాను కూడా తిరస్కరిస్తారు. చివరకు రోహిత్-రాజ్ మిగలగా.. ఇద్దరిలో ఎక్కువ అమౌంట్ రాసిన రాజ్ ఇమ్యూనిటీ పొందినట్లు బిగ్‌బాస్ ప్రకటిస్తాడు.

తర్వాత ప్రైజ్‌మనీని కాపాడుకోవడానికి బిగ్‌బాస్ పలు ఛాలెంజ్‌లు ఉంటాయని సమయానుసారంగా చెబుతారు. మొదటి ఛాలెంజ్‌లో భాగంగా కేవలం 7 నిమిషాల 30 సెకన్ల వ్యవధిలో రన్స్ తీస్తూనే సెంచరీ పూర్తి చేయమన్నాడు. ఇందులో రోహిత్, రేవంత్ పాల్గొని అతి కష్టం మీద 82 పరుగులు తీస్తారు. సెంచరీ పూర్తి చేయకపోవడంతో మరో లక్ష రూపాయలను ప్రైజ్ మీనీ నుంచి కట్ చేశాడు. దీంతో విన్నర్ ప్రైజ్ మనీ రూ.44,00,300కు చేరింది.

అనంతరం ఇంటిసభ్యులకు డబ్బు ఎందుకు అవసరం? వారు డబ్బు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వారికి ప్రైజ్ మనీ ఎందుకు అవసరం? అనేది చెప్పాలన్నాడు. మొదటగా ఫైమా మాట్లాడుతూ.. మా అమ్మకు నలుగురం ఆడపిల్లలం. డబ్బు కోసం చాలా కష్టాలు పడ్డాం. రోజూ పొలం పనికి వెళ్లి ఆ డబ్బుతో నిత్యావసరాలు తెచ్చుకునేవాళ్లం. ఊర్లో ఎన్నో కిరాయి ఇళ్లు తిరిగాం, ఒకసారైతే మా కంటే వేరే వాళ్లకు అద్దె ఎక్కువ ఇస్తామన్నారని, మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నారు. కానీ ఎంత తిరిగినా ఉండటానికి ఇల్లు దొరకలేదని.. మా అమ్మకు మంచి ఇల్లు కట్టివ్వాలనేదే నా కోరిక అంటూ ఫైమా చెప్పుకొచ్చింది.

అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ.. "మా నాన్న సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మా అమ్మ కష్టాలు పడింది. తను 8, 9వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా పొలానికి వెళ్లి గడ్డి మోపులు మోసేదని, నాకిప్పుడు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవని, కానీ మా ఆవిడకు ఇల్లంటే ఇష్టం. బిగ్‌బాస్ ప్రైజ్ మనీతో సొంతిల్లు కొనాలనేదే నా డ్రీమ్" అని అన్నాడు. తర్వాత కీర్తి మాట్లాడుతూ.. "ప్రైజ్ మనీగా వచ్చిన డబ్బులతో నాలాగా ఎవరూ లేని వారిని చేరదీసేందుకుగానూ ఓ ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాను." అని స్పష్టం చేసింది.

అనంతరం శ్రీసత్య మాట్లాడుతూ.. తను చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా పెరిగాను కానీ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ మొదలైన తర్వాత కుటుంబం అంతా మూడు రోజుల పాటు పస్తులు ఉండాల్సి వచ్చింది. డబ్బు లేకుంటే ఎవరూ మనల్ని పట్టించుకోరని వెల్లడించింది. మా అమ్మ అనారోగ్యం కారణంగా మా ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అందుకే మా అమ్మ కోరికగా సొంతిల్లు కొనాలని అని అనుకుంటున్నాను అని చెబుతుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం