Bhakshak Review: భక్షక్ రివ్యూ.. బాలికలపై లైంగిక వేధింపులు.. రియల్ స్టోరీ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?-bhumi pednekar bhakshak review in telugu and rating bhumi pednekar aditya srivastava impress with their roles ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhakshak Review: భక్షక్ రివ్యూ.. బాలికలపై లైంగిక వేధింపులు.. రియల్ స్టోరీ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

Bhakshak Review: భక్షక్ రివ్యూ.. బాలికలపై లైంగిక వేధింపులు.. రియల్ స్టోరీ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Feb 11, 2024 06:29 AM IST

Bhumi Pednekar Bhakshak Review In Telugu: బాలీవుడ్ బ్యూటి భూమి పెడ్నేకర్ జర్నిలిస్ట్ వైశాలి సింగ్ పాత్రలో నటించిన లేటెస్ట్ ఇన్వేస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భక్షక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది భక్షక్ రివ్యూలో తెలుసుకుందాం.

భక్షక్ రివ్యూ.. వసతి గృహాల్లో బాలికలపై లైంగిక వేధింపులు.. రియల్ స్టోరీ మూవీ ఎలా ఉందంటే?
భక్షక్ రివ్యూ.. వసతి గృహాల్లో బాలికలపై లైంగిక వేధింపులు.. రియల్ స్టోరీ మూవీ ఎలా ఉందంటే?

Bhakshak Review Telugu: బాలీవుడ్ గ్లామర్ బ్యూటి భూమి పెడ్నేకర్ తొలిసారిగా నటించిన లేడి ఒరియెంటెడ్ చిత్రం భక్షక్. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ జోనర్‌లో తెరకెక్కిన భక్షక్ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, గౌరవ్ నిర్మించిన ఈ సినిమాకు పుల్‌కిత్ స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం వహించారు. జోత్స నాథ్ రచన సహాకారం చేశారు. అనురాగ్ శుక్లా, క్లింటన్ సెరోజో సంగీతం అందించారు.

భక్షక్ చిత్రంలో భూమి పెడ్నేకర్‌ జర్నలిస్ట్ వైశాలి సింగ్ వంటి ప్రధాన పాత్రలో నటిస్తే.. ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్‌హంకర్, సూర్య శర్మ, సంజయ్ మిశ్రా తదితరులు కీలక పాత్రలు చేశారు. వసతి గృహాల్లో ఉండే అనాథ బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు వంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన భక్షక్ మూవీ ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.

భక్షక్ కథ:

వైశాలి సింగ్ (భూమి పెడ్నెకర్) విలువలు, నిజాయితీ గల జర్నలిస్ట్. మీడియా సంస్థల్లో వారు చెప్పినట్లు చేయడం ఇష్టం లేక తానే కోశిష్ న్యూస్ అనే ఒక న్యూస్ ఛానెల్‌ను నడుపుతుంటుంది. ఆమెకు కెమెరామెన్‌గా భాస్కర్ సిన్హా (సంజయ్ మిశ్రా) ఉంటాడు. ఇద్దరు కలిసి పాట్నాలో జరుగుతున్న వార్తలను చెబుతుంటారు. మరోవైపు పాట్నాలోని మునావర్‌పూర్‌లో ఓ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో అనాథ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్న సంక్షేమ సంఘాలు, ప్రభుత్వం పట్టించుకోదు.

ట్విస్టులు

అందుకు కారణం ఆ వసతి గృహాన్ని బన్సీ సాహు నడిపించడమే. బన్నీ సాహుకు మూడు పాపులర్ న్యూస్ ఛానెల్స్‌తోపాటు స్థానిక రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉంటాయి. దానివల్ల ఆ వసతి గృహంపై ఎవరు ఎలాంటి చర్య తీసుకోరు. ఈ క్రమంలో అక్కడి అరాచకాల గురించి వైశాలికి సమాచారం వస్తుంది. అది తెలుసుకున్న వైశాలి సింగ్ ఏం చేసింది? ముఖ్యమంత్రి వరకు కాంటాక్ట్స్ ఉన్న బన్నీ సాహుపై ఎలా పోరాడింది? ఈ క్రమంలో వైశాలి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఆ బాలికలను వైశాలి కాపాడిందా? అనే అంశాల సముహారమే భక్షక్.

ఆకృత్యాలతో స్టార్ట్

సామాజిక అంశాల నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటి కోవకు చెందినదే భక్షక్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా భక్షక్ తెరకెక్కినట్లు మేకర్స్ తెలిపారు. పాట్నాలోని మునావర్‌పూర్‌ బాలికల వసతి గృహంలో జరిగే ఆకృత్యాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. మొదటి సీన్‌తోనే అక్కడి బాలికలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నారో చూపించారు. అనంతరం జర్నలిస్ట్ వైశాలి సింగ్ క్యారెక్టర్, భర్త, ఫ్యామిలీని చూపించి పాత్రల పరిచయం చేశారు.

ఊహించే విధంగా స్టోరీ

కుటుంబంలో వైశాలిని ఎలా చూస్తారో రెండు మూడు సీన్లతో చెబుతూ తాను ఒంటరిగా పోరాడే మహిళ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక బాలికల వసతి గృహంలోని లైంగిక వేధింపుల గురించి తెలుసుకున్న వైశాలి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిడం, దానిపై ఇప్పటికే ఫిర్యాదులు ఇచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ పట్టించుకోకపోవడంపై ఆరా తీయడం, అధికారులను కలవడం వంటి సీన్లతో సాగిపోతుంది. ఈ క్రమంలో వైశాలిని ఆపేందుకు బన్నీ సాహు ప్రయత్నించడం, వార్నింగ్ ఇవ్వడం అంతా రొటీన్‌గా సాగుతుంది.

ఊపందుకునేలా ఎస్పీ ఎంట్రీ

మునావర్‌పూర్ నుంచి ఇతర వసతిగృహాలకు వెళ్లిన అమ్మాయిల గురించి ఆరా తీసే క్రమంలో నిజాలు తెలుసుకోవడం, అక్కడ అసలు ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు స్టోరీ కాస్తా రొటీన్‌గా అనిపించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కానీ, బన్నీ సాహుపై ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో ఒక్కచోటే ఆగిపోయిన వైశాలికి పాట్నాకు తొలి మహిళా ఎస్పీగా జస్మీత్ కౌర్ (సాయి తమ్‌హంకర్) చార్జ్ తీసుకోవడంతో కథలో కాస్తా ఊపందుకుంటుంది.

ఇంపాక్ట్ లేకుండా

అనంతరం ఎస్పీని వైశాలి కలవడం, సాంఘిక సంక్షేమ శాఖ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు కెమెరామెన్‌తో వైశాలి వేసే ప్లాన్ అలరిస్తుంది. నిజాలు ఉన్న సాక్ష్యాల కోసం వైశాలి ప్రయత్నాలు, తర్వాత సాక్ష్యాలతో బన్నీ సాహును పట్టించడం వంటి విషయాలు ఊహించినట్లుగానే ఉంటాయి. ముందుగా తన విలనిజం చూపించిన బన్నీ సాహు తర్వాత పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సాదాసీదాగా అనిపిస్తుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ కాబట్టి ఇంతకన్నా ఊహించకూడదు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

ఎక్కువ వల్గారిటీ లేకుండా బాలికల అఘాయిత్యాలను బాగా చూపించారు. డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా న్యూస్ ప్రజంటేషన్‌లో వైశాలి వాడే పదాలు ఆకట్టుకుంటాయి. ఇక భక్షక్ మూవీ పెద్దగా ట్విస్టులు లేకుండా కాస్తా బోరింగ్‌గా, కొంచెం ఇంట్రెస్టింట్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో వైశాలి సింగ్ చెప్పే డైలాగ్ హైలెట్ అవుతుంది. ఇక వైశాలి సింగ్‌గా భూమి పెడ్నెకర్ జీవించింది. విలన్‌గా ఆదిత్య శ్రీవాస్తవ అదరగొట్టాడు. సంజయ్ మిశ్రా, సాయి తమ్‌హంకర్ ఇతర పాత్రలు అన్ని బాగా చేశాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఊహించే విధంగా స్టోరీ ఉన్న ఆకట్టుకునే సన్నివేశాలతో ఎంగేజ్ చేస్తుంది భక్షక్.