Balagam Movie : భీమ్స్ మ్యూజిక్‌కు ఫిదా.. బలగం సినిమా ఖాతాలో మరో అవార్డు-bheems ceciroleo wins best music director award for balagam at dada saheb phalke international film festival ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balagam Movie : భీమ్స్ మ్యూజిక్‌కు ఫిదా.. బలగం సినిమా ఖాతాలో మరో అవార్డు

Balagam Movie : భీమ్స్ మ్యూజిక్‌కు ఫిదా.. బలగం సినిమా ఖాతాలో మరో అవార్డు

Anand Sai HT Telugu
May 01, 2023 04:21 PM IST

Balagam Movie : కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఫ్యామిలీ రూరల్‌ డ్రామా ఫిల్మ్‌ బలగం. విడుదలైన రోజు నుంచి నేటి వరకు ఇంకా జనాల్లో పేరు వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే బలగం సినిమా ఖాతాలో పలు అవార్డులు కూడా చేరిపోయాయి. తాజాగా మరో అవార్డు వచ్చింది.

బలగం సినిమాకు మరో అవార్డు
బలగం సినిమాకు మరో అవార్డు

ఇటీవ‌లి కాలంలో సూప‌ర్‌డూప‌ర్ బ్లాక్ బస్టర్ గా హిట్ అయిన సినిమా బ‌లగం(Balagam). బంధాలు, బంధుత్వాల గురించి మ‌న‌సుల‌ను తాకి మ‌రీ చెప్పిన చిత్రం ఇది. వేణు ఎల్దండి(venu yeldandi) దర్శకత్వం వ‌హించిన చిత్రమిది. హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు(Dil Raju) ఈ సినిమాను స‌మ‌ర్పించారు. మ‌న‌సుల‌ను హ‌త్తుకున్న కుటుంబ‌క‌థా చిత్రంగా ప్రేక్షకులను అల‌రించింది బ‌ల‌గం. మౌత్ టాక్‌తో జ‌నాల్లోకి వెళ్లి మ‌ళ్లీ మ‌ళ్లీ చూసేలా చేసింది. అందుకే బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిశాయి.

తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో బంధాలు, బంధుత్వాలు, విలువ‌లు, మ‌ట్టివాస‌న‌ను చెప్పిన బ‌లగం చిత్రానికి(Balagam Movie) ఇప్పటికే ఎన్నో గ్లోబ‌ల్ అవార్డులు అందాయి. ఇప్పుడు తాజాగా 13వ దాదా సాహెబ్ ఫాల్కే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లోనూ ఈ సినిమా పేరు మారుమోగుతోంది. బ‌ల‌గం సంగీత ద‌ర్శకుడు భీమ్స్ సిసిరిలియోకి ఉత్తమ సంగీత ద‌ర్శకుడిగా ఈ వేదిక మీద అవార్డు ద‌క్కింది. భీమ్స్(bheems) తో పాటు నిర్మాత హ‌ర్షిత్ రెడ్డి కూడా ఈ ప్రెస్టీజియ‌స్ అవార్డును అందుకున్నారు.

దాదాపు 780కిపైగా సినిమాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. 81 దేశాల నుంచి సంగీత దర్శకులు పోటీప‌డ్డారు. కానీ తెలంగాణ మ‌ట్టివాస‌న‌, ఇక్కడి సంగీతం మెప్పు పొందింది. బ‌ల‌గం సంగీత‌ దర్శకుడు(Balagam Music Director) భీమ్స్ ను అవార్డు వ‌రించింది. భీమ్స్ ఈ సినిమాకు ప్రాణం పెట్టి ప‌నిచేశారు. ఆయ‌న ప‌డ్డ శ్రమ స్క్రీన్ మీద కనిపిస్తుంది.

ఈ సినిమా ఇప్పటికే పలు అవార్డులు అందుకుంది. సినిమా ఓటీటీ(OTT)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయినా కూడా సినిమాకు రెస్పాన్స్ భారీగా వస్తుంది. ఊర్లలో తెరలు పెట్టి మరీ సినిమాను వేస్తున్నారు. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ఏకంగా 6 అవార్డులను అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. ఏథెన్స్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలోనూ బలగం మూవీ అవార్డును అందుకుంది. ఇక తాజాగా 13వ దాదా సాహెబ్ ఫాల్కే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లోనూ అవార్డు దక్కింది.

ప్రియ‌ద‌ర్శి పులికొండ హీరోగా న‌టించిన సినిమా బ‌లగం. కావ్య క‌ల్యాణ్ రామ్ క‌థానాయిక‌. ముర‌ళీధ‌ర్‌గౌడ్‌, రూపాల‌క్ష్మి, సుధాక‌ర్ రెడ్డి కీల‌క పాత్రల్లో న‌టించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

IPL_Entry_Point

టాపిక్