Bhavanam Movie Review: భవనమ్ రివ్యూ - తెలుగు హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Bhavanam Movie Review: సప్తగిరి, బిత్తిరి సత్తి, షకలక శంకర్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ మూవీ భవనమ్ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. ఈ హారర్ కామెడీ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
Bhavanam Movie Review: టాలీవుడ్ కమెడియన్లు సప్తగిరి, బిత్తిరి సత్తి, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ భవనమ్ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీని టాలీవుడ్ సీనియర్ ప్రొడక్షన్ హౌజ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించింది. బాలాచారి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
దయ్యంతో కష్టాలు...
క్రాంతి (సప్తగిరి) తో పాటు అతడి నలుగురు స్నేహితులు (బిత్తిరి సత్తి, షకలక శంకర్, సప్తగిరి, ధన్‌రాజ్) అనుకోకుండా ఓ మర్డర్ కేసులో చిక్కుకుంటారు. ఆ కేసు నుంచి బయటపడటానికి రెండు కోట్లు అవసరమవుతాయి. ఆ డబ్బు కోసం నకుల్ మహేంద్ర రౌడీని పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని (మాళవికా సతీషన్) కిడ్నాప్ చేస్తారు. క్రాంతి అండ్ గ్యాంగ్ కోసం ఓ వైపు పోలీసులు, మరోవైపు రౌడీలు వెతుకుంటారు. కృష్ణమ్ అనే ఇంట్లో దయ్యాలున్నాయని పుకార్లు వినిపిస్తాయి.
ఆ ఇళ్లు అయితేనే తమను వెతుక్కుంటూ పోలీసులు, రౌడీలు రారని క్రాంతి అండ్ ఫ్రెండ్స్ అనుకున్నారు. ఓనర్ ఆనంద్ కు (అజయ్) తాము సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లమని అబద్ధం చెప్పి రెంట్‌కు తీసుకుంటారు. ఆ ఇంట్లో అడుగుపెట్టి న క్రాంతి అండ్ గ్యాంగ్ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు.
వారిని సత్తి (బిత్తిరి సత్తి) చంపేస్తుంటాడు. సత్తిలో ఉన్న ఆత్మ ఎవరిది? తన స్నేహితుడు హరిశ్చంద్రప్రసాద్‌ను (బాహుబలి ప్రభాకర్) మోసం చేసి ఆనంద్ ఆ ఇంటిని ఎలా సొంతం చేసుకున్నాడు? నిజంగానే క్రాంతి ఫ్రెండ్స్‌ను దయ్యం చంపిందా? అన్నదే ఈ మూవీ భవనమ్ మూవీ కథ.
కత్తి మీద సాము...
హారర్ కథలతో ఆడియెన్స్‌ను మెప్పించడం అంటే కత్తిమీద సాము లాంటిది. ఈ కథలు చాలా వరకు ఒకే ఫార్మెట్‌లో సాగుతుంటాయి. ఓ పాడుబడ్డ బంగళా, అందులో అడుగుపెట్టిన హీరో గ్యాంగ్, వారిని భయపెట్టే దయ్యం కథలతో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో సినిమాలొస్తాయి. వాటిలో సక్సెస్ అయ్యే సినిమాల సంఖ్య నాలుగైదుకు మించి ఉండదు.
కొత్తగా చెప్పాలి...
రొటీన్ కథను కొత్తగా చెప్పే నేర్పు దర్శకుడికి ఉండాలి. ఇది వరకు ఏదో ఒక సినిమాలో సీన్స్, హారర్ ఎలిమెంట్స్ చూశామనే ఫీలింగ్ ఆడియెన్స్‌లో కలగకూడదు. అప్పుడే ఈ హారర్ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. కానీ భవనమ్ సినిమాలో మచ్చుకు కూడా కొత్తదనం ఛాయలు కనిపించవు. సినిమా అటు నవ్వించలేక, ఇటు భయపెట్టలేక ప్రేక్షకుల ఓపికకు, సహనానికి అడుగడుగునా పరీక్ష పెడుతుంది.
ఆడియెన్స్‌కు చుక్కలు...
సప్తగిరి, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి, షకలక శంకర్...ఇలా సినిమాలో చాలా మందే కమెడియన్లు ఉన్నారు. వాళ్లదే మెయిన్ రోల్ అన్నప్పుడు కామెడీ ఓ రేంజ్‌లో ఉంటుందని అడుగుపెట్టిన ఆడియెన్స్‌కు చుక్కలు చూపించాడు డైరెక్టర్. సినిమా మొదలైన విధానం కాస్తంగా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. ఎప్పుడైతే హీరో గ్యాంగ్ ఇంట్లోకి అడుగుపెడతారో అక్కడి నుంచే సినిమా గాడితప్పింది.
దయ్యాన్నే భయపెట్టాలని హీరో గ్యాంగ్ వేసిన ప్లాన్స్ మొత్తం రివర్స్ అయ్యే రిపీటెడ్ సీన్స్‌తో చివరి వరకు కథను లాగించాడు దర్శకుడు. అందులో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా నవ్వించకపోగా చిరాకును తెప్పిస్తాయి. ఇదివరకు తెలుగులో వచ్చిన సూపర్ హిట్ హారర్ సినిమాల నుంచి స్ఫూర్తిపొందుతూ అప్పటికప్పుడు ఆ సీన్స్ రాసినట్లుగా అనిపిస్తాయి.
బ్లాక్ అండ్ వైట్ క్లైమాక్స్...
హారర్ సినిమాల్లో ఓ ఫ్లాష్‌బ్యాక్ కామన్‌గా కనిపిస్తుంది. ఇందులో ఉన్న క్లైమాక్స్ బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి ఓవర్‌డోస్ సెంటిమెంట్‌తో సాగుతుంది. అదైనా దర్శకుడు ఇంట్రెస్టింగ్‌గా చెప్పలేకపోయాడు.
హీరోయిన్ ఉండాలి కాబట్టి...
ఈ సినిమాకు సప్తగిరి హీరోగా కనిపించాడు. కానీ యాక్టింగ్ పరంగా అతడు చేసిందేమీ లేదు. షకలక శంకర్, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్, స్నగ్ధ ఎవరూ నవ్వించలేకపోయారు. సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి మాళవికా సతీషన్‌ను తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. అజయ్ విలనిజం రొటీన్ అన్న పదం కూడా తక్కువే. బాహుబలి ప్రభాకర్‌కు వేసిన మేకప్ చూస్తేసీరియల్స్ బెటర్ అనిపిస్తాయి.
సాహసమే...
భవనమ్ ఆడియెన్స్ ఓపికకు పరీక్ష పెట్టే హారర్ కామెడీ మూవీ. చివరి వరకు చూడటం అంటే సాహసమనే చెప్పాలి.