Atul Parchure: ప్రముఖ కమెడియన్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన నటుడు-atul parchure died of cancer marathi comedian acted in bollywood movies the kapil sharma show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Atul Parchure: ప్రముఖ కమెడియన్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన నటుడు

Atul Parchure: ప్రముఖ కమెడియన్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన నటుడు

Hari Prasad S HT Telugu
Oct 14, 2024 09:30 PM IST

Atul Parchure: 'ది కపిల్ శర్మ షో'లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమెడియన్ అతుల్ పర్చూరే(57) కన్నుమూశాడు. కొన్నేళ్లుగా అతడు క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నాడు.

ప్రముఖ కమెడియన్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన నటుడు
ప్రముఖ కమెడియన్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన నటుడు (HT Photo)

Atul Parchure: ప్రముఖ మరాఠీ నటుడు అతుల్ పర్చూరే కన్నుమూశాడు. అతని వయసు 57 ఏళ్లు. కొన్నేళ్ల కిందట అతుల్ క్యాన్సర్ బారిన పడ్డాడు. అయితే దాని నుంచి పూర్తిగా కోలుకున్నా.. ఇప్పుడతని అకాల మరణం సినిమా ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. అతుల్ మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.

అతుల్ పర్చూరే కన్నుమూత

అతుల్ పర్చూరే సోమవారం (అక్టోబర్ 14) ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. మృతుడికి తల్లి, భార్య, కుమార్తె ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని అతుల్ కుటుంబం కోరింది.

నటి సుప్రియా పిల్గావ్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో నటుడికి నివాళులు అర్పించారు. “ప్రియమైన మిత్రమా నిన్ను ఇలా చూడలేకపోతున్నాను.. చాలా పోరాడావు.. మీరు చాలా భరించారు. మీరు ఎప్పటికీ మిస్ అవుతారు. మీ ఆ నవ్వు ఎప్పటికీ మిస్ అవుతాము. మీ ఆత్మకు శాంతి చేకూరాలని, మీ కుటుంబానికి ఈ కష్ట సమయాన్ని అధిగమించే ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని ఆమె పోస్ట్ చేసింది.

ఏక్ నాథ్ షిండే నివాళి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తన ఇన్ స్టాగ్రామ్ లో మరాఠీలో ఓ నోట్ ను షేర్ చేశారు. "తెలివైన నటుడి అకాల నిష్క్రమణ.. ప్రేక్షకులను బిగ్గరగా నవ్వించే వ్యక్తి, కొన్నిసార్లు కంటతడి పెట్టించే వ్యక్తి. ఎప్పుడూ ఆత్మపరిశీలన చేసుకునే క్లాస్ నటుడు అతుల్ పర్చూరే అకాల మరణం బాధాకరం. అతుల్ పర్చూరే బాల్యం నుంచే తన అద్భుతమైన నట జీవితాన్ని చూపించాడు. నాటకం, చలనచిత్రం, ధారావాహికలు అనే మూడు రంగాలలో వారు తమదైన ప్రత్యేక ముద్ర వేశారు.

మరాఠీ, హిందీ సినిమాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నిష్క్రమణతో ఓ క్లాసీ మరాఠీ నటుడు దూరమయ్యాడు. ఈ నష్టం పూడ్చలేనిది. అతుల్ పర్చూరేకు వేలాది మంది అభిమానుల్లో ఒకరిగా అతని కుటుంబ బాధలో నేనూ భాగమయ్యాను. ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలి. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళులర్పిస్తున్నాను. ఓం శాంతి" అని పోస్ట్ చేశారు.

మరాఠీ, బాలీవుడ్ చిత్రాల్లో అతుల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ తో కలిసి నటించాడు. బుల్లితెరపై ది కపిల్ శర్మ షోలో తన కామెడీ స్కిల్స్ చూపించాడు.

Whats_app_banner