Akshay Kumar in Kannappa: మంచు విష్ణు కన్నప్ప మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో కన్ఫమ్
Akshay Kumar in Kannappa: మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్పలో మరో స్టార్ బాలీవుడ్ నటుడు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో వివిధ సినిమా ఇండస్ట్రీల స్టార్లు నటిస్తున్న విషయం తెలిసిందే.
Akshay Kumar in Kannappa: పాన్ ఇండియా లెవల్లో వస్తున్న మరో ప్రతిష్టాత్మక మూవీ కన్నప్ప. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే ఎంతో మంది స్టార్లు నటిస్తుండగా.. తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా నటించబోతున్నాడు. అతడు త్వరలోనే ఈ మూవీ సెట్స్ లో చేరబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
కన్నప్పలో స్టార్ల క్యూ
కన్నప్ప మూవీని ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా.. ఇప్పటికే ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార, మధుబాలలాంటి స్టార్ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్ రాకతో ఈ పాన్ ఇండియా మూవీ మంచి బాలీవుడ్ టచ్ కూడా ఇచ్చినట్లయింది.
ప్రస్తుతం కన్నప్ప మూవీ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్షయ్ కుమార్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ బడే మియా చోటే మియా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత అతడు కన్నప్ప సెట్స్ లో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా రోజులుగా ఓ మంచి హిట్ కోసం అక్షయ్ వేచి చూస్తున్నాడు.
కన్నప్ప మూవీని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ల కింద నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మధ్యే కన్నప్ప నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ కూడా రిలీజైన విషయం తెలిసిందే. ఇందులో అతడు బాణం ఎక్కుపెడుతూ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.
కన్నప్ప.. భారీ స్థాయిలో..
మంచు విష్ణు కన్నప్ప మూవీ గతేడాది ఆగస్ట్ లో ప్రారంభమైంది. ఈమధ్యే అంటే మహా శివరాత్రినాడు ఆ పరమశివుడి మహా భక్తుడి పేరు మీదుగా వస్తున్న కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మంచు విష్ణు ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. చేతిలో విల్లు పట్టుకొని జలపాతం నుంచి బయటకు వస్తూ మంచు విష్ణు కనిపించాడు.
బ్రేవెస్ట్ వారియర్.. ది అల్టిమేట్ డివోటీ (ఎంతో ధైర్యం కలిగిన యోధుడు.. పరమ భక్తుడు) అనే ట్యాగ్ లైన్ తో ఈ పోస్టర్ తీసుకొచ్చారు. నిజ జీవిత కథ ఆధారంగా మూవీ తెరకెక్కిస్తున్నట్లు కూడా వెల్లడించారు. కన్నప్ప మూవీ ఓ దృశ్యకావ్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక ధైర్యవంతుడైన యోధుడు, శివుడి భక్తుడైన కన్నప్ప కథను తెరపైకి తీసుకొస్తున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరిలోనూ స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది. విష్ణు మంచు ఇంత గొప్ప పాత్రను అంతే గొప్పగా పోషిస్తున్నాడు.
కన్నప్ప మూవీకి మంచు విష్ణు రచయితగా వ్యవహరిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను అనౌన్స్‌చేశారు. అయితే గతేడాది చివర్లో మూవీ షూటింగ్ మొదలు పెట్టారు. కొన్నాళ్లు న్యూజిలాండ్ లో షూటింగ్ జరిగింది. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై విష్ణు భారీ ఆశలే పెట్టుకున్నాడు. తన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నాడు.