Adipurush Controversies: ఆదిపురుష్ సినిమాపై వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. ఈ సినిమా తీసిన తీరు, రామాయణానికి ఆధునికతను జోడించడం, డైలాగుల విషయంలో మూవీ టీమ్ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇవి చాలవన్నట్లు తాజాగా ఈ సినిమాలో డైలాగులు రాసిన గేయ రచయిత మనోజ్ ముంతషిర్ మరో వివాదానికి తెరలేపాడు.
అసలు హనుమంతుడు దేవుడు కాదు భక్తుడే.. మనమే ఆయనను దేవుడిని చేశామని మనోజ్ అనడం గమనార్హం. హనుమంతుడి పాత్రధారితో దారుణమైన డైలాగులు పలికించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆధునికత పేరుతో భగవంతుడితో అలాంటి మాటలు అనిపించడం ఏంటని ఆదిపురుష్ టీమ్ ను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన మనోజ్.. మరో వివాదానికి తెరలేపాడు.
ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు. "సరళమైన భాష వాడటానికి ఓ ముఖ్యమైన కారణం ఉంది. బజరంగబలి ఎంతో బలవంతుడు. ఓ పెద్ద పర్వతానికి ఉన్నంత శక్తి ఉంది. బజరంగబలి దగ్గర ఎన్నో గుర్రాల వేగం ఉంది. అదే బజరంగబలి ఓ బాల సమానుడు కూడా. ఆయన నవ్వుతాడు. ఆయన శ్రీరాముడిలాగా మాట్లాడడు. బజరంగబలి దార్శనిక మాటలు మాట్లాడడు. ఆయన దేవుడు కాదు భక్తుడు. మనమే ఆయనను దేవుడిని చేశాం" అని మనోజ్ అన్నాడు.
అయితే ఈ కామెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నీ మూర్ఖత్వాన్ని ఇప్పటికైనా వదిలెయ్.. ఇప్పటికీ సమయం ఉంది అంటూ అతనికి ట్విటర్ లో క్లాస్ పీకుతున్నారు. మరోవైపు తొలి వీకెండ్ లో అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్లిన ఆదిపురుష్ మూవీ.. తొలి సోమవారం పరీక్షలో విఫలమైంది.
దీనికి తోడు వివాదాలు, నెగటివ్ టాక్ కూడా నాలుగో రోజు కలెక్షన్లపై ప్రభావం చూపింది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.340 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. నాలుగో రోజు కేవలం 35 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో నాలుగు రోజుల కలెక్షన్లు రూ.375 కోట్లకు చేరాయి.
సంబంధిత కథనం