Aamani Chiranjeevi: రొమాన్స్ గురించి ఆలోచిస్తే చిరంజీవితోనే.. పది సార్లు నో చెప్పా: హీరోయిన్ ఆమని-actress aamani reveals why she rejected chiranjeevi movie aamani about chiranjeevi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aamani Chiranjeevi: రొమాన్స్ గురించి ఆలోచిస్తే చిరంజీవితోనే.. పది సార్లు నో చెప్పా: హీరోయిన్ ఆమని

Aamani Chiranjeevi: రొమాన్స్ గురించి ఆలోచిస్తే చిరంజీవితోనే.. పది సార్లు నో చెప్పా: హీరోయిన్ ఆమని

Sanjiv Kumar HT Telugu
Apr 01, 2024 01:48 PM IST

Aamani About Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై సీనియర్ హీరోయిన్, నటి ఆమని తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి అంటే ఎంత పిచ్చో, ఎంత ఇష్టమో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమని ఆసక్తికర విషయాలు చెప్పారు.

రొమాన్స్ గురించి ఆలోచిస్తే చిరంజీవితోనే.. పది సార్లు నో చెప్పా: హీరోయిన్ ఆమని
రొమాన్స్ గురించి ఆలోచిస్తే చిరంజీవితోనే.. పది సార్లు నో చెప్పా: హీరోయిన్ ఆమని

Aamani About Chiranjeevi: అలనాటి స్టార్ హీరోయిన్లలో బ్యూటిఫుల్ ఆమని ఒకరు. సినిమాల్లో ఎంతో హోమ్లీగా కనిపించి మిడిల్ క్లాస్‌ ఆడియెన్స్‌తోపాటు యూత్‌ను ఆకట్టుకున్నారు. మావి చిగురు, శుభలగ్నం, జంబలకిడి పంబ సినిమాల్లో ఆమె చేసిన పాత్రలను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. అయితే, కెరీర్‌లో ఎంతోమంది హీరోలతో కలిసి నటించిన ఆమని తనకు బాగా ఇష్టమైన చిరంజీవితో కలిసి చేయకపోవడంతోపాటు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

"అందరితో నటించారు కానీ, ఒక్కరితో మాత్రం చేయలేదు" అని యాంకర్ అన్నారు. "తెలుసు.. మీరు ఎవరి గురించి అంటున్నారో తెలుసు. మా మెగాస్టార్ చిరంజీవి గారు" అని నవ్వుతూ ఆమని బదులిచ్చారు. "మరి ఎందుకు నటించే అవకాశం రాలేదు" అని యాంకర్ అంటే.. "లేదు, వచ్చింది. అవకాశం ఎందుకు రాలేదు. వచ్చింది. నేను ఎప్పుడు దేవుడిని జపించినట్లు ఆయన్ను జపించేవాన్ని. చిరంజీవి గారంటే పిచ్చి. సినిమా అంటే ఎంత పిచ్చో చిరంజీవి అంత పిచ్చి. రొమాన్స్ సాంగ్ ఏదైనా డ్రీమ్‌లో ఆలోచిస్తే అక్కడ చిరంజీవే ఉంటారు" అని ఆమని నవ్వుతూ అన్నారు.

"డ్రీమ్‌లో హీరోయిన్‌ను తీసేసి అక్కడ నేను చేస్తే ఎలా ఉండేది అని వెళ్లిపోయేదాన్ని. సో ఆయనతో నటించాలన్న డ్రీమ్ ఉండేది. కానీ, నటించే అవకాశం దొరికింది. శుభలగ్నం తర్వాత రిక్షావోడు సినిమాకు ఫస్ట్ నన్ను అడిగారు. డేట్స్ కూడా తీసుకున్నారు. చిరంజీవి గారితో మాట్లాడాను కూడా. షూట్‌కు వెళ్తున్నాం అన్నారు. సౌందర్య గారు కూడా ఉన్నారు సినిమాలో. తను కూడా చాలా సంతోషించింది. మళ్లీ కలిసి చేస్తున్నామే అంది" అని ఆమని తెలిపారు.

"ఒక వారం, 15 రోజుల తర్వాత ఏమైందో తెలియదు గానీ నగ్మా హీరోయిన్ అని ఒక పత్రికలో చూశాను. తర్వాత మా మేనేజర్‌కు చెప్పా. ఏంటీ అని తెలుసుకుంటే.. డైరెక్టర్ మారారు. కోదండ రామిరెడ్డి తీయాల్సిన సినిమాను కోడి రామకృష్ణ గారు చేశారు. అప్పుడు ఏం జరిగిందో తెలియదు. నిజం నాకూ తెలియదు. సో నేను మారాను. చాలా అసంతృప్తి అదొక్కటే. చాలా సార్లు నేను హీరోయిన్ అవ్వలేదని ఏడ్చాను. చిరంజీవి గారి సినిమా దొరకలేదని సెకండ్ టైమ్ ఏడ్చాను. ఈయన పక్కన చేయలేదు అనే ఏడుపు అయితే అప్పుడు వచ్చింది" అని చెప్పారు ఆమని.

"ఇక జీవితాంతం అది అలా ఉండిపోతుంది. ఇంకో ఆప్షన్ లేదు. సిస్టర్ క్యారెక్టర్ కూడా వచ్చింది. కానీ, నేను చేయలేదు. ఖుష్బూ గారు చేశారు. స్టాలిన్. ఆ సినిమాకు అడిగారు నన్ను. నేను సిస్టర్‌గా ఊహించుకోలేను అస్సలు. చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ హీరో అని నేను చేయను అన్నాను. నేను కుదరదు కాక కుదరదు అన్నాను. ఒక 10 సార్లు ఫోన్ చేసి అడిగారు. అయినా నేను చేయను అన్నాను" అని ఆమని చెప్పుకొచ్చారు.

"కే విశ్వనాథ్ గారు మరణించాక కార్యక్రమం చేశారు కదా. దాన్ని చిరంజీవి గారే నడిపించారు. అప్పుడు ఆ కార్యక్రమంలో నాకు చాలా సంతోషమేసింది. చాలా రోజులకు చిరంజీవి గారిని చూస్తున్నాను అని. అప్పుడు అంతా ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. నేను గ్రూపుగా కాకుండా ఒంటరిగా వెళ్లి సార్.. ఒక్క ఫొటో అని అడిగి తీసుకున్నా. నేను ఒక ఫ్యాన్‌గా ఫొటో తీసుకున్నాను. నాకు బాగా నచ్చి ఇష్టపడి అడిగి ఫొటో తీసుకున్న ఏకైక వ్యక్తి చిరంజీవి గారు" అని ఆమని తన ఫ్యాన్ గర్ల్ మూమెంట్ చెప్పారు.

WhatsApp channel