Chiranjeevi: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో వందోసారి రక్తదానం చేసిన నటుడు మహర్షి.. మెగాస్టార్ ప్రత్యేక సన్మానం
Chiranjeevi Blood Bank Maharshi Raghava: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నటుడు మహర్షి రాఘవ ఏకంగా వంద సార్లు రక్తదానం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ నటుడు మహర్షిని కలుసుకుని ప్రత్యేక సన్మానం చేశారు.
Actor Maharshi Blood Donation: తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్త నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టింది ఈ బ్లడ్ బ్యాంక్. దీనికి వ్యవస్థాపకులు అయిన మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తోంది మాత్రం ఆయన అభిమానులు మాత్రమే.
రెండో వ్యక్తిగా
వందలాది మెగాభిమానులు అందిస్తోన్న సపోర్ట్‌తో చిరంజీవి బ్లడ్ బ్యాంకు నిరంతర సేవలను అందిస్తోంది. ఈ బ్లడ్ బ్యాంక్‌కి వెన్నుదన్నుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు. మెగాస్టార్‌పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీ మోహన్ కాగా రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం.
మాటిచ్చిన చిరంజీవి
ఇప్పుడు మహర్షి రాఘవ 100వసారి రక్తదానం చేయటం గొప్పరికార్డుగా నిలిచింది. 100వ సారి రక్తదానం చేస్తున్నప్పుడు కచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు. అయితే అనుకోకుండా 100వ సారి మహర్షి రాఘవ రక్తదానం చేసే సమయంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు.
మొదటగా చేసిన
హైదరాబాద్ వచ్చిన చిరంజీవి ఈ విషయం తెలుసుకుని మహర్షి రాఘవను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఆయనతో పాటు ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం చేసిన మురళీ మోహన్‌ను కూడా కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరితో పాటు మహర్షి రాఘవ సతీమణి శిల్పా చక్రవర్తి కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆపద్బాంధవుడు మూవీ
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ శేఖర్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక సీఈవో రమణస్వామి నాయుడు, మెడికల్ ఆపీసర్ డాక్టర్ అనూషగారి ఆధ్వర్యంలో మహర్షి రాఘవ రక్తదానం చేశారు. ఈ సందర్భంలో మహర్షి రాఘవను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆయన సతీమణి శిల్పా చక్రవర్తితో కలిసి ఆపద్బాంధవుడు చిత్రంలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.
3 నెలలకు ఒకసారి
మూడు నెలలకు ఓ సారి లెక్కన 100 సార్లు రక్త దానం చేయటం గొప్ప విషయమని, ఇలా రక్తదానం చేసిన వ్యక్తుల్లో మహర్షి రాఘవ ప్రప్రథముడని చిరంజీవి అభినందించారు. ఇదిలా ఉంటే, ఇటీవల భోళా శంకర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు విశ్వంభర సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
170కిపైగా సినిమాలు
మహర్షి రాఘవ 170కిపైగా సినిమాల్లో నటించారు. వంశీ డైరెక్షన్‌లో వచ్చిన మహర్షి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి మూవీతోనే సాలిడ్ హిట్ అందుకున్నారు. దాంతో ఆ సినిమా పేరునే తన ఒంటి పేరుగా మహర్షి రాఘవగా యాడ్ చేసుకున్నారు. ఆ తర్వాత చిత్రం భళారే విచిత్రం, జంపలకిడిపంబ వంటి అనేక సినిమాల్లో అలరించారు నటుడు మహర్షి రాఘవ.