Teacher Movie: నితిన్‍తో కంటే ముందు ‘కలర్స్ స్వాతి’తో 90s వెబ్ సిరీస్ దర్శకుడి సినిమా.. టైటిల్ కూడా రివీల్
Teacher Movie: 90s వెబ్ సిరీస్ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఫస్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. కలర్స్ స్వాతి ఈ చిత్రం ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కూడా ఖరారైంది.
Teacher Movie: ‘#90s: ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. ఈ ఏడాది జనవరిలో ఈటీవీ విన్‍లో వచ్చిన ఆ సిరీస్ భారీ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ఆ సిరీస్‍తో దర్శకుడు ఆదిత్య హాసన్ చాలా ఫేమస్ అయ్యారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. నితిన్‍తో ఓ మూవీ కోసం తాను అడ్వాన్స్ కూడా తీసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య హాసన్ చెప్పారు. అయితే, ఆ మూవీ కంటే ముందు ఆదిత్య హాసన్ వేరే సినిమా చేస్తున్నారు. హీరోయిన్ స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి) ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతోనే సినిమాల్లో అడుగుపెడుతున్నారు.
టైటిల్ ఇదే
కలర్స్ స్వాతి - డైరెక్టర్ ఆదిత్య హాసన్ సినిమా పోస్టర్ రిలీజ్ అయింది. శ్రీరామనవమి సందర్భంగా నేడు (ఏప్రిల్ 17) ఈ సినిమా టైటిల్‍ను మూవీ టీమ్ రివీల్ చేసింది. ఈ చిత్రానికి ‘టీచర్’ అనే పేరును ఖరారు చేసింది. టీచర్ టైటిల్‍పై స్వాతి అని పేరు ఉంది.
90s సిరీస్‍ను నిర్మించిన నవీన్ మేడారం.. టీచర్ చిత్రానికి కూడా నిర్మాతగా ఉన్నారు. కలర్స్ స్వాతితో పాటు బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల, నిత్యశ్రీ, రాజేంద్ర గౌడ్, 90s ఫేమ్ సిద్ధార్థ్, హర్ష ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
పోస్టర్ ఇలా..
టీచర్ పోస్టర్‌ను కూడా మూవీ టీమ్ పోస్ట్ చేసింది. దీన్ని చూస్తే విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. స్కూల్‍కు వెళ్లే టీనేజ్ అబ్బాయి, అమ్మాయి మధ్య లవ్ స్టోరీ ఉండనుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో స్కూల్ టీచర్‌గా స్వాతి నటించనున్నారు.
టీచర్ మూవీకి సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా అజీమ్ మహమ్మద్ ఉన్నారు. ఇక, ఈ మూవీ రిలీజ్ డేట్‍ను టీమ్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కలర్స్ స్వాతి ఇటీవల చాలా సెలెక్టివ్‍గా చిత్రాలు చేస్తున్నారు. నవీన్ చంద్రతో ఆమె నటించిన మంత్ ఆఫ్ మధు చిత్రం గతేడాది రిలీజ్ అయింది. కమర్షియల్‍గా ఆ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా మంచి సినిమాగా ప్రశంసలు పొందించింది. ఎమోషనల్ సీన్లలో కలర్స్ స్వాతి అద్భుతంగా నటించారు.
90s వెబ్ సిరీస్ గురించి..
ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన 90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ జనవరిలో ఈటీవీ విన్‍లోకి వచ్చింది. సీనియర్ యాక్టర్ శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళి తనూజ్ ప్రశాంత్, రోహన్, వసంతిక ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. 1990ల్లో ఓ మధ్యతరగతి కుటుంబ పరిస్థితులు, స్థితిగతులు, ఆలోచన విధానాన్ని ఈ సిరీస్‍ల్లో ఆవిష్కరించారు దర్శకుడు ఆదిత్య. ఈ సిరీస్‍పై చాలా మంది ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు.
ఆదిత్య హాసన్ లైనప్
హీరో నితిన్‍తో ఓ మూవీ చేయనున్నానని స్వయంగా ఆదిత్య హాసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, నితిన్ ప్రస్తుతం రాబిన్‍హుడ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే, సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంలోనూ ఆదిత్య హాసన్ మరో సినిమా చేయనున్నారు. టీచర్ తర్వాత నితిన్‍తో మూవీని ఆయన మొదలుపెట్టే అవకాశం ఉంది.