12th Fail: చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ సినిమా.. ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ మూవీగా..
12th Fail Movie: 12th ఫెయిల్ సినిమా ప్రశంసలతో పాటు చాలా ఘనతలను కూడా దక్కించుకుంటోంది. ఐఎండీబీ జాబితాలో తాజాగా మరో ఫీట్ సాధించింది. ఓ ఘనత దక్కించుకున్న ఏకైక భారతీయ మూవీగా నిలిచింది. ఆ వివరాలివే..
12th Fail: బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ‘12th ఫెయిల్’ సంచలనాలు సృష్టిస్తోంది. బడ్జెట్ పరంగా చిన్న మూవీగా వచ్చి.. మంచి వసూళ్లను సాధించింది. అంతకంటే మించి ప్రశంసలను దక్కించుకుంది. ఓటీటీలోకి వచ్చాక 12th ఫెయిల్ చిత్రం చాలా ఫేమస్ అయింది. చాలా మంది ప్రముఖులు, ప్రేక్షకులు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో మనోజ్ కుమార్ పాత్ర పోషించారు విక్రాంత్ మాసే. తాజాగా, 12th ఫెయిల్ మూవీ మరో ఘనత దక్కించుకుంది.
ఐఎండీబీ ఆల్ టైమ్ గ్లోబల్ బెస్ట్ సినిమాల జాబితాలో 12th ఫెయిల్ చిత్రం 50వ స్థానాన్ని దక్కించుకుంది. ఆల్‍టైమ్ గ్లోబల్ 250 జాబితాలో 50 ప్లేస్‍లో నిలిచింది. ఐఎండీబీ గ్లోబల్ టాప్-50 లిస్టులో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ చిత్రంగా 12th ఫెయిల్ చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా కూడా వెల్లడించారు.
ఐఎండీబీ ఆల్ టైమ్ టాప్-250లో 12th ఫెయిల్ (9.2 రేటింగ్) మూవీకి చోటు దక్కిందని, విధు వినోద్ చోప్రా ఎంతో ఆరాధించే ‘సినిమా పారడిసో’ తర్వాతి స్థానానికి వచ్చిందని విధు వినోద్ చోప్రా ఫిల్మ్స్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. తాను ఎంతో ఇష్టపడే సినిమా పారడిసో తర్వాత తన చిత్రాన్ని చూస్తుంటే మాటలు రావడం లేదని వినోద్ రాసుకొచ్చారు. ఇప్పటికే ఐఎండీబీలో 9.2 రేటింగ్‍తో బెస్ట్ భారతీయ సినిమాల జాబితాలో 12th ఫెయిల్ టాప్‍లో ఉంది.
12th ఫెయిల్ సినిమా ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సెలెబ్రేట్ చేసుకుంది. ఈ మూవీ చేస్తున్నప్పుడు తన భార్యతో పాటు చాలా మంది కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని సలహా ఇచ్చారని విధు వినోద్ చోప్రా తెలిపారు. ఈ చిత్రం థియేటర్లలో ఆడదని అన్నారని గుర్తు చేసుకున్నారు. అయితే, స్ఫూర్తిదాయకంగా ఉన్న ఉన్న ఈ చిత్రం థియేటర్లలోనూ మంచి హిట్ అయింది.
ఫిల్మ్ ఫేర్ అవార్డులు
ఇటీవల ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ 12th ఫెయిల్ మూవీ ఆధిపత్యం చూపింది. ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్ చోప్రాకు అవార్డు దక్కింది. ఉత్తమ నటుడి (క్రిటిక్స్)గా విక్రాంత్ మాసే పురస్కారం దక్కించుకున్నాడు. మొత్తంగా ఈ మూవీకి ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.
12th ఫెయిల్ మూవీ గురించి..
మారుమూల ప్రాంతం నుంచి వచ్చి, ఓ దశలో 12వ తరగతి ఫెయిల్ అయి.. ఆ తర్వాత ఎన్నో కష్టాలను అధిగమించి ఐపీఎస్ అధికారి అయిన మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా 12th ఫెయిల్ చిత్రాన్ని విధు వినోద్ చోప్రా తెరకెక్కించారు. అనురాగ్ పాఠక్ రాసిన 12th ఫెయిల్ బుక్ ఆధారంగా అదే పేరుతో సినిమా చేశారు. ఈ మూవీలో మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మాసే నటన అందరినీ ఆకట్టుకుంది.
12th ఫెయిల్ చిత్రంలో శ్రద్ధా జోషి పాత్రలో మేధా శంకర్ మెప్పించారు. ఈ మూవీలో అనంత్ వీ జోషి, ఆయుష్మాన్ పుష్కర్, ప్రియాన్షు చటర్జీ, గీతా అగర్వాల్, హరీశ్ ఖన్నా, సరితా జోషి కీలకపాత్రలు పోషించారు. దర్శకత్వం వహించిన విధు వినోద్ చోప్రా నిర్మాతగానూ వ్యవహరించారు. షాంతనూ మొయిత్రా సంగీతం అందించారు. ప్రస్తుతం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.