Modi in Mahabubnagar : నేను ఎవరి పేరు చెప్పలేదు, కానీ రేవంత్ రెడ్డి భుజాలను తడుముకుంటున్నారు - మోదీ
Modi Election Campaign in Mahabubnagar : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్ఆర్ ట్యాక్స్ మొదలైందని ప్రధాని మోదీ మరోసారి విమర్శించారు. ఈ విషయంలో తాను ఎవరి పేర్లు చెప్పకపోయినప్పటికీ… రేవంత్ రెడ్డి ఎందుకు భుజాలను తడుముకుంటున్నారని ప్రశ్నించారు.
Modi Election Campaign in Telangana : పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయలను ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేటలో తలపెట్టిన సభలో పాల్గొన్న మోదీ… కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకున్నారని మోదీ విమర్శించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల్లో అవినీతికి పాల్పడితే… కాంగ్రెస్ వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే అవినీతి చేసే పనిలో పడిందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తూ…ఢిల్లీ పెద్దలకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఈ ట్యాక్స్ విషయంలో తాను ఎవరీ పేరు చెప్పకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి భుజాలు తడుముకుంటున్నారని కామెంట్స్ చేశారు.
“దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు ఇవి.. కాంగ్రెస్ కూటమి అబద్ధపు హామీలిస్తోంది.. మోడీ గ్యారెంటీ అంటే, అభివృద్ధికి గ్యారెంటీ.. రాబోయే ఐదేళ్లలో మూడుకోట్ల ఇళ్ల నిర్మాణానికి గ్యారెంటీ.. 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం అందించే గ్యారెంటీ” అని మోదీ వ్యాఖ్యానించారు.
“కాంగ్రెస్ లోని యువరాజుకు అమెరికాలో ఓ రాజగురువు ఉన్నాడు. తెలంగాణ వాళ్లను ఆఫ్రికన్లతో పోల్చి మాట్లాడుతున్నాడు. జాతి వివక్ష దిశగా మాట్లాడుతున్నాడు. హిందూ దేవుళ్లను పూజించటం, అయోధ్యకు వెళ్లటం కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. దేశంలో ఒక్కో ప్రాంతాన్ని విభజించేలా కాంగ్రెస్ మాట్లాడుతుంది. హిందువులను రెండో తరగతి పౌరులుగా చూస్తుంది. ఈ దేశాన్ని కులాల వారీగా విభజించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రిజర్వేషన్లను తీసివేస్తామని బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది” అని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ కులాలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశం తెరపైకి వచ్చినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది. మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ ఇదే ప్రయత్నం చేసింది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కాపాడేందుకు చౌకీదార్ గా ఉంటాను" అని మోదీ చెప్పుకొచ్చారు.
అభివృద్ధికి వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మోదీ పిలుపునిచ్చారు. మోదీ శక్తిని పెంచాలంటే మహబూబ్ నగర్ లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న డీకే అరుణను గెలిపించాలని కోరారు. "మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి. ఓ మహిళ అయిన అరుణపై ముఖ్యమంత్రి అవమానకరమైన భాషను మాట్లాడుతున్నాడు. దీనికి మీరంతా ఓటుతోనే బదులివ్వాలి" అని మోదీ పిలుపునిచ్చారు.