Medak Congress MP Seat 2024 : ఆ ఇద్దరే కాదు తెరపైకి నీలం మధు..! 'హస్తం' పార్టీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
Medak Lok Sabha Constituency News: ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కపోవటంతో బయటికి వచ్చారు నీలం మధు. బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇటీవలే మళ్లీ కాంగ్రెస్ లో చేరిన ఆయన… మెదక్ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు.
Medak Lok Sabha Elections 2024 : లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, మెదక్ లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని దింపాలనే అంతర్మధనం జరుగుతుంది. మెదక్ స్థానం నుండి గతంలో ఏడూ సార్లు గెలిచిన రికార్డు ఆ పార్టీకి ఉంది. అంతేకాదు ఇక్కడి నుండి మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీని కూడా పార్లమెంట్ కు పంపిన ఘన చరిత్ర కలిగి ఉన్నది. అయితే… ఇప్పుడు పార్టీ పరిస్థి చూస్తే మాత్రం గతమంతా చరిత్ర మాత్రమేనని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి ఉందన్న టాక్ ఉంది. మరికొద్ది రోజుల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కూడా హస్తం జెండా ఎగరవేయాలని భావిస్తోంది.
ఆ తర్వాత గెలుపు లేదు…
కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్ సభ స్థానాన్ని 1998 తర్వాత ఎప్పుడు గెలవలేదు, అంతకు మునుపు జరిగిన 12 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు ఘనవిజయం సాధించింది. 2004 లోక్ సభ ఎన్నికల నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా భారత రాష్ట్ర సమితి మాత్రమే ఇక్కడ విజయం సాధించింది. ఈ లోక్ సభ స్థానం పరిధిలో ఉన్న ఏడూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఆరు నియోజకవర్గాలను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ సాధించడం ఆ పార్టీకి ఇక్కడ ఉన్న పట్టును తెలియజేస్తుంది. ఒక్క మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం తప్ప, మిగతా ఆరు నియోజకవర్గాలను కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది. ఇలాంటి పరిస్థితిలో, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించడం పక్కనపెడితే, గట్టిపోటీ ఇవ్వటం కూడా సాధ్యం కాని పరిస్థితి నెలకొని ఉన్నదీ. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మంచి ఉత్సాహంలో ఉన్నది. ఎలాగైనా మెదక్ లోక్ సభ స్థానం నుండి, ఈ సారి గెలవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, క్యాడర్ కృతనిశ్చయంతో ఉన్నారు.
ముదిరాజు సామాజికవర్గ ఓట్లు కీలకం........
మెదక్ సీటుపై కన్నేసిన కాంగ్రెస్…. ఇటీవలే ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నీలం మధు ముదిరాజును పార్టీ లోకి తిరిగి ఆహ్యానించింది. మెదక్ లోక్ సభ స్థానం పరిధిలో ఉన్న ఏడూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిధిలోకూడా, ప్రతీ నియోజకవర్గంలో కూడా 50,000 లకు తక్కవ కాకుండా ముదిరాజు ఓట్లు ఉండటం కాంగ్రెస్ పార్టీ ఆ ఓటర్లకు గాలెం వేయటంలో ఒక కీలక ముందడుగు వేసిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ లో ఇప్పటి వరకు సంగారెడ్డి నుండి పోటీచేసి ఓడిపోయిన జగ్గా రెడ్డి, మల్కాజిగిరి నుండి పోటీచేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంత రావు మెదక్ లోక్ సభ స్థానానికి పోటీపడుతుండగా… ఇప్పుడు కొత్తగా నీలం మధు కూడా ఆ జాబితాలో చేరారు. నీలం మధు యువ నేత కావటం… తన సామజిక వర్గం కూడా ఇక్కడ బలంగా ఉండటం తనకు కలిసివస్తుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది.
సీనియర్లు ఓకే అంటే మధునే బరిలోకి.......
మంత్రి దామోదర రాజనరసింహ కూడా, నీలం మధు పార్టీలో చేరటం వలన తమ పార్టీ మెదక్ లోక్ సభ స్థానం పరిధిలో లాభం పొందుతున్నదని అభిప్రాయపడ్డారు. దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి, హనుమంత రావు ఆశీస్సులు ఉంటే… నీలం మధు తప్పకుండా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపగలడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం.. నీలం మధుని ఎన్నికలో బరిలో దించాలని నిర్ణయించుకుంటే.. మిగతా అభ్యర్థులకంటే ఎక్కువ పోటీ ఇవ్వగలడని కాంగ్రెస్ క్యాడర్ కూడా భావిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో, కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి