Lok Sabha polls: త్వరలో 150 స్థానాల్లో బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా; లిస్ట్ లో తెలంగాణ సీట్లు!
Lok Sabha polls: 2024 లోక్ సభ ఎన్నికల సమరానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. అతి త్వరలోనే 150 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ తొలి జాబితాను ప్రకటించనుంది. తొలి జాబితా అభ్యర్థుల పేర్లపై చర్చించడానికి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించింది.
Lok Sabha elections: లోక్ సభ అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 110 స్థానాల్లో అభ్యర్థులు ఖరారయ్యారని, మరో 40 సీట్లలో అభ్యర్థులను నిర్ణయించి, మొత్తం 150 స్థానాలను అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించాలని బీజేపీ భావిస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తొలి జాబితాలోనే ప్రధాని మోదీ పేరు
ఈ తొలి జాబితాలోనే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రుల పేర్లు, వారు పోటీ చేయనున్న స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది. పోటీ అధికంగా ఉన్న స్థానాలపై పార్ట అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణుల్లోకి బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అనే సందేశాన్ని పంపడంతో పాటు అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి తగినంత సమయం కేటాయించడమే లక్ష్యంగా అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. గత సంవత్సరం జరిగిన మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టఫ్ స్థానాలైన 39 సీట్లకు 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఆ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
తెలంగాణ స్థానాలు కూడా
తెలంగాణ (Telangana BJP) లో నాలుగైదు స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలో చేర్చే అంశంపై పార్టీ సీఈసీ సమావేశంలో చర్చించారు. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, అర్వింద్ ధర్మపురిలకు టికెట్ దక్కే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ లోని 50 లోక్ సభ స్థానాలపై చర్చించారని, అందులో సగానికిపైగా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ (సోనే లాల్ పటేల్)కు రెండు సీట్లు, జయంత్ చౌదరికి చెందిన రాష్ట్రీయ లోక్ దళ్ కు రెండు సీట్లు, ఓం ప్రకాశ్ రాజ్ భర్ కు చెందిన ఎస్పీబీఎస్పీకి ఒక స్థానం, సంజయ్ నిషాద్ పార్టీకి ఒక స్థానం దక్కనుంది. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి 400 సీట్లు సాధించాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో మరో దఫా సీఈసీ సమావేశాలు జరగనున్నాయి.
తొలి జాబితాలోనే అక్షయ్, కంగనా
కాగా, బీజేపీ కి అనుకూలురుగా పేరు గాంచిన ప్రముఖ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ లకు బీజేపీ ఈ ఎన్నికల్లో (Lok Sabha elections) అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలోనే వారి పేర్లను ప్రకటిస్తుందని సమాచారం. కాగా, ఢిల్లీ లోని ఒక స్థానం నుంచి అక్షయ్ కుమార్ ను, హిమాచల్ ప్రదేశ్ నుంచి కంగన రనౌత్ ను లోక్ సభ బరిలో నిలపాలని బీజేపీ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.