Hyderabad Congress MP Seat : హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు? సస్పెన్స్ కు తెర పడేదెప్పుడు?-hyderabad congress mp candidate announcement suspension remains mim bjp brs speed up campaign ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Hyderabad Congress Mp Seat : హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు? సస్పెన్స్ కు తెర పడేదెప్పుడు?

Hyderabad Congress MP Seat : హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు? సస్పెన్స్ కు తెర పడేదెప్పుడు?

HT Telugu Desk HT Telugu
Apr 20, 2024 04:56 PM IST

Hyderabad Congress MP Seat : హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పలువురి అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీలు ప్రచారం దూసుకుపోతుంటే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు?
హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు?

Hyderabad Congress MP Seat : త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్(Lok Sabha Election Notification) జారీ అయినప్పటికీ...... హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈనెల 25 వరకు నామినేషన్ లు సమర్పించేందుకు గడువు ఉన్నప్పటికీ.....అభ్యర్థి ఎంపికపై చివరి నిమిషం వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడడం పాతబస్తీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తుంది. ఒకవైపు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసి....ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసేది ఎవరో అని ఇప్పటి వరకు తెలియకపోవడంతో హైదరాబాద్(Hyderabad Seat) లో మజ్లిస్, కాంగ్రెస్ ఒకటయ్యారా? ఆ సీటును మజ్లిస్ కే వదిలేశారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత 40 ఏళ్లుగా మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంపై ఈసారి ఎలాగైనా తాము విజయం సాధించి 40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయాలని బీజేపీ భావిస్తుంది. బీజేపీతో పాటు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ఈ స్థానం అభ్యర్థిని ముందే ప్రకటించింది. కమలం పార్టీ నుంచి ప్రముఖ సంఘ సేవకురాలు, విరించి హాస్పిటల్స్ అధినేత్రి కొంపల్లి మాధవి లత బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక గులాబీ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక మజ్లిస్ పార్టీ నుంచి హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(asaduddin owaisi) నామినేషన్ బరిలో ఉండనున్నారు. అసదుద్దీన్ ఇప్పటికే తన నామినేషన్ సైతం దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు అనేది నేటి వరకు కూడా స్పష్టత రాకపోవడం, పూటకో కొత్త పేరు వినిపిస్తుండడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై ఇంకా వీడని ఉత్కంఠ

పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. 26న స్కూటీని, 29న ఉపసంహరణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్(Election Notification) జారీ చేసింది. ఇక మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు అనంతరం ప్రచారానికి రెండు వారాలు గడువు కూడా లేకపోవడంతో కాంగ్రెస్(Congress) పార్టీ క్యాడర్ ఆందోళనకు గురవుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లోక్ సభ పరిధిలో కార్యకర్తలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వీలైనంత త్వరగా పార్టీ అభ్యర్థిని ప్రకటించాలని ఏఐసీసీ(AICC)తో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డిని సైతం కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. ఇది పక్కకు పెడితే....హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఎంఐఎం(MIM), కాంగ్రెస్ మధ్య స్నేహపూర్వక పోటీనే ఉంటుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో బీఆర్ఎస్ అధికారం ఉన్న సమయంలో మజ్లిస్ పార్టీ గులాబీ పార్టీ మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగింది. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు అంటూ ఎవరు ఉండరని కాంగ్రెస్ విషయంలోనూ అదే జరుగుతుందనే టాక్ బలంగా వినబడుతుంది. ఎంఐఎం తో దోస్తానా పలు రకాలుగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని ఆ పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం. పాతబస్తీ(Old City)లో మజ్లిస్ తో స్నేహపూర్వకంగా ఉంటే ఆ ప్రభావం మైనారిటీ ఓటర్లపై పడి రాష్ట్రంలో ఇతర నియోజకవర్గంలో ఉన్న మైనార్టీ ఓట్లు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ ఉంచిన కాంగ్రెస్.....బలమైన అభ్యర్థిని నిలబెట్టి మజ్లిస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుందా? లేక నామమాత్రంగా అభ్యర్థిని పెట్టి మజ్లిస్ కు సహకరిస్తుందా? అనేది వేచి చూడాలి.

రోజుకో కొత్త పేరు తెరపైకి

ఒకవైపు నామినేషన్(Nomination) దాఖలు గడువు సమీపిస్తుండగా..... హైదరాబాద్ లోక్ సభ స్థానానికి (Hyderabad MP Seat)కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో నెలకొన్న సస్పెన్స్ కు తెర ఎప్పుడు దించుతారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఎంతో మంది పోటీ పడుతున్నారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు వలీవుల్ల అలీ మస్కతి(Ali Masqati) బరిలో ఉంటారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే పలు కారణాలవల్ల అలీ మస్కతి పోటీలో ఉండేందుకు నిరాకరిస్తున్నారని ప్రచారం సాగుతోంది. వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది సహనాజ్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్(Mohammad Azharuddin), స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా(Sania Mirza) పేర్లు పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ ఎంఐఎంకు బలమైన అభ్యర్థిని బరిలోకి దించకపోతే డిపాజిట్ కూడా గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, కనీస పోటీ ఇవ్వలేని అభ్యర్థిని బరిలో దింపితే దాని ప్రభావం పార్టీ పై పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి హాట్ సీట్ గా మారిన హైదరాబాద్ లోక్ సభ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేది ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel

సంబంధిత కథనం