Hyderabad Politics : ప్రచార స్పీడ్ పెంచిన మజ్లిస్ పార్టీ, రోజుకో డివిజన్ లో ఇఫ్తార్ విందులు!
Hyderabad Politics : హైదరాబాద్ లో పోలింగ్ శాతాన్ని పెంచే పనిలో పడింది మజ్లిస్ పార్టీ. గెలుపుపై ధీమా ఉన్న మజ్లిస్...మెజార్టీ పెంచుకునే పనిలో ఉంది. రంజాన్ ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటూ ప్రచారం ముమ్మరం చేసింది.
Hyderabad Politics : త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ(AIMIM Party) దూకుడు పెంచింది. ఇప్పటికే పాదయాత్రలతో ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టిన మజ్లిస్ పార్టీ.....రంజాన్ మాసం ఇఫ్తార్ విందును సైతం ఎన్నికలకు సద్వినియోగం చేసుకుంటుంది. హైదరాబాద్ పరిధిలోని రోజుకో డివిజన్ లో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో ఆ పార్టీ అధినేత,హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin owaisi), లోకల్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొనడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మజ్లిస్ పార్టీకి హైదరాబాద్ పార్లమెంట్ స్థానం గెలుపుపై పెద్దగా ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ...పోలింగ్ శాతాన్ని భారీగా పెంచేందుకు మజ్లిస్ పార్టీ సరికొత్త వ్యూహాలకు తెర తీసింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని మరింత పెంచడంపై ఎంఐఎం దృష్టి పెట్టింది.
పోలింగ్ శాతాన్ని పెంచుకునే దిశగా
హైదరాబాద్ లోక్ సభ (Hyderabad Lok Sabha)పరిధిలో మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజిక వర్గం వారే. పోలింగ్ ఎంత ఎక్కువగా నమోదు అయితే అంతే స్థాయిలో మెజారిటీ పెరుగుతుందని మజ్లిస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి పోలింగ్ శాతమే మెజారిటీపై ప్రభావం చూపుతుంది.హైదరాబాద్ లోక్ సభకు తొలి సరిగా జరిగిన ఎన్నికల్లో మజ్లిస్(Majlis) అభ్యర్థిగా బరిలో దిగిన అబ్దుల్ వహీద్ ఒవైసీ.....ఆ తరువాత బరిలో దిగిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఓటములకూ పోలింగ్ శాతమే ప్రభావం చూపింది. ఆ తరువాత పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించడంతో సుల్తాన్ సలావుద్దీన్ జైత్రయాత్ర ప్రారంభమైంది. అనంతరం అసదుద్దీన్ ఒవైసీ విజయ పరంపర కొనసాగింది. క్రమంగా పెరుగుతున్న పోలింగ్ శాతం మజ్లిస్ ను ఎదురులేని శక్తిగా తయారుచేసింది.
హైదరాబద్ పై అన్నీ పార్టీలు గురి
గత నాలుగు పర్యాయాల్లో పాతబస్తీపై(Old City) గట్టి పట్టు సాధించి ఎన్నికలను ఏకపక్షంగా మర్చినప్పటికీ పెరుగుతున్న ఓటర్లకు అనుగుణంగా మెజారిటీ పెరగకపోవడం ఎంఐఎంకు మింగుడు పడని అంశంగా తయారైంది. దీంతో అత్యంత మెజారిటీ కోసం పోలింగ్ శాతం(Polling Percent) పెంపుపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది మజ్లిస్ పార్టీ. ఇదిలా ఉంటే మరోవైపు మజ్లిస్ పార్టీని ధీటుగా ఎదుర్కునేందుకు ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంబీటీ పార్టీలు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా బీజేపీ ఈసారి హైదరాబాద్ లోక్ సభపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందరి కంటే ముందే బీజేపీ...మహిళా అభ్యర్థి మాధవి లతను(BJP Madhavi Latha) బరిలో దింపింది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ వ్యూహాలనే రచిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ముస్లిం సామాజిక వర్గం తరువాత యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కారు పార్టీ, గులాబీ బాస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ (Gaddam Srinivas yadav)ను అభ్యర్థిగా ఖరారు చేశారు.
మహిళా అభ్యర్థిని బరిలో దింపనున్న కాంగ్రెస్?
2004, 2009 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ(Majlis Party)తో అంతర్గత పొత్తు కొనసాగించింది. ఆ తరువాత జరిగిన 2014, 2019 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను బరిలో దింపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ(Congress) మజ్లిస్ కు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. కాగా ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిని బరిలో దింపేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు (Supreme court)అడ్వొకేట్ షహనాజ్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దింపుతారని ప్రచారం జరుగుతుంది. షహనాజ్ వాక్ఫ్ బోర్డు సీఈఓ సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ భార్య. ఆమెను పోటీలోకి దింపితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మొత్తానికి ఉత్కంఠ రేపుతున్న హైదరాబాద్ లోక్ సభ స్థానం(Hyderabad Lok Sabha)లో ఎవరు గెలుపు సాధిస్తారో వేచి చూడాలి.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం